చరిత్ర సృష్టించిన హైదరాబాదీ రేసర్‌ | FIA Asia Pacific Rally Championship Title Winner Jeet Jhabakh | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన హైదరాబాదీ రేసర్‌

Nov 3 2026 4:35 PM | Updated on Nov 3 2026 4:50 PM

 FIA Asia Pacific Rally Championship Title Winner Jeet Jhabakh

సాక్షి, హైదరాబాద్‌: భారత మోటార్ స్పోర్ట్స్ చరిత్రలో సరికొత్త అధ్యాయం ఆవిష్కృతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ రేసర్ జీత్ జబాఖ్ అంతర్జాతీయ మోటార్ రేసింగ్‌లో దేశానికి సరికొత్త గుర్తింపు తీసుకువచ్చాడు. అంతర్జాతీయ ఆటోమొబైల్ సమాఖ్య (ఏఫ్ఐఏ) ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ప్ర‌తిష్టాత్మ‌క‌ ఎఫ్‌ఐఏ ఆసియా-పసిఫిక్ ర్యాలీ చాంపియన్‌షిప్ (ఏపీఆర్‌సీ) 2026 సీజ‌న్ ఓవ‌రాల్‌ టైటిల్‌ను జీత్ సొంతం చేసుకున్నాడు.

ఈ టోర్నీ 38 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో ఒక టూ-వీల్ డ్రైవ్ కారులో ఓవరాల్ చాంపియన్‌షిప్ నెగ్గిన తొలి రేసర్‌గా జీత్ చ‌రిత్ర‌కెక్కాడు. అంతేకాకుండా, స‌హ‌చ‌ర డ్రైవర్ మూసా షెరీఫ్‌తో కలిసి ఆసియా-పసిఫిక్ విజేతగా నిలిచిన తొలి భారతీయ జోడీగా రికార్డు నెలకొల్పాడు. ఈ సంచలన విజయంతో మూసా షెరీఫ్ 2026 కో-డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌ను కూడా దక్కించుకున్నాడు.

ఈ ఏడాదే అంతర్జాతీయ రేసింగ్‌లో అడుగుపెట్టిన జీత్ జబాఖ్ సీజన్ అంతటా అద్భుతమైన నిల‌క‌డ‌ను ప్రదర్శించి ఏకంగా 73 పాయింట్లు సాధించాడు. రెండో స్థానంలో నిలిచిన పోటీదారుడి కంటే 35 పాయింట్ల స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించి టైటిల్‌ను ముద్దాడాడు.

ఈ సీజ‌న్‌లో న్యూజిలాండ్ ఒటాగో ర్యాలీ, చెన్నైలో జరిగిన సౌత్ ఇండియా ర్యాలీ పోటీల్లో రెండో స్థానంలో నిలిచిన జీత్, ఇండోనేషియా ర్యాలీలో మొదటి స్థానం సాధించి సత్తా చాటాడు. గతంలో సర్క్యూట్ రేసింగ్‌లో రెండుసార్లు జాతీయ చాంపియన్‌గా నిలిచిన జీత్ జబాఖ్ 2024 నుంచి ర్యాలీ విభాగంలో పోటీపడుతున్నాడు. 

ప్రతీ ర్యాలీలోనూ వేగాన్ని కాపాడుకోవడం, కో-డ్రైవర్ మూసా షెరీఫ్ సరైన దిశానిర్దేశం చేయడం, ఇంజనీర్ల సహకారమే ఈ చారిత్రక విజయానికి కారణమని జీత్ సంతోషం వ్యక్తం చేశాడు. ఈ గెలుపు తన రేసింగ్ సరికొత్త ప్రయాణానికి ఆరంభం మాత్రమేన‌ని పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement