మూడొంతుల మందికి మంచి తిండి కలే

71 percent Indians cannot afford healthy diet - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో దాదాపు మూడొంతుల మందికి ఆరోగ్యకరమైన ఆహారం ఇప్పటికీ కలే. పళ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, మాంసం తదితరాలతో కూడిన సమతులాహారం సగటు భారతీయులకు ఇప్పటికీ అందని ద్రాక్షగానే ఉంది. అంతేగాక ఏటా 17 లక్షల మందికి పైగా అనారోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ, తద్వారా వచ్చే క్యాన్సర్, మధుమేహం తదితర వ్యాధులతో మృత్యువాత పడుతున్నారు. సెంటర్‌పర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ (సీఎస్‌ఈ), డౌన్‌ టు అర్త్‌ మేగజీన్‌ విడుదల చేసిన ‘గణాంకాల్లో భారత పర్యావరణ స్థితిగతులు: 2022’ నివేదిక ఈ మేరకు పేర్కొంది.

ఆహార వ్యయం వ్యక్తిగత ఆదాయంలో 63 శాతాన్ని మించితే సదరు వ్యక్తులకు ఆరోగ్యకరమైన ఆహారం అందుబాటులో లేనట్టేనని ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ చెబుతోంది. 20 ఏళ్లు, అంతకు మించిన వాళ్ల రోజువారీ ఆహారంలో కనీసం 200 గ్రాముల పండ్లు తప్పనిసరి. కానీ భారత్‌లో మాత్రం సగటున 35 గ్రాములకు మించి తినడం లేదట. అలాగే రోజుకు 300 గ్రాముల దాకా కూరగాయలు తీసుకోవాల్సి ఉండగా 168 గ్రాములతో సరిపెడుతున్నారు. కొంతకాలంగా పరిస్థితిలో మెరుగుదల కనిపిస్తున్నా మొత్తమ్మీద చూస్తే అంత సానుకూలంగా లేదని నివేదిక పేర్కొంది. ‘‘ఆహార ధరలు నానాటికీ కొండెక్కుతుండటమే ఇందుకు ప్రధాన కారణం. వినియోగదారుల ఆహార ధరల సూచీ ద్రవ్యోల్బణం ఏడాదిలోనే ఏకంగా 327 శాతం పెరిగిపోయింది’’ అంటూ ఆందోళన వెలిబుచ్చింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top