2030 వరకు ఒప్పందం చేసుకున్న వెర్‌స్టాపెన్
రిటైర్మెంట్ వార్తలకు చెక్ పెట్టిన ఎఫ్1 స్టార్
జాండ్‌వూర్ట్ (నెదర్లాండ్స్): ఫార్ములావన్‌లో నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్, రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్‌స్టాపెన్ రిటైర్మెంట్ ఊహాగానాలకు తెరపడింది. ఈ సీజన్ తర్వాత వెర్‌స్టాపెన్ ట్రాక్ వీడనున్నట్లు వచ్చిన వార్తలన్నీ అవాస్తవాలే అని తేలింది. మరో నాలుగేళ్ల పాటు రెడ్‌బుల్‌తోనే కొనసాగేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెర్‌స్టాపెన్ గురువారం వెల్లడించాడు. తాజా ఫార్ములావన్ సీజన్‌లో మెర్సిడెస్ వేగాన్ని అందుకునేందుకు రెడ్‌బుల్ జట్టు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 11 రేస్‌లు ముగియగా... కన్‌స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్‌లో మెర్సిడెస్ జట్టు 379 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
ఫెరారీ 307 పాయింట్లతో రెండో ‘ప్లేస్’లో ఉండగా... మెక్‌లారెన్ 220 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఇక రెడ్‌బుల్ జట్టు 177 పాయింట్లతో నాలుగో స్థానానికి పరిమితమైంది. ‘ఈ ఏడాది మొదట కొన్ని రేసులు పూర్తైన తర్వాత రెడ్ బుల్ టీమ్ ప్రిన్సిపాల్‌తో ప్రత్యేకంగా మాట్లాడాను. భవిష్యత్తు ప్రణాళికల్లో నన్ను భాగంగా చూడొద్దని చెప్పాను. అసలు నేను జట్టుతో ఉంటానో లేదో తెలియదని కూడా అన్నాను. కానీ నాకు రేసింగ్ అంటే ఇప్పటికీ ఇష్టం కాబట్టి కొనసాగాలని నిర్ణయించుకున్నా. ఈ ప్యాకేజీతో పూర్తి సంతోషంగా లేకపోయినా ఒప్పుకున్నా. ఇతర జట్లతో చర్చల గురించి పక్కన పెడితే ఒకదశలో అసలు నేను కెరీర్‌కే వీడ్కోలు పలకాలని అనుకున్నా’ అని వెర్‌స్టాపెన్ పేర్కొన్నాడు.
తాజా కాంట్రాక్టు పూర్తి చేసుకుంటే వెర్‌స్టాపెన్ రెడ్‌బుల్ జట్టుకు 15 సీజన్‌లు ప్రాతినిధ్యం వహించినట్లు అవుతుంది. మరోవైపు రెడ్‌బుల్ టీమ్ ప్రిన్సిపాల్ మెకీస్ మాట్లాడుతూ... ‘వెర్‌స్టాపెన్ మాకు అత్యంత కీలకం. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన డ్రైవర్ కంటే కూడా అతడే మాకు ఎక్కువ. అతడిని సంప్రదించాకే మేం ఏ వ్యూహాత్మక నిర్ణయమైనా తీసుకుంటాం. అతను మా జట్టు కేంద్ర బిందువు. మరో నాలుగేళ్ల పాటు అతడితో కలిసి సాగనుండటం ఆనందంగా ఉంది’ అని వెల్లడించాడు. ఎఫ్1 కెరీర్‌లో ఇప్పటి వరకు 71 రేసులు నెగ్గిన వెర్‌స్టాపెన్ తాజా సీజన్‌లో ఇప్పటి వరకు ఒక్క రేసులోని విజేతగా నిలవలేదు.
ఆదివారం సొంతగడ్డపై జరగనున్న డచ్ గ్రాండ్‌ప్రిలో వెర్‌స్టాపెన్ బరిలోకి దిగనున్నాడు. జూనియర్ స్థాయి నుంచి వెర్‌స్టాపెన్‌కు రెడ్‌బుల్ జట్టు అండగా నిలుస్తూ వస్తోంది. ఆ జట్టు సహకారంతోనే 2015లో 17 ఏళ్ల వయసులో వెర్‌స్టాపెన్ ఎఫ్1 అరంగేట్రం చేశాడు. తద్వారా ఫార్ములావన్ రేసులో పోటీపడిన అతి పిన్న డ్రైవర్‌గా రికార్డు సృష్టించాడు. వెర్‌స్టాపెన్ రెడ్‌బుల్ జట్టును వీడి మెక్‌లారెన్ జట్టుతో జతకట్టనున్నట్లు వార్తలు రాగా... వాటిని మెక్‌లారెన్ టీమ్ తోసిపుచ్చింది. నోరిస్, పియాస్ట్రితోనే కొనసాగనున్నట్లు మెక్‌లారెన్ వెల్లడించింది.


