– శ్రుతీహాసన్
‘‘నేటి సమాజంలో పెళ్లిళ్ల పేరిట విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు. వివాహాన్ని గొప్ప వేడుకలా చేసుకునే వారిని నేను తప్పు పట్టడం లేదు. అయితే పేరు కోసమో, ఆడంబరాల కోసమో పెళ్లికి కోట్లాది రూపాయలు ఖర్చు చేయడంలో అర్థం లేదు. ఒక్క రోజు సంబరం కోసం అంత ఖర్చు చేసే బదులు ఆ డబ్బుని ఆకలితో, ఇబ్బందుల్లో ఉన్నవారికి దానం చేస్తే ప్రయోజనం ఉంటుంది. మ్యారేజ్‌ని స్టేటస్ సింబల్‌గా మార్చి, డబ్బుని వృథా చేస్తున్న తీరు చూస్తే బాధ కలుగుతుంది’’ అని శ్రుతీహాసన్ పేర్కొన్నారు.
తాజాగా ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పలు విషయాలపై మాట్లాడారు. ‘‘కొన్ని విషయాల్లో నా సొంత ఆలోచనలు, వ్యక్తిత్వానికే నా తొలి ప్రాధాన్యం. నాకు వివాహబంధం అంటే ఇష్టం. కానీ, పెళ్లి పేరుతో బందీగా ఉండడం నచ్చదు. గతంలో ఒకసారి పెళ్లి పీటల దాకా వెళ్లి చివరి నిమిషంలో ఆ బంధం నుంచి వెనక్కి వచ్చేశాను. అయితే నాకు అమ్మగా మారాలని, ఆ మాతృత్వపు అనుభూతిని పొందాలని ఉంది. ఇందుకోసం పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో బిడ్డను దత్తత తీసుకోవాలనుకుంటున్నాను’’ అన్నారు శ్రుతీహాసన్.


