
రెడ్‌బుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బాధ్యతల నుంచి హార్నర్‌కు ఉద్వాసన
20 ఏళ్లుగా జట్టుతో మమేకం
మిల్టన్ కీన్స్ (ఇంగ్లండ్): సుదీర్ఘ కాలంగా ఫార్ములావన్ (ఎఫ్1) రెడ్‌బుల్ టీమ్ ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తున్న క్రిస్టియన్ హార్నర్‌ను ఆ జట్టు ఆర్ధాంతరంగా తప్పించింది. 20 సంవత్సరాలుగా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ... 8 సార్లు డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్స్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించిన హార్నర్‌ను తొలగిస్తున్నట్లు రెడ్‌బుల్ బుధవారం ప్రకటించింది. అతడి సేవలకు ధన్యవాదాలు తెలిపిన రెడ్‌బుల్ యాజమాన్యం తప్పించడం వెనుక ఉన్న కారణాన్ని మాత్రం వెల్లడించలేదు.
‘అతడు మా జట్టు చరిత్రలో ఎప్పటికీ ఒక ముఖ్యమైన వ్యక్తే’ అని ఏకవాక్య ప్రకటన విడుదల చేసింది. హార్నర్ చీఫ్‌గా ఉన్న సమయంలో రెడ్‌బుల్ జట్టు 405 రేసుల్లో పాల్గొని 124 విజయాలు సాధించింది. 8 డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్స్, 6 కన్‌స్ట్రక్టర్స్ టైటిల్స్ గెలుచుకుంది. హార్నర్ స్థానంలో రెడ్‌బుల్ జట్టు చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా తమ సొంత జట్టు రేసింగ్ బుల్స్‌కు చెందిన లారెంట్ మెకీస్‌కు బాధ్యతలు అప్పగించింది. ఈ నెల 27న జరగనున్న బెల్జియం గ్రాండ్‌ప్రితో మెకీస్ జట్టు బాధ్యతలు అందుకోనున్నాడు.
‘రేసింగ్ బుల్స్ జట్టు స్ఫూర్తి అద్భుతమైంది. ఇది కేవలం ప్రారంభమే అని బలంగా విశ్వసిస్తున్నా. రెడ్‌బుల్ అప్పగించిన బాధ్యతలను అందుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. సవాలుతో కూడుకున్నదే అయినా నా వంతు కృషి చేస్తా. డ్రైవర్లకు సహాయ సహకారాలు అందిస్తూ వారిని సరైన దిశలో నడిపించడమే నా బాధ్యత’ అని మెకీస్ ఒక ప్రకటనలో తెలిపాడు. అయితే అతడు ఇందులో కనీసం హార్నర్ పేరును ప్రస్తావించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇక మెకీస్ స్థానంలో అలాన్ పెర్మనే రేసింగ్ బుల్స్ డైరెక్టర్‌గా పదోన్నతి పొందాడు.
ఆది నుంచి అతడే...
రెడ్‌బుల్ జట్టు తొలిసారి 2005లో ఫార్ములావన్‌లో అడుగు పెట్టగా... అప్పటి నుంచి హార్నర్ టీమ్ ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తూ వస్తున్నాడు. ఇటీవల బ్రిటన్ గ్రాండ్‌ప్రిలో సైతం హార్నర్ తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాడు. రెడ్‌బుల్ జట్టుకు చెందిన సెబాస్టియన్ వెటెల్, వెర్‌స్టాపెన్ వరుసగా నాలుగుసార్లు సార్లు చొప్పున డ్రైవర్స్ చాంపియన్‌షిప్ సాధించడం వెనక హార్నర్ కీలకంగా వ్యవహరించాడు. ఈ సీజన్‌లో మెక్‌లారెన్ డ్రైవర్లు సత్తా చాటుతుండగా... డిఫెండింగ్ చాంపియన్ వెర్‌స్టాపెన్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఇక జట్ల విషయానికి వస్తే రెడ్‌బుల్ నాలుగో స్థానంలో ఉంది. ఇటీవల బ్రిటన్ గ్రాండ్‌ప్రి సందర్భంగా... వచ్చే ఏడాది రెడ్‌బుల్‌తో కొనసాగడంపై ఇప్పుడే స్పష్టత ఇవ్వలేనని వెర్‌స్టాపెన్ వెల్లడించిన నేపథ్యంలో... ఆ జట్టు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో రెడ్‌బుల్ జట్టు నుంచి వైదొలుగుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.
కారు రూపకల్పనలో నిష్ణాతుడైన అడ్రియన్ రెడ్‌బుల్‌ను వీడి ఆస్టన్ మార్టిన్ జట్టుతో చేరగా... స్పోర్టింగ్ డైరెక్టర్ జొనాథన్ వెట్లీ సాబెర్‌కు మారాడు. ఇక గత సీజన్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయిన పెరెజ్‌ను రెడ్‌బుల్ జట్టు వదిలేసుకుంది. అతడి స్థానంలో లియామ్ లాసన్‌ను ఎంచుకుంది.
32 ఏళ్ల వయసులోనే...
1997లో డ్రైవర్‌గా కెరీర్ ప్రారంభించిన హార్నర్ 2005లో రెడ్‌బుల్ బాధ్యతలు చేపట్టే నాటికి అతడి వయసు కేవలం 32 సంవత్సరాలే. పిన్న వయసులోనే పెద్ద బాధ్యతలు అందుకున్న హార్నర్ రెండు దశాబ్దాల పాటు వాటిని సమర్థవంతంగా నిర్వర్తించాడు. ఆరంభంలో ‘పార్టీ టీమ్’గా ముద్ర పడ్డ జట్టును... వరుస విజయాలు సాధించే స్థాయికి తీసుకొచ్చాడు. హార్నర్ హయాంలో 2009లో తొలిసారి రెడ్‌బుల్ డ్రైవర్ వెటల్ చైనా గ్రాండ్ ప్రిలో విజయం సాధించగా... ఆ తర్వాత 2010 నుంచి వరుసగా నాలుగేళ్ల పాటు అతడు డ్రైవర్స్ చాంపియన్‌గా నిలిచాడు.
2016లో రెడ్‌బుల్ తరఫున మ్యాక్స్ వెర్‌స్టాపెన్ అరంగేట్రం చేయగా... ట్రాక్‌పై అడుగుపెట్టిన తొలి రేసు స్పానిష్ గ్రాండ్ ప్రిలో విజేతగా నిలిచిన ఈ ఘనత సాధించిన పిన్న వయస్కుడి (18 సంవత్సరాలు)గా రికార్డు సృష్టించాడు. 2019లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘డ్రైవ్ టు సరై్వవ్’ తొలి సీజన్ హార్నర్‌కు పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చింది.