breaking news
Healthy Eating
-
అతిగా అన్నం తినడమూ వ్యసనమే!
మనదేశంలో ముఖ్యంగా దక్షిణాది భోజనంలో అన్నం ప్రధానమైనది. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి.. ఇలా ప్రతి పూట కంచంలో గుప్పెడు అన్నం పడందే చాలామందికి కడుపు నిండిన భావనే రాదు. ఈ ఒక్కమాటను గమనించాలి, ‘కడుపు నిండడం కాదు కడుపు నిండిన భావన’. మోతాదుకు మించి అన్నం తినే అలవాటు ఉంటే అది కేవలం ఆకలి మాత్రమే కాదని, ఇదొక రకమైన ’కార్బోహైడ్రేట్ వ్యసనం’ కావచ్చని ఆధునిక ఆరోగ్య నిపుణులు, పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.అన్నం వ్యసనంగా ఎలా మారుతుంది?అన్నంలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ. అన్నం కడుపులోకి వెళ్లగానే గ్లూకోజ్‌గా మారి రక్తంలో చక్కెర స్థాయిలను ఒక్కసారిగా పెంచుతుంది. దీనివల్ల మెదడులోని ‘రివార్డ్ సిస్టమ్’ప్రేరేపితమై డోపమైన్ హార్మోన్ విడుదలవుతుంది. ఈ హార్మోన్ తాత్కాలికంగా మనకు ఒక రకమైన ఆనందాన్ని, సంతృప్తిని ఇస్తుంది. ఎప్పుడైతే ఆ సంతోష స్థాయిలు, శక్తి తగ్గిపోతాయో, మెదడు మళ్లీ అదే స్థాయి ఆనందం కోసం తక్షణ శక్తినిచ్చే అన్నం కోసం డిమాండ్ చేస్తుంది. ఇదే చక్రం పునరావృతమై క్రమంగా అది అన్నం తినాలనే బలమైన కోరికగా మారుతుంది. ఈ బలహీనతను పరిశోధకులు కార్బ్ క్రేవింగ్(పిండి పదార్థాలు లేదా తీపి పదార్థాలను మళ్లీ మళ్లీ తినాలనే తీవ్రమైన కోరిక) అంటున్నారు.పరిశోధకుల మాటల్లో...పరిశోధకుడు డాక్టర్ డేవిడ్ కిస్ ‘తెల్లటి అన్నం, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు మెదడులోని డోపమైన్ మార్గాలను మాదకద్రవ్యాల మాదిరిగానే ఉత్తేజపరుస్తాయి. అందుకే చాలామందికి ఇతర ఆహారాలతో కడుపు నిండినప్పటికీ, మనసు సంతృప్తి చెందక అన్నం తిని సంతృప్తి చెందుతారు. ఇది శారీరక ఆకలి కాదు, మెదడు కోరుకునే వ్యసనం’అన్నారు.బిహేవియరల్ న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ డాక్టర్ నికోల్ ఏ.వియెరా ‘మన సాంస్కృతిక ఆహారపు అలవాట్లలో అన్నం ఒక భాగం. ఒత్తిడిని తట్టుకోవడానికి ఇదొక స్ట్రెస్‌బస్టర్, మానసిక ప్రశాంతత కోసం కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే అన్నంపై ఆధారపడటం అలవాటుగా మారితే అది మానసిక బానిసత్వానికి దారితీస్తుంది. దీన్ని తగ్గించాలని ప్రయత్నించినప్పుడు కొందరిలో ఆందోళన, చికాకు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది పూర్తిగా వ్యసన లక్షణమే’అన్నారు.ఈ వ్యసనం వల్ల కలిగే నష్టాలు?మధుమేహం ముప్పు: అన్నాన్ని అధికంగా తీసుకోవడం వల్ల రక్తంలో ఇన్సులిన్ స్థాయి లు అకస్మాత్తుగా పెరిగి, కాల క్రమేణా టైప్–2 డయాబెటిస్‌కు దారితీస్తుంది.బరువు పెరగడం: అన్నంలో కేలరీలు ఎక్కువ, పీచు పదార్థం తక్కువగా ఉండటం వల్ల పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి ఊబకాయం వస్తుంది.నీరసం, అలసట: రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరిగి మళ్లీ పడిపోవడం వల్ల భోజనం చేసిన కొద్దిసేపటికే తీవ్రమైన అలసట, నిద్రమత్తు ఆవహిస్తాయి.ఈ అలవాటు నుంచి బయటపడటం ఎలా?క్రమంగా తగ్గించడం: ఒక్కసారిగా అన్నం మానేయకుండా, క్రమంగా పరిమాణాన్ని తగ్గించుకోవాలి.ప్రత్యామ్నాయాలు: వైట్ రైస్‌కు బదులుగా బ్రౌన్ రైస్, దంపుడు బియ్యం, తృణధాన్యాలు వాడటం మంచిది.- సాక్షి, స్పెషల్ డెస్క్ -
మూడొంతుల మందికి మంచి తిండి కలే
న్యూఢిల్లీ: దేశంలో దాదాపు మూడొంతుల మందికి ఆరోగ్యకరమైన ఆహారం ఇప్పటికీ కలే. పళ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, మాంసం తదితరాలతో కూడిన సమతులాహారం సగటు భారతీయులకు ఇప్పటికీ అందని ద్రాక్షగానే ఉంది. అంతేగాక ఏటా 17 లక్షల మందికి పైగా అనారోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ, తద్వారా వచ్చే క్యాన్సర్, మధుమేహం తదితర వ్యాధులతో మృత్యువాత పడుతున్నారు. సెంటర్‌పర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ), డౌన్ టు అర్త్ మేగజీన్ విడుదల చేసిన ‘గణాంకాల్లో భారత పర్యావరణ స్థితిగతులు: 2022’ నివేదిక ఈ మేరకు పేర్కొంది. ఆహార వ్యయం వ్యక్తిగత ఆదాయంలో 63 శాతాన్ని మించితే సదరు వ్యక్తులకు ఆరోగ్యకరమైన ఆహారం అందుబాటులో లేనట్టేనని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ చెబుతోంది. 20 ఏళ్లు, అంతకు మించిన వాళ్ల రోజువారీ ఆహారంలో కనీసం 200 గ్రాముల పండ్లు తప్పనిసరి. కానీ భారత్‌లో మాత్రం సగటున 35 గ్రాములకు మించి తినడం లేదట. అలాగే రోజుకు 300 గ్రాముల దాకా కూరగాయలు తీసుకోవాల్సి ఉండగా 168 గ్రాములతో సరిపెడుతున్నారు. కొంతకాలంగా పరిస్థితిలో మెరుగుదల కనిపిస్తున్నా మొత్తమ్మీద చూస్తే అంత సానుకూలంగా లేదని నివేదిక పేర్కొంది. ‘‘ఆహార ధరలు నానాటికీ కొండెక్కుతుండటమే ఇందుకు ప్రధాన కారణం. వినియోగదారుల ఆహార ధరల సూచీ ద్రవ్యోల్బణం ఏడాదిలోనే ఏకంగా 327 శాతం పెరిగిపోయింది’’ అంటూ ఆందోళన వెలిబుచ్చింది. -
మా అబ్బాయి బరువు తగ్గడం ఎలా?
మా అబ్బాయి వయసు 13 ఏళ్లు. బరువు 64 కిలోలు. వాడు విపరీతంగా బరువు పెరుగుతున్నాడు. మా వాడి విషయంలో నాకు తగిన సలహా ఇవ్వండి. - నాగరాణి, సింగరాయకొండ టీనేజ్‌లో నుంచి సరైన ఆరోగ్యకరమైన అలవాట్లు నేర్పకపోతే పిల్లలు మరింత బరువు పెరిగి, అది భవిష్యత్తులో ఎన్నో రుగ్మతలకు దారితీసే ప్రమాదం ఉంది. అందుకే మీ బాబు వయసులోనే వాళ్లకు ఆరోగ్యకరమైన అలవాట్లు నేర్పాలి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి... స్వీట్లు, సాఫ్ట్‌డ్రింక్స్, జామ్ వంటి వాటిని క్రమంగా తగ్గించడం లేదా పూర్తిగా అవాయిడ్ చేయడం మంచిది. కూల్‌డ్రింక్స్‌కు పిల్లలను దూరంగా ఉంచాలి. బేకరీ ఉత్పాదనల్లోని కొవ్వు పాళ్లు పిల్లల్లో బరువును మరింతగా పెంచుతాయి. కాబట్టి కొవ్వుతో ఉండే ఆహారాలను పరిహరించి, పీచు ఎక్కువగా ఉండే ఆకుకూరలు, తాజా పండ్లు వంటివి తినడం అలవాటు చేయాలి. వంటలో ఎక్కువగా నూనెలు వాడటం, నెయ్యి, వెన్న వంటివి పిల్లల్లో మరింతగా బరువు పెంచుతాయి. వాటిని ఎక్కువగా వాడవద్దు. సాధ్యమైనంతవరకు బయటి ఆహారానికి బదులు ఇంట్లోనే తయారు చేసిన ఆహారాలే ఇవ్వడం మంచిది. పై అలవాట్ల నేర్పడంతో పాటు ముందుగా పిల్లల్లో థైరాయిడ్ వంటి మెడికల్ సమస్యలు ఏమైనా ఉన్నాయేమో అని కూడా పరీక్షలు చేయించి, అవేవీ లేవని రూల్ అవుట్ చేసుకోవడం అవసరం. డాక్టర్ భక్తియార్ చౌదరి స్పోర్ట్స్ మెడిసిన్, ఫిట్నెస్ నిపుణుడు, హైదరాబాద్


