breaking news
Red Bull
-
ఇక చాలు!
మిల్టన్ కీన్స్ (ఇంగ్లండ్): సుదీర్ఘ కాలంగా ఫార్ములావన్ (ఎఫ్1) రెడ్‌బుల్ టీమ్ ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తున్న క్రిస్టియన్ హార్నర్ను ఆ జట్టు ఆర్ధాంతరంగా తప్పించింది. 20 సంవత్సరాలుగా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ... 8 సార్లు డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్స్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించిన హార్నర్ను తొలగిస్తున్నట్లు రెడ్‌బుల్ బుధవారం ప్రకటించింది. అతడి సేవలకు ధన్యవాదాలు తెలిపిన రెడ్‌బుల్ యాజమాన్యం తప్పించడం వెనుక ఉన్న కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. ‘అతడు మా జట్టు చరిత్రలో ఎప్పటికీ ఒక ముఖ్యమైన వ్యక్తే’ అని ఏకవాక్య ప్రకటన విడుదల చేసింది. హార్నర్ చీఫ్‌గా ఉన్న సమయంలో రెడ్‌బుల్ జట్టు 405 రేసుల్లో పాల్గొని 124 విజయాలు సాధించింది. 8 డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్స్, 6 కన్స్ట్రక్టర్స్ టైటిల్స్ గెలుచుకుంది. హార్నర్ స్థానంలో రెడ్‌బుల్ జట్టు చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా తమ సొంత జట్టు రేసింగ్ బుల్స్‌కు చెందిన లారెంట్ మెకీస్కు బాధ్యతలు అప్పగించింది. ఈ నెల 27న జరగనున్న బెల్జియం గ్రాండ్‌ప్రితో మెకీస్ జట్టు బాధ్యతలు అందుకోనున్నాడు. ‘రేసింగ్ బుల్స్ జట్టు స్ఫూర్తి అద్భుతమైంది. ఇది కేవలం ప్రారంభమే అని బలంగా విశ్వసిస్తున్నా. రెడ్‌బుల్ అప్పగించిన బాధ్యతలను అందుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. సవాలుతో కూడుకున్నదే అయినా నా వంతు కృషి చేస్తా. డ్రైవర్లకు సహాయ సహకారాలు అందిస్తూ వారిని సరైన దిశలో నడిపించడమే నా బాధ్యత’ అని మెకీస్ ఒక ప్రకటనలో తెలిపాడు. అయితే అతడు ఇందులో కనీసం హార్నర్ పేరును ప్రస్తావించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇక మెకీస్ స్థానంలో అలాన్ పెర్మనే రేసింగ్ బుల్స్ డైరెక్టర్‌గా పదోన్నతి పొందాడు. ఆది నుంచి అతడే... రెడ్‌బుల్ జట్టు తొలిసారి 2005లో ఫార్ములావన్‌లో అడుగు పెట్టగా... అప్పటి నుంచి హార్నర్ టీమ్ ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తూ వస్తున్నాడు. ఇటీవల బ్రిటన్ గ్రాండ్‌ప్రిలో సైతం హార్నర్ తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాడు. రెడ్‌బుల్ జట్టుకు చెందిన సెబాస్టియన్ వెటెల్, వెర్స్టాపెన్ వరుసగా నాలుగుసార్లు సార్లు చొప్పున డ్రైవర్స్ చాంపియన్‌షిప్ సాధించడం వెనక హార్నర్ కీలకంగా వ్యవహరించాడు. ఈ సీజన్లో మెక్లారెన్ డ్రైవర్లు సత్తా చాటుతుండగా... డిఫెండింగ్ చాంపియన్ వెర్స్టాపెన్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక జట్ల విషయానికి వస్తే రెడ్‌బుల్ నాలుగో స్థానంలో ఉంది. ఇటీవల బ్రిటన్ గ్రాండ్‌ప్రి సందర్భంగా... వచ్చే ఏడాది రెడ్బుల్తో కొనసాగడంపై ఇప్పుడే స్పష్టత ఇవ్వలేనని వెర్స్టాపెన్ వెల్లడించిన నేపథ్యంలో... ఆ జట్టు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో రెడ్‌బుల్ జట్టు నుంచి వైదొలుగుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. కారు రూపకల్పనలో నిష్ణాతుడైన అడ్రియన్ రెడ్‌బుల్‌ను వీడి ఆస్టన్ మార్టిన్ జట్టుతో చేరగా... స్పోర్టింగ్ డైరెక్టర్ జొనాథన్ వెట్లీ సాబెర్కు మారాడు. ఇక గత సీజన్లో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయిన పెరెజ్‌ను రెడ్‌బుల్ జట్టు వదిలేసుకుంది. అతడి స్థానంలో లియామ్ లాసన్‌ను ఎంచుకుంది. 32 ఏళ్ల వయసులోనే... 1997లో డ్రైవర్‌గా కెరీర్ ప్రారంభించిన హార్నర్ 2005లో రెడ్‌బుల్ బాధ్యతలు చేపట్టే నాటికి అతడి వయసు కేవలం 32 సంవత్సరాలే. పిన్న వయసులోనే పెద్ద బాధ్యతలు అందుకున్న హార్నర్ రెండు దశాబ్దాల పాటు వాటిని సమర్థవంతంగా నిర్వర్తించాడు. ఆరంభంలో ‘పార్టీ టీమ్’గా ముద్ర పడ్డ జట్టును... వరుస విజయాలు సాధించే స్థాయికి తీసుకొచ్చాడు. హార్నర్ హయాంలో 2009లో తొలిసారి రెడ్‌బుల్ డ్రైవర్ వెటల్ చైనా గ్రాండ్ ప్రిలో విజయం సాధించగా... ఆ తర్వాత 2010 నుంచి వరుసగా నాలుగేళ్ల పాటు అతడు డ్రైవర్స్ చాంపియన్‌గా నిలిచాడు. 2016లో రెడ్‌బుల్ తరఫున మ్యాక్స్ వెర్స్టాపెన్ అరంగేట్రం చేయగా... ట్రాక్‌పై అడుగుపెట్టిన తొలి రేసు స్పానిష్ గ్రాండ్ ప్రిలో విజేతగా నిలిచిన ఈ ఘనత సాధించిన పిన్న వయస్కుడి (18 సంవత్సరాలు)గా రికార్డు సృష్టించాడు. 2019లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘డ్రైవ్ టు సరై్వవ్’ తొలి సీజన్ హార్నర్కు పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చింది. -
వినూత్న సవాళ్లను ఎదుర్కొన్న కేఎల్ రాహుల్, బెన్ స్టోక్స్.. వైరల్ వీడియో
జూన్ 20 నుంచి ప్రారంభం కాబోయే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ముందు భారత్, ఇంగ్లండ్‌కు చెందిన స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, బెన్ స్టోక్స్ పలు వినూత్న సవాళ్లను ఎదుర్కొన్నారు. అల్టిమేట్ క్రికెటింగ్ ఛాలెంజెస్ పేరుతో రెడ్ బుల్ సంస్థ ఈ పోటీలను నిర్వహించింది. ఇందులో రాహుల్, బెన్ నాలుగు కఠినమైన క్రికెటింగ్ ఛాలెంజ్‌లు ఎదుర్కొన్నారు. ఇవి వారి ఖచ్చితత్వం మరియు శక్తిని పరీక్షించేందుకు సరదాగా నిర్వహించబడ్డాయి. ఈ పోటీల్లో ఇరువురు బౌలింగ్ యంత్రాలను నుంచి వచ్చే బంతులను ఎదుర్కొని సవాళ్లను స్వీకరించారు.మొదటి ఛాలెంజ్‌లో రాహుల్ ఓ భారీ ట్రక్‌పై బౌలింగ్ మిషన్ నుంచి వచ్చే పదునైన బంతులను ఎదుర్కొని భారీ షాట్ల ఛాలెంజ్‌ను ఫేస్ చేశాడు. ఈ ఛాలెంజ్‌లో రాహుల్ 8 బంతుల్లో కలిపి 500 మీటర్ల దూరం షాట్లు ఆడాలి. ఇందులో రాహుల్ చివరి బంతికి టార్గెట్‌ను రీచ్ అయ్యాడు.రెండో చాలెంజ్‌లో బెన్ స్టోక్స్ ఓ సరస్సులో బోటుపై నిలబడి నీటిపై తేలియాడుతున్న ఆరు టార్గెట్లను బంతులతో హిట్ చేయాలి. ఇది కచ్చితమైన లక్ష్య నిర్దేశంతో కూడిన సవాలు. మూడో ఛాలెంజ్‌లో రాహుల్, స్టోక్స్ ప్రత్యేకంగా రూపొందించిన గదుల్లోకి వివిధ రకాలైన ఛాలెంజ్‌లను ఎదుర్కొన్నారు.చివరిగా ఫైనల్ బాస్ పేరుతో ఇరువురికి ఓ కఠినమైన సవాలు ఎదురైంది. కదులుతూ, నిలకడగా ఉన్న లక్ష్యాలను బౌలింగ్ యంత్రాల నుంచి వచ్చే బంతులను ఎదుర్కొంటూ హిట్ చేయాలి. ఈ పోటీల్లో రాహుల్, స్టోక్స్ సమంగా రాణించారు. ఈ ఛాలెంజ్‌లకు సంబంధించిన వీడియో భారత్, ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌కు ముందు క్రికెట్ అభిమానులను విపరీతంగా ఆకర్శిస్తుంది. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. -
రామానాయుడు స్టూడియోలో కార్ రేసింగ్.. సందడి చేసిన టాలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)
-
Formula One: రయ్..రయ్...రయ్...
సాఖిర్: గత ఏడాది పూర్తి ఆధిపత్యం చలాయించిన రెడ్‌బుల్ జట్టు అదే జోరును ఈ ఏడాదీ కొనసాగించాలనే లక్ష్యంతో ఫార్ములావన్ (ఎఫ్1) 2024 సీజన్లో బరిలోకి దిగనుంది. మొత్తం 24 రేసులతో కూడిన ఈ సీజన్‌కు నేడు బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి రేసుతో తెర లేవనుంది. శనివారం క్వాలిఫయింగ్ సెషన్... ఆదివారం ప్రధాన రేసు జరుగుతాయి. భారత కాలమానం ప్రకారం నేటి రాత్రి గం. 9:30 నుంచి క్వాలిఫయింగ్ సెషన్‌ను... ఆదివారం రాత్రి 8:30 నుంచి ప్రధాన రేసును నిర్వహిస్తారు. ఫ్యాన్‌కోడ్ యాప్‌లో ఎఫ్1 రేసుల ప్రత్యక్ష ప్రసారం ఉంది. గత సీజన్లో మొత్తం 22 రేసులు జరగ్గా... రెడ్‌బుల్ జట్టు డ్రైవర్లు వెర్స్టాపెన్ 19 రేసుల్లో, సెర్జియో పెరెజ్ 2 రేసుల్లో గెలిచారు. మరో రేసులో ఫెరారీ జట్టుకు చెందిన కార్లోస్ సెయింజ్ నెగ్గాడు. కొత్త సీజన్లో రెడ్‌బుల్ జట్టుతోపాటు వెర్స్టాపెన్ ప్రదర్శన ఎలా ఉంటుందో వేచి చూడాలి. -
వెర్‌స్టాపెన్‌కు పోల్ పొజిషన్
మాంట్‌మెలో (స్పెయిన్): ఫార్ములా వన్ స్పానిష్ గ్రాండ్‌ప్రి ప్రధాన రేసును రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ మొదటి స్థానంతో మొదలు పెడతాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ రేసులో డిఫెండింగ్ చాంపియన్ వెర్స్టాపెన్ పోల్ పొజిషన్ సాధించాడు. ల్యాప్‌ను అతను అత్యుత్తమంగా 1 నిమిషం 12.272 సెకన్లలో పూర్తి చేశాడు. ఈ సీజన్లో ఏడు రేస్‌లలో నాలుగో సారి వెర్‌స్టాపెన్‌కు పోల్ పొజిషన్ లభించింది. కార్లోస్ సెయింజ్ (ఫెరారీ), ల్యాండో నోరిస్ (మెక్లారెన్) రెండో, మూడో స్థానాల్లో నిలిచారు. మెర్సిడెజ్‌కు చెందిన లూయీస్ హామిల్టన్‌కు ఐదో స్థానం దక్కింది. ఈ సీజన్లో రెండు రేస్‌లు నెగ్గిన వెర్స్టాపెన్ రెడ్‌బుల్ సహచరుడు సెర్గియో పెరెజ్ 11వ స్థానంనుంచి ప్రధాన రేస్‌ను ప్రారంభిస్తాడు. -
మయామి గ్రాండ్‌ప్రి విజేత వెర్స్టాపెన్
ఫ్లోరిడా: ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లో తన ఆధిపత్యం చాటుకుంటూ రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ మూడో విజయం నమోదు చేశాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన మయామి గ్రాండ్‌ప్రి రేసులో వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. నిర్ణీత 57 ల్యాప్‌ల ఈ రేసును తొమ్మిదో స్థానం నుంచి ప్రారంభించిన వెర్స్టాపెన్ అందరికంటే వేగంగా గంటా 27 నిమిషాల 38.241 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. రెడ్‌బుల్ జట్టుకే చెందిన సెర్జియో పెరెజ్ రెండో స్థానంలో నిలిచాడు. అలోన్సో (ఆస్టన్ మార్టిన్) మూడో స్థానంలో, రసెల్ (మెర్సిడెస్) నాలుగో స్థానంలో నిలిచారు. ఈ సీజన్లో ఐదు రేసులు జరగ్గా... ఐదింటిలోనూ రెడ్‌బుల్ డ్రైవర్లే విజేతగా నిలువడం విశేషం. డ్రైవర్స్ చాంపియన్ షిప్ రేసులో వెర్స్టాపెన్ (119 పాయింట్లు), పెరెజ్ (105 పాయింట్లు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. -
రెడ్‌బుల్ కో- ఫౌండర్ కన్నుమూత
న్యూఢిల్లీ: ప్రముఖ ఎనర్జీ డ్రింక్ రెడ్ బుల్ రెడ్ బుల్ సహ వ్యవస్థాపకుడు, బిలియనీర్, డైట్రిచ్ మాటెస్చిట్జ్ (78) కన్నుమూశారు. రెడ్ బుల్ ఫార్ములా వన్ రేసింగ్ టీమ్ వ్యవస్థాపకుడు కూడా అయిన డైట్రిచ్ మరణానికి ఖచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది. రెడ్ బుల్ పశ్చిమ దేశాల్లో సైతం సక్సెస్ఫుల్ బ్రాండ్‌గా నిలపడలో చాలా కృషి చేశారు. ఆస్ట్రియన్ పారిశ్రామికవేత్త డైట్రిచ్ ఫార్ములా వన్ రేసింగ్ టీమ్ యజమానిగా కూడా తన ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎనర్జీ డ్రింక్ రెడ్బల్ను ప్రాచుర్యంలోకి తీసుకురావడమే కాకుండా, మోటార్ స్పోర్ట్స్, మీడియా, రియల్ ఎస్టేట్, గ్యాస్ట్రోనమీ రంగాలకు విస్తరించారు. ఫుట్‌బాల్ క్లబ్‌లు, హాకీ, రేసింగ్ జట్లను నిర్వహిస్తోంది రెడ్‌బుల్. ముఖ్యంగా.ఎయిర్ అక్రోబాటిక్స్ క్లిఫ్ డైవింగ్ వంటి ఈవెంట్లను స్పాన్సర్ చేస్తుంది రెడ్‌బుల్. రెడ్ బుల్ ఫార్ములా వన్ జట్టు హెడ్ క్రిస్టియన్ హార్నర్ డైట్రిచ్ మరణంపై సంతాపం వెలిబుచ్చారు. రెండు వారాల క్రితం జపనీస్ గ్రాండ్ ప్రిక్స్‌ను గెలుచుకుని వెర్స్టాపెన్ వరుసగా రెండో టైటిల్‌ను సాధించేవరకు మాటెస్చిట్జ్ జీవించి ఉండటం అదృష్టమన్నారు. అన్నివిషయాల్లోనూ తమకు ఆయన ఎన్నెముకలా నిలిచారని పేర్కొన్నారు. ఫార్ములా వన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టెఫానో డొమెనికాలి ఫార్ములా వన్ కుటుంబంలో అత్యంత గౌరవనీయమైన , అత్యంత ప్రీతిపాత్రమైన సభ్యుడుగా అభివర్ణించారు. కాగా పానీయాల డెవలపర్ థాయ్ వ్యాపారవేత్త చాలీయో యోవిధ్య మరో ఇద్దరితో కలిసి 1984లో రెడ్ బుల్‌ని స్థాపించారు. గ్లోబల్‌గా సూపర్ క్రేజ్ పొందిన రెడ్ బుల్ గత ఏడాది 172 దేశాల్లో ఏకంగా 100 కోట్ల క్యాన్లను విక్రయించడం విశేషం. దీంతో 2022లో 27.4 బిలియన్ల డాలర్ల నికర విలువతో ఫోర్బ్స్ ఆస్ట్రియా అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు డైట్రిచ్. -
వెర్‌స్టాపెన్‌దే ప్రపంచ టైటిల్
సుజుకా (జపాన్): ఫార్ములావన్ (ఎఫ్1) సీజన్లో మరో నాలుగు రేసులు మిగిలి ఉండగానే రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ వరుసగా రెండో ఏడాది ప్రపంచ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను గెల్చుకున్నాడు. ఆదివారం జరిగిన జపాన్ గ్రాండ్‌ప్రిలో 25 ఏళ్ల వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. వర్షం కారణంగా ప్రధాన రేసును నిర్ణీత 53 ల్యాప్‌లకు బదులుగా 28 ల్యాప్‌లకు కుదించారు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన వెర్స్టాపెన్ దూసుకుపోగా రెండు ల్యాప్‌ల తర్వాత వర్షం రావడంతో రేసు నిలిచిపోయింది. వర్షం తగ్గాక రెండు గంటల్లోపు రేసును ముగించాలనే నిబంధన కారణంగా రేసును 28 ల్యాప్‌లకు తగ్గించారు. వెర్స్టాపెన్ 3 గంటల 1ని:44.044 సెకన్లలో అందరికంటే వేగంగా గమ్యానికి చేరి ఈ సీజన్లో 12వ విజయాన్ని అందుకున్నాడు. సెర్గియో పెరెజ్ (రెడ్‌బుల్) రెండో స్థానంలో, లెక్లెర్క్ (ఫెరారీ) మూడో స్థానంలో నిలిచారు. 22 రేసుల ఈ సీజన్లో 18 రేసులు ముగిశాక వెర్స్టాపెన్ 366 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో ఉన్నాడు. పెరెజ్ 253 పాయింట్లతో రెండో స్థానంలో, లెక్లెర్క్ 252 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నారు. మరో నాలుగు రేసులు జరగాల్సి ఉన్నా... తొలి స్థానంలో ఉన్న వెర్‌స్టాపెన్‌కు రెండో స్థానంలో ఉన్న పెరెజ్ మధ్య 113 పాయింట్ల వ్యత్యాసం ఉంది. ఒకవేళ పెరెజ్ నాలుగు రేసుల్లోనూ గెలిచినా వెర్స్టాపెన్ను అధిగమించే అవకాశం లేకపోవడంతో ఈ రెడ్‌బుల్ డ్రైవర్‌కు ప్రపంచ టైటిల్ ఖరారైంది. సీజన్‌లోని తదుపరి రేసు యునైటెడ్ స్టేట్స్ గ్రాండ్‌ప్రి టెక్సాస్‌లో ఈనెల 23న జరుగుతుంది. -
విజేత వెర్స్టాపెన్
మయామి (అమెరికా): ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లో ప్రపంచ చాంపియన్ మాక్స్ వెర్స్టాపెన్ మూడో విజయం సాధించాడు. అమెరికాలో జరిగిన మయామి గ్రాండ్‌ప్రి ప్రధాన రేసులో వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) విజేతగా నిలిచాడు. నిర్ణీత 57 ల్యాప్‌ల రేసును వెర్స్టాపెన్ అందరికంటే వేగంగా గంటా 34 నిమిషాల 24.258 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఫెరారీ జట్టు డ్రైవర్లు చార్లెస్ లెక్లెర్క్ రెండో స్థానంలో, కార్లోస్ సెయింజ్ మూడో స్థానంలో నిలిచారు. లూయిస్ హామిల్టన్ (మెర్సిడెస్)కు ఆరో స్థానం లభించింది. సీజన్లో ఐదు రేసులు ముగిశాక లెక్లెర్క్ 104 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో ఉండగా... వెర్స్టాపెన్ 85 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. సీజన్‌లోని తదుపరి రేసు స్పెయిన్ గ్రాండ్‌ప్రి ఈనెల 22న బార్సిలోనాలో జరుగుతుంది. -
మనోళ్లు కి'రాక్'
మ్యూజిక్ అంటే ఎగిరి గంతేయాల్సిందే.. పార్టీ, ఈవెంట్ ఏదైనా మ్యూజిక్ లేనిదే మజాయే లేదు. ఎప్పటికప్పుడు మనలో జోష్ నింపేందుకు అన్ని మెట్రో నగరాల్లో పలు రాక్ మ్యూజిక్ టీమ్‌లు ఉన్నాయి. మన నగరంలోనూ రాక్ బృందాల సందడి ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్నాయి. ఇవి తరచూ మంచి ప్రతిభ కనబరుస్తున్నా..జాతీయస్థాయిలో అదరగొట్టేవి అరుదే.. ఈ నేపథ్యంలో ఎనర్జీ డ్రింక్రెడ్బుల్ నిర్వహిస్తున్న జాతీయస్థాయి పోటీలకు నగరానికి చెందిన ఓ రాక్ బ్యాండ్ ఎంపికై... సిటీ రాక్‌లో మరోసారి కేక పుట్టించింది. ఈ పోటీల్లో మనం గెలుపొందితే... నేషనల్ లెవల్లో హైదరాబాద్ రాక్ బృందం తళుక్మనడం ఖాయం. సాక్షి, సిటీబ్యూరో : దేశవ్యాప్తంగా రెడ్‌బుల్ స్పాట్లైట్ పేరిట నిర్వహిస్తున్న రాక్ కాంటెస్ట్‌లో విభిన్న నగరాలకు చెందిన బ్యాండ్స్ ఎంపికవుతాయి. అవన్నీ జాతీయస్థాయిలో పోటీపడతాయి. ముంబై, ఢిల్లీ, బెంగుళూర్, చెన్నై, కోల్‌కతా, గౌహతి, గోవా, పుణె, హైదరాబాద్... ప్రస్తుత పోటీల్లో ఈ తొమ్మిది నగరాలకు చెందిన టీమ్స్ గెలుపొందాయి. ఓటింగ్ షురూ... ఈ తొమ్మిది మంది ఫైనలిస్ట్‌లలో ప్రతి విజేతా... తమ తమ నగరాల్లోని స్టూడియోల్లో ఒక పాట చొప్పున రికార్డు చేశారు. అలా రికార్డు చేసిన పాటల్ని ఆన్లైన్లో ఉంచారు. ప్రస్తుతం ఈ పాటలను రాక్ ప్రియులు వింటూ వారికి ఓటేస్తున్నారు. ఓటింగ్ పీరియడ్ ముగిశాక... న్యాయనిర్ణేతల బృందం పరిశీలించి అనంతరం ఎక్కువ ఓట్లు వచ్చిన బ్యాండ్‌ను ఎంపిక చేస్తారు. ఈ బృందంలో మ్యూజిక్ జర్నలిస్ట్‌లు అమిత్ గుర్బాక్సాని, ఓఎమ్ఎల్/ఎన్‌హెచ్–7 వీకెండర్ హెడ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ దేబయాన్ దేబ్, అనురాగ్ టాగట్, ఆర్టిస్ట్ మేనేజర్ అనుఅన్నా జార్జ్, థింక్ ట్యాంక్ ఎంటర్టైన్మెంట్ నిర్వాహకులు నిఖిల్ ఉడుపా... తదితరులున్నారు. విజేతకు పూర్తిస్థాయిఆల్బమ్కు అవకాశం... తుది పోటీలో గెలిచిన టీమ్‌కు ఒక పూర్తిస్థాయి ఆల్బమ్ రూపకల్పనకు అవకాశం ఇస్తారు. ప్రొఫెషనల్ స్టూడియోలో మొత్తం వ్యయమంతా సంస్థ భరించి ఈ ఆల్బమ్ రూపొందించి దేశవ్యాప్తంగా విడుదల చేస్తుంది. ‘రాక్’ కుర్రోళ్లు... వీరే... ఈ ఫైనలిస్ట్‌లలో నగరానికి చెందిన స్వోర్డ్ (సోల్ఫుల్లీ వర్షిపింగ్ అవర్ రీడీమర్ డైలీ) బ్యాండ్ టీమ్ కూడా ఉంది. గత మార్చి 25న బిట్స్పిలానీలో 13 బ్యాండ్ల మధ్య జరిగిన రాక్ యుద్ధంలో నగరం నుంచి జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించింది స్వోర్డ్. రెండేళ్ల క్రితం ఐదుగురు యువకుల బృందం ఓ వైవిధ్యభరితమైన బ్యాండ్‌కు రూపకల్పన చేయాలనుకుని సీనియర్ బ్యాండ్ రివైవల్ నుంచి పొందిన స్ఫూర్తితో స్వోర్డ్కు ప్రాణం పోశారు. ఇప్పటిదాకా చాలా వరకూ కవర్ బ్యాండ్ (ఇతరుల పాటల్ని మాత్రమే ప్లే చేసే మ్యూజిక్ బృందం)గా ఉన్నప్పటికీ, ప్రస్తుతం సొంతంగా రాసి, బాణీలు కట్టి పాడే దశలో ఉన్నారు. వీరు గత 2014లో జరిగిన సింటిల్లాషంజ్ బ్యాటిల్ ఆఫ్ బ్యాండ్స్ పోటీల్లో 2వ ప్రైజ్‌ను, బెస్ట్ కీబోర్డిస్ట్, బెస్ట్బేసిస్ట్ అవార్డ్‌లను సెయింట్ పీటర్స్ ఇంజినీరింగ్ కాలేజ్ పోటీల్లో గెలుపొందారు. ఈ బృందంలో రవితేజ, శామ్యూల్, నవీన్, రాజీవ్, నిశ్చల్ ఉన్నారు. ఓటేస్తే... మీటేస్తారు... ఇప్పటివరకూ జరిగిన ఓటింగ్‌లో... మన సిటీ రాక్ బృందం ముందంజలో ఉందని సమాచారం. ఈ పరిస్థితుల్లో సంగీత ప్రియులు సహకరిస్తే... తమ గెలుపు సులువు అవుతుందని స్వోర్డ్ బృందం అంటోంది... మరి వీరి అభ్యర్థన ‘విందామా’? సిటీ రాక్ టీమ్‌ని గెలిపిద్దామా? ఓటేసేందుకు ఈ నెలాఖరు వరకూ అవకాశం ఉంది. ఓటేయాలనుకున్నవారు లాగిన్ కావాల్సిన చిరునామా.. www.redbull.in/spotlight , Facebook: www.facebook.com/redbull -
దిమ్మతిరిగే.. దిమ్మా తిరిగే..