అదృష్టం కలిసొస్తే..ఒక్కోసారి రాత్రికి రాత్రే తలరాత మారిపోతుంది. సాధారణ వ్యక్తిని సైతం కోటీశ్వరుడిగా మార్చేస్తుంది. అందుకు నిలువెత్తు నిదర్శనం ఈ పంజాబ్‌కి చెందిన మహిళ.
అసలేం జరిగిందంటే..పంజాబ్లోని ఫరీద్‌కోట్ జిల్లా, కోట్‌కపురాకు చెందిన కుటుంబం లాటరీని గెలుచుకుంది. కూలి పనిచేసుకునే వ్యక్తి భార్య అయిన బిమ్లాదేవి ఒక రోజు సాయంత్రం వేళ పిల్లల కోసం కొన్ని వస్తువులు కొనుగోలు చేసేందుకు రైల్వే రోడ్డుకు వెళ్లారు. ఆ సయంలోనే సరదాగా ఒక లాటరీ టికెట్‌ని జస్ట్ రూ. 7లకు కొనుగోలు చేసింది. మరుసటి రోజు సాయంత్రమే తను కొన్న టికెట్‌కే బహుమతి వచ్చినట్లు తెలియడంతో ఆ కుటుంబంలో ఆనందాలు వెల్లివిరిశాయి.
సదరు లాటరీ దుకాణదారుడి ద్వారా విషయం తెలుసుకుని నేరుగా లాటరీస్టాల్‌కి చేరుకున్నారు. లాటరీ దుకాణం యజమాని నరేష్ మోంగా ఆ కుటుంబానికి మిఠాయిలు అందించి అభినందనలు తెలిపాడు. ఆ కుటుంబం మాత్రం జస్ట్ రూ. 7ల టికెట్‌తో కోటి గెలుచుకున్నామన్న సంతోషంతో ఉబ్బితబ్బిబవుతూ చిందులు వేశారు. ఈ బహుమతి సొమ్ముని ఏం చేయాలో ఇంకా ఆలోచించలేదని, కానీ తమను ఆర్థిక కష్టాల నుంచి బయటపడేస్తుందని చాలా సంతోషంగా చెబుతోంది ఆ కుటుంబం.
కాగా లాటరీ స్టాల్ యజమాని నరేష్ మోంగా మాట్లాడుతూ, తాను గత ఆరు నెలలుగా ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నానని, ఇటీవలనే తన దుకాణాన్ని రైల్వే స్టేషన్ సమీపానికి మార్చినట్లు తెలిపాడు. చాలామంది తన దుకాణంలో లక్ష రూపాయలకు పైగా బహుమతులు గెలుచుకున్నారు కానీ ఎవ్వరూ ఇలా ఇంత పెద్ద మొత్తంలో కోటి రూపాయలు గెలుచుకోలేదని మోంగా చెప్పుకొచ్చాడు.
ఇదీ చదవండి: ప్రసవమైన ఆరువారాలకే రన్‌వేపై రీఎంట్రీ..! మాతృత్వపు గ్లామర్ వెనుకున్న సీక్రెట్ ఇదే


