ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సీకి చెందిన బ్లాక్ (Block) సంస్థలోని ఏఐ పరిశోధనా బృందం డెస్సా (Dessa) అనే కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్‌ను అభివృద్ధి చేసింది. దీని ప్రత్యేకత ఏమిటంటే.. సాధారణ ఏఐ మోడళ్ల మాదిరిగా పెద్ద భాషా నమూనా (LLM)పై ఆధారపడకుండా.. మనుషులు మాట్లాడే మాటలను నేరుగా విని స్పందించేలా దీన్ని రూపొందించారు.
ప్రస్తుతం చాట్‌జీపీటీ, జెమిని వంటి వాయిస్ ఏఐ వ్యవస్థలు మనం మాట్లాడిన మాటలను ముందుగా టెక్స్ట్‌గా మార్చి, ఆ తర్వాత వాటిని విశ్లేషించి సమాధానం ఇస్తాయి. అయితే.. మాటలను టెక్స్ట్‌గా మార్చే క్రమంలో గొంతులోని భావోద్వేగాలు.. కామెడీ, నవ్వు, మాట్లాడేటప్పుడు ఇచ్చే విరామాలు వంటి విషయాలు పూర్తిగా అర్థం కాకపోవచ్చు. అయితే డెస్సా మాత్రం నేరుగా మనుషుల మాటలను వింటుంది. ఎదుటివారు మాట్లాడే తీరును, భావాలను మరింత సహజంగా అర్థం చేసుకుని స్పందించేందుకు ప్రయత్నిస్తుంది.
ఈ ఏఐ మోడల్‌లో మరో ఆసక్తికరమైన ఫీచర్ కూడా ఉంది. సాధారణ వాయిస్ అసిస్టెంట్లు మనం మాట్లాడటం పూర్తయ్యే వరకు వేచి చూస్తాయి. కానీ డెస్సా ఒకేసారి వినడంతో పాటు మాట్లాడగలదు. మాటల మధ్యలోనే స్పందించడం, 'అవును', 'అర్థమైంది' వంటి మాటలతో బదులివ్వడం, సరదా సందర్భాల్లో నవ్వడం వంటివి చేస్తుంది. ఈ విధానాన్ని 'ఫుల్-డ్యూప్లెక్స్ స్పీచ్-టు-స్పీచ్' టెక్నాలజీగా పిలుస్తారు.
డెస్సాకు శిక్షణ ఇచ్చేందుకు ఎన్‌వీడియా జీబీ200 ఎన్వీఎల్72 సిస్టమ్‌ను ఉపయోగించినట్లు పరిశోధనా బృందం వెల్లడించింది. అంతే కాకుండా.. శక్తివంతమైన హార్డ్‌వేర్ ఉన్న మ్యాక్‌బుక్ ప్రో ఎం4 మ్యాక్స్ వంటి కంప్యూటర్‌లో ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే దీన్ని నడపవచ్చని తెలిపింది. జాక్ డోర్సీ కూడా ఎక్స్‌లో స్పందిస్తూ.. డెస్సా వెనుక సాధారణ ఎల్ఎల్ఎమ్ లేదని, ఇది నేరుగా స్పీచ్-టు-స్పీచ్ విధానంలో పనిచేస్తుందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: అంతలోనే ఆశలు ఆవిరి.. తిరగబడిన పసిడి ధరలు!
ప్రస్తుతం డెస్సా ప్రారంభ దశలో.. పరిశోధనా ప్రాజెక్ట్‌గా ఉంది. దీన్ని పరీక్షించి, భద్రతాపరమైన సమస్యలను గుర్తించేందుకు.. AI భద్రతా పరిశోధకులను బృందం ఆహ్వానిస్తోంది. మొత్తానికి.. ఏఐ మనుషులు మాట్లాడే మాటలను కేవలం టెక్స్ట్‌గా కాకుండా.. నేరుగా విని అర్థం చేసుకునే దిశగా డెస్సా ఒక కొత్త ప్రయత్నం. ఈ టెక్నాలజీ భవిష్యత్తులో వాయిస్ అసిస్టెంట్లను మరింత సహజంగా మార్చగలదా అనేది తదుపరి పరీక్షలు, పరిశోధనల ద్వారా స్పష్టమవుతుంది.
Meet Dessa, our AI model trained from scratch on nothing but speech. We believe speech is the natural interface for technology. So we built Dessa. And we’re inviting AI safety researchers to explore Dessa. Learn more: https://t.co/6wA8KhWdjn https://t.co/vXM43uUFzx
— Ragavan Thurairatnam (@RagavanThurair) October 23, 2026


