రంగస్థలం
‘తొందర పడకు సుందరవదనా... భవిష్యత్ అనేది తాళం వేసి ఉన్న బాక్స్ లాంటిది. అందులో నీకోసం ఒక గిఫ్ట్ ఎదురుచూస్తుంటుంది’ అని ఒక సినిమా డైలాగ్. జీవితంలో ఆశావాదాన్ని కలిగించే డైలాగ్ ఇది. పరోమిత అనే మహిళ ‘అసలు నేను బతకడం ఎందుకు?’ అనే స్థితి నుంచి... ‘బతకాల్సిందే’ అనుకోవడం వరకు, కవయిత్రిగా అసంఖ్యాకమైన అభిమానులు సంపాదించుకోవడం వరకు సాగే ప్రయాణమే ఈ సరికొత్త బెంగాలీ నాటకం...
‘మనం ఒక నిర్ణయం తీసుకోవడానికి ప్రేమాభిమానాలు కారణం కావచ్చు లేదా భయం కూడా కారణం కావచ్చు’ అంటుంది బెంగాలీ నాటకం బరండే శోబ్దేర్ భీర్ (మాటలు మా వరండాను ముంచెత్తుతున్నాయి) పరోమిత అనే సేల్స్ ఎగ్జిక్యూటివ్ చుట్టూ తిరిగే కథ ఇది. రైటర్, డైరెక్టర్ సుమన్ చక్రవర్తి ఈ నాటకానికి సృష్టికర్త.
కథ ఏమిటంటే...
ముప్పై ఏళ్ల పరోమిత ఏ పని మొదలు పెట్టినా వైఫల్యం ఎదురవుతుంటుంది. ఆఫీసులో వర్క్ టార్గెట్‌లకు రీచ్ కాలేకపోతుంటుంది. ఎవరో ఒకరు ఎప్పుడూ ఆమెను తిడుతూనే ఉంటారు. కుటుంబ జీవితంలో అశాంతి సరేసరి.
‘అసలు నేను ఎందుకు బతకాలి?’ అనే వైరాగ్య స్థితిలోకి వెళుతుంది. ఆ సంక్లిష్ట సమయంలో తన కుమారుడు జోజో కళ్ల ముందు నిలుస్తాడు.
‘వాడి కోసమైనా బతకాలి’ అని కాలంతో పోరాడడానికి నిశ్చయించుకుంటుంది. బతుకులోని చికాకుల సంగతి ఎలా ఉన్నా, పరోమితకు కవిత్వం చదవడం అంటే ఇష్టం. అలాంటి పరోమిత ఒక రోజు తానే స్వయంగా కవిత్వం రాస్తుంది. అలా రాయడం తనకు బాగుంటుంది.
తన మనసులోని అనేకానేక భావాలకు కవిత్వ రూపం ఇస్తుంటుంది. తాను ఎవరితోనూ పంచుకోలేని విషయాలను కవిత్వంగా రాయడం మొదలు పెడుతుంది. దీనివల్ల తన మనసు ప్రశాంతంగా ఉంటుంది. తాను రాసిన కవితలను పుస్తకరూపంలో ప్రచురిస్తుంది. ఆ పుస్తకానికి పాఠకుల నుంచి అనూహ్యమైన స్పందన వెల్లువెత్తుతుంది.
ఆమె కవితలు అతి తక్కువ సమయంలోనే విస్తృత పాఠకాదరణ ΄÷ందుతాయి. సోషల్ మీడియా సెన్సేషన్ అవుతుంది. పాఠకుల విశేష ఆదరణతో ఇంతకుముందెన్నడూ లేని ఆత్మవిశ్వాసం పరోమితలో మొలకెత్తుతుంది. ‘పరోమిత’ పాత్రను రిత్యావృత ఛట్టఖండీ పోషించారు.
వ్యక్తిగత అనుభవం నుంచి...
తన వ్యక్తిగత అనుభవం నుంచి నాటక కథను అల్లుకున్నారు డైరెక్టర్ సుమన్ చక్రవర్తి. సుమన్ కవితలు కూడా రాస్తారు. ‘ఈరోజుల్లో చాలా తక్కువ మంది మాత్రమే కవిత్వాన్ని చదువుతున్నారు. ఉన్నత వర్గాల వారు మాత్రమే కవిత్వం చదువుతారనే అపోహ ఉంది. కవిత్వమనేది అర్థం చేసుకోవడం చాలా కష్టం అనే భావనతో ఆ ప్రక్రియను ప్రజలకు దూరం చేస్తున్నాం.
మీరు రాసిన కొన్ని కవితలతో పబ్లిషర్ దగ్గరకు వెళితే, వారి నోటి నుంచి కచ్చితంగా వినిపించే మాట...ఈరోజుల్లో కవిత్వం ఎవరు చదువుతున్నారు?!
ఈ మాట కవిని బాధ పెడుతుంది. ఇలాంటి బాధ నేను కూడా పడ్డాను. ఆ బాధే ఈ నాటకానికి ప్రేరణగా నిలిచింది. సామాన్యులు కూడా అర్థం చేసుకునే కవిత్వం రాసే కథానాయికను ఈ నాటకం ద్వారా సృష్టించాను’ అంటారు సుమన్.
ఎందుకంటే...
కవి పాత్రకు మహిళనే ఎంచుకోవడానికి కారణం?
కవిత్వ ప్రక్రియలో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉండడం. ‘ప్రసిద్ధ కవులు అంటే పురుషులు మాత్రమే కాదు’ అని చెప్పడం డైరెక్టర్ ఉద్దేశం. పాత్రల భావోద్వేగాలకు అనుగుణంగా వాన్ గో, అమృతా షేర్–గిల్ చిత్రాల నుంచి ప్రేరణ ΄÷ంది ‘బరండే శోబ్దేర్ భీర్’ నాటకం కోసం కాస్టూమ్స్ డిజైన్ చేశారు అస్మితాసేన్ గు΄్తా. నాటకంలోని భావోద్వేగాలకు అనుగుణంగా రవీంద్ర సంగీతం నుండి మెహదీ హాసన్ గజల్స్ వరకు ఎన్నో ఉపయోగించుకున్నారు. నాటకంలో మొత్తం ఎనిమిది కవితలు వినిపిస్తాయి. ఇవి నాటక రచయిత రాసినవే. ‘నా నాటకం చూసిన తరువాత...నేను కవిత్వం ఎందుకు రాయలేను అని ప్రేక్షకులు తమను తాము ప్రశ్నించుకోవాలని నేను కోరుకుంటున్నాను. సోషల్ మీడియా, ఏఐ విజృంభణతో ఆలోచించడం మరిచిపోతున్నాం’ అంటున్నారు సుమన్ చక్రవర్తి.


