పీఓకే ఖాళీ చేయాల్సిందే.. పాక్‌కు భారత్‌ గట్టి కౌంటర్‌ | India Shuts Pakistan at UN Vacate PoK | Sakshi
Sakshi News home page

పీఓకే ఖాళీ చేయాల్సిందే.. పాక్‌కు భారత్‌ గట్టి కౌంటర్‌

Oct 25 2026 9:33 AM | Updated on Oct 25 2026 9:33 AM

India Shuts Pakistan at UN Vacate PoK

ఐరాస వేదికగా భారత్‌పై బురదజల్లాలనుకున్న పాకిస్థాన్‌కు భారత్‌ గట్టి కౌంటర్‌ ఇచ్చింది. ఇతరులకు నీతులు చెప్పే ముందు.. సొంత దేశ ప్రజల సంక్షేమంపై దృష్టి పెట్టాలంటూ చురకలు అంటించింది. జమ్ముకశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమని స్పష్టం చేస్తూ.. పాకిస్థాన్‌ అక్రమ ఆధీనంలోని భూభాగాలను ఖాళీ చేయాలని తేల్చిచెప్పింది. ఇదే సమయంలో అంతర్జాతీయ వేదికను ప్రచారానికి ఉపయోగించుకోవడం మానుకోవాలని హితవు పలికింది.

ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్థాన్‌ మరోసారి ప్రచారానికి దిగిందని భారత్‌ తీవ్రంగా అభ్యంతరం తెలిపింది. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి బృందం తరఫున ఫస్ట్‌ సెక్రటరీ రఘూ పూరి మాట్లాడుతూ.. పాకిస్థాన్‌ ప్రతినిధులు వారి దేశ ప్రజల సంక్షేమంపై దృష్టి పెట్టాలని సూచించారు. సైనిక నాయకత్వం ఆదేశాలను అనుసరించడం కంటే ప్రజల సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని వ్యాఖ్యానించారు. ఐరాస వేదికను ప్రచారానికి ఉపయోగించుకోవడం పాకిస్థాన్‌కు అలవాటుగా మారిందని విమర్శించారు. అలాగే, జమ్ముకశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమని, విడదీయలేని భాగమని పునరుద్ఘాటించింది. అంతేకాదు.. పాకిస్థాన్‌ అక్రమ ఆధీనంలో ఉన్న భూభాగాలను వెంటనే ఖాళీ చేయాలని డిమాండ్‌ చేసింది. ఐరాస జనరల్‌ అసెంబ్లీ మూడో కమిటీలో జరిగిన మైనారిటీ హక్కులపై చర్చ సందర్భంగా భారత్‌ ఈ వ్యాఖ్యలు చేసింది.

అలాగే, మైనారిటీల హక్కుల పరిరక్షణ ప్రధానంగా ఆయా దేశాల సార్వభౌమ బాధ్యత అని భారత్‌ పేర్కొంది. మతపరమైన, భాషాపరమైన మైనారిటీల హక్కులకు భారత రాజ్యాంగం రక్షణ కల్పిస్తోందని రఘూ పూరి వివరించారు. దేశ అభివృద్ధిలో మైనారిటీలు కీలక పాత్ర పోషించారని, ప్రభుత్వ అత్యున్నత స్థాయిలతో పాటు వివిధ కీలక సంస్థల్లోనూ తమ సేవలు అందించారని గుర్తుచేశారు.

పాక్‌పై విమర్శలు
అక్టోబర్‌ 23న కూడా మతపరమైన మైనారిటీల పరిస్థితిపై ఐరాస వేదికగా భారత్‌ పాకిస్థాన్‌ను విమర్శించింది. మత స్వేచ్ఛ, అంత్యక్రియల హక్కులు, మైనారిటీల రక్షణ వంటి అంశాలపై భారత్‌కు పాఠాలు చెప్పే ముందు పాకిస్థాన్‌ తన దేశంలోని బలహీన వర్గాల పరిస్థితిని పరిశీలించుకోవాలని భారత ప్రతినిధి భవికా మంగళానందన్‌ వ్యాఖ్యానించారు. కరోనా మహమ్మారి సమయంలో మతపరమైన వివక్ష, అంత్యక్రియల హక్కులకు సంబంధించిన నివేదికలో అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఎక్కువగా దృష్టి సారించి, అభివృద్ధి చెందిన దేశాల్లో చోటుచేసుకున్న ఇలాంటి ఘటనలను తగినంతగా పరిగణనలోకి తీసుకోలేదని ఆమె అభిప్రాయపడ్డారు.

వాతావరణ మార్పులపై భారత్‌ వైఖరి
ఇదే సమయంలో ఐరాసలో వాతావరణ మార్పుల అంశంపైనా భారత్‌ తన అభిప్రాయాలను వెల్లడించింది. వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో సమానత్వం, వాతావరణ న్యాయం, సుస్థిర అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు భారత ప్రతినిధి బర్ఖా తమ్రాకర్‌ తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు రాజ్యాంగం, చట్టాలు, జాతీయ హరిత ట్రైబ్యునల్‌, స్వతంత్ర న్యాయవ్యవస్థ కీలక రక్షణలుగా ఉన్నాయని పేర్కొన్నారు. వాతావరణ మార్పుల ప్రభావాల నుంచి ప్రజలను కాపాడటంలో జీవించే హక్కు, సమానత్వపు హక్కులకు ప్రాధాన్యం ఉందని సుప్రీంకోర్టు గుర్తించిన విషయాన్ని ప్రస్తావించారు.

ఇదీ చదవండి: మాజీ ఐఏఎస్‌ దివ్య సంచలన ప్రకటన.. యూపీలో పొలిటికల్‌ ట్విస్ట్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement