ఆంటోనెల్లి అదరహో | Kimi Antonelli made Formula 1 history at the 2026 Canadian Grand Prix | Sakshi
Sakshi News home page

ఆంటోనెల్లి అదరహో

May 26 2026 5:50 AM | Updated on May 26 2026 5:50 AM

Kimi Antonelli made Formula 1 history at the 2026 Canadian Grand Prix

కెనడియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌ప్రి టైటిల్‌ సొంతం

సీజన్‌లో వరుసగా నాలుగో విజయం

131 పాయింట్లతో అగ్రస్థానం పటిష్టం

జూన్‌ 7న మొనాకో గ్రాండ్‌ప్రి  

మాంట్రియల్‌: టీనేజ్‌ వయసులో తాను సాధిస్తున్న విజయాలు గాలివాటమేమీ కాదని మెర్సిడెస్‌ జట్టు డ్రైవర్‌ కిమీ ఆంటోనెల్లి నిరూపించాడు. ఫార్ములావన్‌–2026 సీజన్‌లో వరుసగా నాలుగో విజయంతో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన సీజన్‌ ఐదో రేసు కెనడియన్‌ గ్రాండ్‌ప్రిలో 19 ఏళ్ల ఆంటోనెల్లి విజేతగా నిలిచాడు. 

నిర్ణీత 68 ల్యాప్‌లను ఈ ఇటలీ డ్రైవర్‌ అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 1 గంట 28 నిమిషాల 15.758 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. తద్వారా 76 ఏళ్ల ఫార్ములావన్‌ చరిత్రలో తమ కెరీర్‌ ప్రారంభంలో నాలుగు వరుస రేసుల్లో టైటిల్‌ సాధించిన తొలి డ్రైవర్‌గా ఆంటోనెల్లి గుర్తింపు పొందాడు. ఈ సీజన్‌లోని తొలి రేసు ఆ్రస్టేలియన్‌ గ్రాండ్‌ప్రిలో మెర్సిడెస్‌ జట్టుకే చెందిన జార్జి రసెల్‌ టైటిల్‌ నెగ్గగా... చైనా, జపాన్, మయామి, కెనడియన్‌ గ్రాండ్‌ప్రిలలో ఆంటోనెల్లి విజేతగా నిలిచాడు. 

1983లో డామన్‌ హిల్‌ (హంగేరి, బెల్జియం, ఇటలీ గ్రాండ్‌ప్రి)... 1998లో మికా హాకినెన్‌ (చైనా, జపాన్, మయామి గ్రాండ్‌ప్రి) మాత్రమే తమ కెరీర్‌లో బరిలోకి దిగిన మూడు వరుస రేసుల్లో గెలుపొందారు. ఇక ఫార్ములావన్‌లో వరుసగా నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రేసుల్లో గెలిచిన 16వ డ్రైవర్‌గా ఆంటోనెల్లి ఘనత వహించాడు. 

గతంలో వెర్‌స్టాపెన్‌ (వరుసగా 10; 2023లో), సెబాస్టియన్‌ వెటెల్‌ (వరుసగా 9; 2013లో), అల్బోర్టో అస్కారి (వరుసగా 7; 1953లో), మైకేల్‌ షుమాకర్‌ (వరుసగా 7; 2004లో), నికో రోస్‌బర్గ్‌ (వరుసగా 7; 2016లో), జాక్‌ బ్రాబమ్‌ (వరుసగా 5; 1960లో), జిమ్‌ క్లార్క్‌ (వరుసగా 5; 1965లో), నైజెల్‌ మాన్సెల్‌ (వరుసగా 5; 1992లో), లూయిస్‌ హామిల్టన్‌ (వరుసగా 5; 2014లో), జోచెన్‌ రింట్‌ (వరుసగా 4; 1966లో), అయిర్టన్‌ సెనా (వరుసగా 4; 1991లో), అలైన్‌ ప్రాస్ట్‌ (వరుసగా 4; 1993లో), డామన్‌ హిల్‌ (వరుసగా 4; 1995లో), ఫెర్నాండో అలోన్సో (వరుసగా 4; 2006లో), జెన్సన్‌ బటన్‌ (వరుసగా 4; 2009లో) ఈ జాబితాలో ఉన్నారు. ఈ జాబితాలోనే వరుసగా నాలుగు రేసుల్లో ఒకటికంటే ఎక్కువసార్లు గెలిచిన వాళ్లు కూడా ఉన్నారు.  

స్ప్రింట్‌ రేసులో సహచరుడు జార్జి రసెల్‌ను ఢీకొట్టిన ఆంటోనెల్లి ప్రధాన రేసులో మాత్రం దూసుకుపోయాడు. రెండో స్థానం నుంచి రేసును ఆరంభించిన ఆంటోనెల్లికి ‘పోల్‌ పొజిషన్‌’ సాధించిన సహచరుడు రసెల్‌తో గట్టిపోటీనే ఎదురైంది. తొలి 30 ల్యాపుల్లో వీరిద్దరి మధ్య ఆధిక్యం దోబూచులాడింది. చివరకు 38వ ల్యాప్‌లో ఇంజిన్‌లో సమస్య కారణంగా రసెల్‌ రేసు నుంచి వైదొలగగా>... అటునుంచి ఆంటోనెల్లి వెనుదిరిగి చూడలేదు. ఏకంగా పది సెకన్ల ఆధిక్యంతో ఆంటోనెల్లి టైటిల్‌ సాధించాడు. కేవలం నలుగురు డ్రైవర్లే నిర్ణీత 68 ల్యాప్‌లను పూర్తి చేయగా... 12 మంది డ్రైవర్లు ఒక ల్యాప్‌ తక్కువ చేశారు. మిగతా ఆరుగురు డ్రైవర్లు రేసు మధ్యలో నుంచి తప్పుకున్నారు. 22 రేసుల ఈ సీజన్‌లో ఐదు రేసులు ముగిశాక ఆంటోనెల్లి 131 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. 88 పాయింట్లతో రసెల్‌ రెండో స్థానంలో, 75 పాయింట్లతో లెక్‌లెర్క్‌ మూడో స్థానంలో ఉన్నారు. సీజన్‌లోని తదుపరి రేసు మొనాకో గ్రాండ్‌ప్రి జూన్‌ 7వ తేదీన జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement