ఔర్‌ ఏక్‌ బా(ప్యా)ర్‌ | Suriya and Jyotika have renewed their wedding vows, after 20 years | Sakshi
Sakshi News home page

ఔర్‌ ఏక్‌ బా(ప్యా)ర్‌

Sep 24 2026 4:21 AM | Updated on Sep 24 2026 5:02 AM

Suriya and Jyotika have renewed their wedding vows, after 20 years

ది సీక్వెల్‌

జీవితంలో ముఖ్యమైన ఘట్టంగా జరిగే వివాహ సమయంలో నూతన దంపతులు కష్ట–సుఖాలలో తోడు నీడుగా ఉంటామని ప్రమాణాలు చేసుకుంటారు. కాలక్రమంలో కట్టుబడి ఉండాల్సిన ప్రమాణాలు మరుగునపడిపోతుంటాయి. దాంపత్య జీవితం ఆనందంగా సాగాలంటే ప్రమాణాల పునరుద్ధరణ జరగాలని దంపతులైన జ్యోతిక–సూర్య ఇటీవల ‘మళ్లీ పెళ్లి’ వేడుక ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా పెళ్లి ప్రమాణాల పునరుద్ధరణ దాంపత్య జీవితానికి ఎలా మేలు చేస్తుందో చూద్దాం...

సినిమా స్టార్‌ కపుల్‌గా పేరొందిన జ్యోతిక–సూర్యలు తమ వివాహం జరిగి 20 ఏళ్లు పూర్తయినందుకు వేడుక జరుపుకున్నారు. ఈ సందర్భంగా సోషల్‌ మీడియా ద్వారా జ్యోతిక చేసిన పెళ్లి ప్రమాణాల పునరుద్ధరణ నవ దంపతులకు సూచికగా ఉందని ఎంతోమంది తమ కామెంట్స్‌ ద్వారా తెలియజేశారు.

ఆనంద జీవనానికి...
సాధారణంగా భార్యాభర్తలకు షష్టిపూర్తి (60 ఏళ్లకు) సందర్భంగా, సప్తతి వందనం (70 ఏళ్లకు), ఆశీతి (80వ పుట్టిన రోజు సందర్భంగా) మళ్లీ పెళ్లి చేస్తుంటారు. ఆ దంపతుల నుంచి నవతరం తమ జీవితానికి ఉపయోగపడే మంచి సూచనలు తీసుకుంటూ ఉంటారు. పెళ్లయిన ఏడాదికే వివాహ బంధానికి బ్రేక్‌ చెబుతున్న నవతరం పునరాలోచించుంచుకోవడానికి, తమ భావి జీవితాన్ని అందంగా మలుచుకునే విధం ‘ప్రమాణాల పునరుద్ధరణ’ ద్వారా జరుగుతుందని నిపుణులు సైతం తెలియజేస్తున్నారు.

స్టార్‌ కపుల్‌... వేడుక కమనీయం
ఈ జంట వివాహం జరిగి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో మరోసారి పెళ్లి ప్రమాణాలు చేసుకొని, వార్షికోత్సవాన్ని ప్రత్యేకంగా జరుపుకున్నారు. ఈ వేడుకలో సూర్య జ్యోతికల పిల్లలు దియా, దేవ్‌ కూడా పాల్గొన్ని సందడి చేశారు. 2006 సెప్టెంబర్‌ 11న హిందూ సంప్రదాయ పద్ధతిలో ఒక్కటైన ఈ జంట ఇరవై ఏళ్ల తర్వాత పెళ్లి వేడుక జరుపుకొని, మరో ఇరవై ఏళ్ల ఆనంద ప్రయాణానికి నాంది పలికారు. 

ఈ సందర్భంగా దాంపత్య జీవితం సాఫీగా సాగడానికి  చేసిన ప్రమాణాలు... 
→ ఇది పరిపూర్ణమైన వివాహానికి జరుపుకునే వేడుక కాదు. అసంపూర్ణతలకు, సర్దుబాట్లకు, అవగాహనకు, త్యాగాలకు, నిస్వార్ధమైన ప్రేమకు నిదర్శనం. నేను సంతోషంగా ఉండే వ్యక్తిగా ఉంటానని ప్రమాణం చేస్తున్నాను. నేను జీవితంలో పాజిటివ్‌ కోణాన్ని మాత్రమే చూడటానికి ఎంచుకుంటాను. నేను జీవితాన్ని వేడుకగా జరపుకుంటానని ప్రమాణం చేస్తున్నాను. మీరు ప్రేమించే వ్యక్తి తనకంటే ఎక్కువగా మిమ్మల్ని గౌరవించినప్పుడు జీవితమే ఒక బహుమతిగా మారిపోతుంది. 

→ ఈ సృష్టిలో ప్రతిదీ అసంపూర్ణంగానే ఉంది. ఆ ఖాళీలను మనం ఎలా పూరించాలని ఎంచుకుంటామనేదే ముఖ్యం. ఆకాశమెంత విశాలమైనా దానికి కూడా భూమిని తాకే భాగ్యం లేదు. ప్రతి ఉదయం నన్ను రక్షించే ఒక వ్యక్తి చేతుల్లో మేల్కొంటున్నందుకు, నా జీవితానికి అర్థాన్నిచ్చిన నా అందమైన పిల్లలకు, నాకు బతకడానికి ఒక కారణాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతతో ఉంటానని ప్రమాణం చేస్తున్నాను.

→ ఆరోగ్యంగా ఉంటాను. ఎందుకంటే మనం నిర్మించుకునే ఏకైక నిజమైన ఆస్తి అదే. ఎంతటి ఆడంబరమైన ఇంటికైనా అప్పుడప్పుడూ లీకేజీలు, చెదలు పడుతుంటాయి. మరమ్మతులు అవసరం అవుతాయి.. 

→ నేను ఉత్తమ తల్లిగా ఉంటానని ప్రమాణం చేస్తున్నాను. వంట చేయడం, శుభ్రం చేయడం లేదా సహాయం చేయడం మాత్రమే కాదు నేను నవ్వడం వల్ల ఆ నవ్వు మా పిల్లలు వాళ్ళ నాన్న–అమ్మ జీవించిన కథను మళ్ళీ జీవించాలని కోరుకునేలా చేస్తుంది.

→ హలో మైడియర్‌ సూర్యా... పోట్లాడి, మళ్ళీ రాజీపడి, ప్రతిసారీ నీకు మరింత దగ్గరయ్యే ఆ అసంపూర్ణమైన భార్యగానే ఎప్పటికీ ఉంటానని ప్రమాణం చేస్తున్నాను.

→ అన్నింటికన్నా ఎక్కువగా మన స్నేహాన్ని పదిలంగా ఉంచుకుంటానని ప్రమాణం చేస్తున్నాను. ఎందుకంటే నీకు సమానమైన వ్యక్తి, నీ రహస్యాలను పంచుకునే వ్యక్తి, నీ కబుర్ల భాగస్వామి, నీ ప్రాణస్నేహితుడు, వీరందరూ నీ భర్త, నీ పిల్లల తండ్రి అయిన ఈ ఒక్క ప్రత్యేక వ్యక్తిలో ఉండటం చాలా అరుదు. కాబట్టి మన రాబోయే ఇరవై సంవత్సరాలకు శుభాకాంక్షలు. అసంపూర్ణమైన మనం, పరిపూర్ణమైన అవగాహనతో కలిసి జీవిద్దాం. 
– జ్యోతిక, నటి


ప్రకాష్‌రాజ్‌–పోనీవర్మ 
తమ 11వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరు మళ్లీ పెళ్లి చేసుకున్నారు. వీరి కుమారుడు వేదాంత్‌ తన కళ్లారా అమ్మానాన్నల పెళ్లిని చూడాలని ఆశపడటంతో కొడుకు సంతోషం కోసం ఈ దంపతులు మళ్లీ పెళ్లిపీటలు ఎక్కారు.

రామ్‌చరణ్‌ – ఉపాసన
తమ 10వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఇటలీలో సింపుల్‌గా సంప్రదాయబద్ధంగా మళ్లీ ప్రమాణాలు చేసుకున్నారు. 

పరిపూర్ణత వైపుగా...
ప్రమాణాలు చేయడం, వాటికి కట్టుబడి ఉండటం దంపతుల మధ్య అన్యోన్యతను పెంచుతుంది. పెళ్లి అంటే ఇద్దరు వ్యక్తులు మాత్రమే కాదు రెండు కుటుంబాల ఐక్యతను కాపాడటం. ఈ బాధ్యతను ఆనందంగా స్వీకరించే వ్యక్తులు జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా నవ్వుతూ పరిష్కరించుకుంటూ ప్రయాణిస్తారు. పిల్లలతో పాటు పెద్దల బాగోగులనూ చూసుకునే బాధ్యత దంపతుల మీద ఉంటుంది. 

అన్నింటినీ సమంగా స్వీకరించే శక్తిని ఇద్దరూ తీసుకోవాలి. ప్రతియేటా తమ పెళ్లి రోజున గుడికో, టూర్‌కో వెళ్లాలనుకునే దంపతులు ఏడాది మొత్తంగా ఏం చేస్తే తమ జీవనం ఆనందంగా మారుతుందో కూడా ΄్లాన్‌ చేసుకుని, దానికి అనుగుణంగా అడుగులు వేస్తే.. ప్రయాణం ఎంత దూరమైనా అలసట అనిపించదు. సమస్యలు వచ్చినప్పుడు విడిపోవాలనే ఆలోచనకు బదులు పరిష్కార దిశగా ఆలోచించి, అవసరమైన పెద్దలు, నిపుణుల సూచనలు తీసుకుంటే దాంపత్య జీవితం పరిపూర్ణతను నింపుకుంటుంది. 
– జ్యోతిరాజ, సైకాలజిస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement