‘మన్‌ కీ బాత్‌’లో ‘నవ్-త్రింజన్’.. ఈ ప్రాజెక్ట్ ఏమిటి? | PM highlights how Faridkots NavTrinjan effort is reviving rural traditions | Sakshi
Sakshi News home page

‘మన్‌ కీ బాత్‌’లో ‘నవ్-త్రింజన్’.. ఈ ప్రాజెక్ట్ ఏమిటి?

Oct 25 2026 2:10 PM | Updated on Oct 25 2026 2:28 PM

PM highlights how Faridkots NavTrinjan effort is reviving rural traditions

ఫరీద్‌కోట్: పంజాబ్‌లోని ఫరీద్‌కోట్ జిల్లా జైటో ప్రాంతానికి చెందిన ‘నవ్-త్రింజన్’ ఆర్గానిక్ కాటన్, చేనేత ప్రాజెక్ట్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన నెలవారీ రేడియో కార్యక్రమమైన 'మన్ కీ బాత్'లో ప్రత్యేకంగా కొనియాడారు. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలలివే..

గ్రామీణ సంప్రదాయాలు ఉట్టిపడేలా..
రసాయనిక ఎరువులు లేదా ఎలాంటి విషపూరిత మందులు వాడకుండా పూర్తిగా సహజసిద్ధంగా పండించిన పత్తిని చేతితో వడకడం, నేయడం, సహజమైన రంగులతో వస్త్రాలను తయారు చేయడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం. దీనివల్ల ప్రజలకు రసాయన రహిత దుస్తులు అందుబాటులోకి వస్తున్నాయి.

మహిళల స్వావలంబన 
‘ఖేతి విరాసత్ మిషన్’ (కేవీఎం) ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా అనేక మంది గ్రామీణ మహిళలు ఉపాధి పొందుతూ ఆర్థికంగా స్వయంసమృద్ధి సాధిస్తున్నారు. రమణ్‌దీప్ కౌర్, రజనీ కౌర్, రేఖా రాణి, స్నేహా దేవి వంటి మహిళలు ఈ ప్రాజెక్ట్ ద్వారా జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

‘త్రింజన్’ సంప్రదాయం వెనుక
పూర్వకాలంలో పంజాబీ మహిళలు అందరూ కలిసి చరఖా తిప్పుతూ, జానపద పాటలు పాడుకుంటూ, తమ ఆనందాలను-కష్టాలను పంచుకునే సాంప్రదాయ వేదికలైన 'త్రింజన్' స్ఫూర్తితోనే దీనికి 'నవ్-త్రింజన్' అని పేరు పెట్టారు. పారిశ్రామికీకరణ కారణంగా కనుమరుగైన ఈ వేదికలను కేవీఎం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉమేంద్ర దత్ ఆధ్వర్యంలో మళ్లీ పునరుద్ధరించారు.

నేత పాఠశాల- శిక్షణ 
కేవీఎం ఆధ్వర్యంలోని ‘నవ్-త్రింజన్ బంకర్ పాఠశాల’లో నిపుణులైన మాస్టర్ ఆర్టిజన్లు షిందర్ కౌర్,  గుర్మీత్ కౌర్‌ల నేతృత్వంలో యువతీయువకులకు, గ్రామీణ మహిళలకు చేనేతలో శిక్షణ ఇస్తున్నారు. కేవలం రెండేళ్ల వ్యవధిలో దాదాపు 30 మంది గ్రామీణ మహిళలు ఇక్కడ శిక్షణ పొందారు.

జాతీయ స్థాయిలో గుర్తింపు 
ఈ ప్రాజెక్ట్ ద్వారా తయారైన చేనేత శాలువాను జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతికి బహూకరించారు. అలాగే రమన్‌దీప్ కౌర్, రేఖా రాణి వంటి మహిళలు కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన జాతీయ వర్క్‌షాప్‌నకు ఎంపికయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement