హెల్త్
ఆహారం కేవలం కడుపు నింపడానికే కాదు, శరీరానికి అవసరమైన ఇంధనాన్ని, రోగనిరోధక శక్తిని అందించే ముఖ్య వనరు. అయితే, మనం రోజూ తినే ఆహారంలో ఎంత మోతాదులో పోషకాలు అందుతున్నాయనే స్పృహ చాలామందిలో ఉండదు. హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఐసీఎంఆర్–ఎన్‌ఐఎన్) ప్రచురించిన ‘కౌంట్ వాట్ యు ఈట్’పుస్తకం ఈ అంశంపై పూర్తి స్థాయి అవగాహనను కల్పిస్తోంది. వంటకాల తయారీ విధానం నుంచి పోషకాల లెక్కింపు వరకు ఎన్నో విశేషాలను ఈ పుస్తకం అందిస్తోంది. ఇందులో ఏమున్నాయంటే..!
పోషకాల విశ్లేషణ
సాధారణ వంటల పుస్తకాలు కేవలం వంటకాల తయారీ విధానాన్ని మాత్రమే తెలియజేస్తాయి. కానీ, ఈ పుస్తకం వంటల తయారీని ఒక శాస్త్రంగా, కళగా పరిగణిస్తుంది. ప్రతి వంటకం నుంచి శరీరానికి లభించే కేలరీలు, ప్రొటీన్లు, పిండిపదార్థాలు (కార్బోహైడ్రేట్లు), కొవ్వులు, మినరల్స్ పరిమాణాలను గ్రాముల కొలతల్లో అందిస్తుంది. వంట చేసేటప్పుడు అధిక వేడి వల్ల లేదా ఎక్కువసేపు మరిగించటం వల్ల విటమిన్లు ఏ విధంగా నశిస్తాయో వివరించడంతో పాటు, వాటిని పరిరక్షించే పద్ధతులనూ పేర్కొన్నారు.
నిత్యజీవితంలో ఆచరణీయం
ధాన్యాలు, పప్పుదినుసులు, కూరగాయలు, ఆకుకూరలు, పాల ఉత్పత్తులు, మాంసాహారం వంటి ముడి ఆహార పదార్థాల పోషక విలువల పట్టికలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. వంటకాల్లో ఉపయోగించే నూనె, మసాలాల పరిమాణాన్ని వ్యక్తిగత అవసరాలు, ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా ఎలా మార్చుకోవచ్చో స్పష్టమైన సూచనలు ఇచ్చారు.
అందరికీ ఒక రిఫరెన్స్ గైడ్
ఈ పుస్తకం కేవలం గృహిణులకు మాత్రమే కాకుండా, వివిధ వర్గాల ప్రజలకు, రోగులకు సమతుల్యమైన ఆహార చార్టులు రూపొందించే డైటీషియన్లు, వైద్యులు, పరిశోధకులకు సమగ్రమైన సమాచారాన్ని అందించే రిఫరెన్స్ గైడ్‌గా ఉపయోగపడుతుంది. మనం ఏమి తింటున్నామో, అందులోని పోషకాల విలువ ఏమిటో తెలుసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్మించుకోవచ్చు. అందుకు ఈ పుస్తకం ఉపకరిస్తుŠంది. హైదరాబాద్ తార్నాకలోని ఎన్‌ఐఎన్ కార్యాలయంలో ఈ పుస్తకం అమ్ముతున్నారు.
ఇందులో ప్రధానంగా ఆహార పదార్థాల్లోని ప్రొటీన్, కొవ్వు, కార్బొహైడ్రేట్లు, కాల్షియం, విటమిన్లు, ఐరన్ తదితర పొషకాల గురించి వివరించడంతోపాటు ఎంత పరిమాణంలో తీసుకోవాలో వివరించారు. అదేవిధంగా ధాన్యాలు, బ్రెడ్, బిస్కెట్ (ఉప్పు), బిస్కెట్ (తీపి), పప్పులు, ముడి గింజలు, ఆకుకూరలు, దుంపలు–గడ్డలు, ఇతర కూరగాయలు, గింజలు, నూనె గింజలు, కొబ్బరి పాలు, కొబ్బరి నీళ్లు, సుగంధ ద్రవ్యాలు/మసాలాలు, పండ్లు, చేపలు, మాంసం, కోడిమాంసం, కోడిగుడ్డు, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, నూనె, చక్కెర, తేనె, బెల్లం, సగ్గుబియ్యం వంటి పదార్థాల్లో లభ్యమయ్యే పోషకాల గురించి గణాంకాల వారీగా పేర్కొన్నారు.
ఏ పోషకం ఎంత తినాలి?
మారుతున్న ఆహారపు అలవాట్లు, ఆధునిక జీవనశైలి కారణంగా భారతీయుల్లో జీవనశైలి వ్యాధులు (మధుమేహం, గుండెజబ్బులు, రక్తపోటు తదితర వ్యాధులు) పెరుగుతున్న నేపథ్యంలో జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్) సమగ్ర ఆహార నియమావళిని విడుదల చేసింది. ఒక సగటు వయోజనుడికి రోజూ అవసరమయ్యే సుమారు 2,000 కిలో కేలరీల శక్తిని దృష్టిలో ఉంచుకొని రూపొందించిన ‘మై ప్లేట్ ఫర్ ది డే’నమూనా ఆధారంగా ఏయే ఆహార పదార్థాలు, పోషకాలు రోజుకు ఎన్ని గ్రాములు తీసుకోవాలో ఎన్‌ఐఎన్ స్పష్టమైన కొలమానాలను నిర్దేశించింది.
ఐసీఎంఆర్–ఎన్‌ఐఎన్ మార్గదర్శకాల ప్రకారం సగటు వ్యక్తి రోజుకు 250 గ్రాముల ధాన్యాలు, 85 గ్రాముల పప్పులు, 400 గ్రాముల కూరగాయలు, 100 గ్రాముల పండ్లు, 300 మి.లీ. పాలు లేదా పెరుగు, 35 గ్రాముల గింజలు, 27 గ్రాముల నూనె తీసుకోవాలి. రోజుకు ఉప్పు 5 గ్రాములకు మించరాదు. ఆహార పళ్లెంలో సగం కూరగాయలు, పండ్లతో నింపడం ద్వారా జీవనశైలి వ్యాధులను అరికట్టవచ్చని ఎన్‌ఐఎన్ ఎప్పటి నుంచో చెబుతోంది. ఇంతకీ నేనెంత తింటున్నాను?.. ప్రతి ఒక్కరూ వేసుకోవాల్సిన ప్రశ్న ఇది! అందుకే తినే ఆహార లెక్కల కోసం ఈ పుస్తకాన్ని మీరూ ఓ సారి చెక్ చేయండి.
- సాక్షి, స్పెషల్ డెస్క్
ఇదీ చదవండి: ఒకే భూమి – ఒకే ఆరోగ్యం


