నాని ది ప్యారడైజ్ రిలీజ్ వేళ ఆయన సతీమణి అంజనా ఆసక్తికర పోస్ట్ చేసింది. మీ సినిమా చూడటానికి కాలేజీ ఎగ్గొట్టి మరి మరి వెళ్లామని గుర్తు చేసుకుంది. 2009లో మీ సినిమా విడుదలైన రోజు మొదటి షో పడలేదని తెలిపింది. ఒక కొత్త దర్శకుడికి సమయానికి సినిమా విడుదల చేయడం కూడా ఎంత కష్టమో అని ఆరోజే తనకు తెలిసిందని రాసుకొచ్చింది.
అంజనా తన పోస్ట్‌లో రాస్తూ..'2009 నాకు ఇంకా గుర్తుంది. మీ సినిమా చూడటానికి మేము ఇద్దరం కాలేజీ ఎగ్గొట్టాం. కానీ ఆ రోజు ఉదయం షో కూడా పడలేదు. ఒక కొత్త దర్శకుడికి సమయానికి సినిమా విడుదల చేయడం కూడా ఎంత కష్టమో అని ఆరోజు నేను అనుకున్నా. ఆ సంగతి ఇప్పటికీ నాకు ఇంకా గుర్తుంది. దాదాపు 16 ఏళ్ల తర్వాత.. మీరు ఒక్కో సినిమాతో సంపాదించుకున్న నమ్మకం వల్ల 'ప్యారడైజ్' మూవీకి జనం తరలిరావడం చూస్తుంటే మా అందరికీ చాలా భావోద్వేగంగా అనిపిస్తోంది. ఈ ప్రయాణం ఒక్క రోజులో నిర్మించింది కాదు.. దానికి నేనే ప్రత్యక్ష సాక్షిని. ప్రతి సినిమా మీరు బిడ్డలా భావించడాన్ని నేను చూశా. సినిమా ఎప్పటికీ మీ బిడ్డే. ఈ రోజు రాత్రి 'ప్యారడైజ్' తన తొలి అడుగులు వేస్తోంది. ఏది జరిగినా.. అంతా మంచే జరుగుతుంది. అంతా మంచే జరుగుతుంది ఆంతే.. మరెవ్వరూ లేనంతగా మేము మీకు అండగా ఉన్నాం' అంటూ భావోద్వేగంతో రాసుకొచ్చారు.


