సమతులాహారం... అందని ద్రాక్షే

Average Indian is not eating right Food - Sakshi

71 శాతం మంది పౌష్టికాహారానికి దూరం

సరుకులు తదితరాల ధరలు చుక్కల్లోకి

పదేళ్లలో రెండింతలకు పైగా పెరుగుదల

డి.శ్రీనివాసరెడ్డి:
పీవీ నరసింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగా మన్మోహన్‌సింగ్‌ చేపట్టిన సంస్కరణలు సగం ఉడికిన వంటకంలా ఉన్నాయని ప్రస్తుత మంత్రి నిర్మలా సీతారామన్‌ ఓ సదస్సులో అన్నారు. ‘ఇంకా నయం. మోదీ సర్కారు మాదిరిగా నోట్ల రద్దు, జీఎస్టీ బాదుడు, పెట్రో వాతలతో తినడానికే వీలు కాని మాడిపోయిన వంటకమైతే మన్మోహన్‌ తయారు చేయలేదు’ అంటూ కాంగ్రెస్‌కే చెందిన మరో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం రిటార్టిచ్చారు. వంటకాల గోల ఎలా ఉన్నా సగటు భారతీయులు సరైన తిండి తినే భాగ్యానికి
నోచుకోవడం లేదు. వారికి సమతులాహారం విలాస వస్తువుగా మారుతున్న దుస్థితి దాపురిస్తోంది...!

ఆహారోత్పత్తుల ధరలు కొన్నేళ్లుగా విపరీతంగా పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయంగా ఆహార ధాన్యాలు, ఇంధనం ధరల పెరుగుదల, సరఫరా సమస్యలు తదితరాలు ఇందుకు కారణమని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఫైనాన్స్‌ అండ్‌ పాలసీకి చెందిన ప్రొఫెసర్‌ లేఖా చక్రవర్తి చెప్పారు.
► దేశంలో ఏకంగా 71 శాతం మందికి ఆరోగ్యకరమైన ఆహారం అందుబాటులో లేదని సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ (సీఎస్‌ఈ), డౌన్‌ టు అర్త్‌ పత్రిక సంయుక్త నివేదిక తేల్చింది. ప్రపంచవ్యాప్త సగటు (42 శాతం) కంటే ఇది చాలా ఎక్కువ!
► సగటు భారతీయ కుటుంబపు ఆహార ఖర్చు గత పదేళ్లలో అక్షరాలా రెట్టింపైంది.
► ముగ్గురుండే కుటుంబానికి వారానికి ఐదు లీటర్ల పాలు, రెండేసి కిలోల బియ్యం, గోధుమ పిండి, టమాటాలు, ఆలుగడ్డలు, ఉల్లిపాయలు, లీటరు నూనె, పప్పు ధాన్యాలు, పండ్లు అవసరం.
► వీటన్నింటి ధరలూ ఆహార పదార్థాల ధరల సూచీ (సీఎఫ్‌పీఐ) ప్రకారమే 2014 నుంచి గత ఎనిమిదేళ్లలోనే 80 శాతం దాకా పెరిగాయి.
► గత ఏడాదిలో చూసుకున్నా దాదాపు 10 శాతం పెరిగినట్టు కేంద్ర గణాంకాలే చెబుతున్నాయి.

ధరాభారంతో బెంబేలు
ఆదాయం మూరెడు పెరిగితే ధరలు బారెడు పెరుగుతూ బెంబేలెత్తిస్తున్నాయి. దాంతో సగటు పౌరునికి పౌష్టికాహారం నానాటికీ తగ్గిపోతూ వస్తోంది. కుటుంబ ఆదాయంలో ఆహార వ్యయం 63 శాతానికి మించితే వారికి పౌష్టికాహారం దూరమైనట్టేనని ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ చెబుతోంది.
► ఫలితంగా 21 ఏళ్ల వ్యక్తి రోజుకు 200 గ్రాముల పండ్లకు బదులు 35.8 గ్రాములతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది.
► 300 గ్రాముల కూరగాయలకు బదులు 168.7 గ్రాములే అందుతున్నాయి.
► ఈ పౌష్టికాహార లోపం ఊపిరితిత్తుల వ్యాధులు, మధుమేహంతో పాటు క్యాన్సర్, గుండె సమస్యలకు దారితీస్తోందని గ్లోబల్‌ న్యూట్రిషన్‌ రిపోర్టు హెచ్చరిస్తోంది.

మన థాలి ఖరీదెంత?
సగటు భారతీయుడు తినే థాలి (సమగ్ర భోజనం) ఖరీదును తొలిసారిగా 2019–20 ఆర్థిక సర్వే అంచనా వేసింది. 2020–21లోనూ మరో ప్రయత్నం చేశారు. వాటిలో తేలిందేమిటంటే...
► శాకాహార భోజనం ఖరీదు అండమాన్‌లో అతి ఎక్కువగా రూ. 38.7 , యూపీలో అతి తక్కువగా 23.1 రూపాయలు.
► ఐదుగురున్న కుటుంబపు నెలవారీ భోజన ఖర్చు 2015లో రూ.4,700 ఉంటే ఇప్పుడు రూ.6,700కు పెరిగింది.  
► ఓ మాదిరి వ్యక్తి రెండు పూటల ఇంటి భోజనానికి 2015లో సగటున రూ.32 ఖర్చయితే ఇప్పుడు రూ.44కు పెరిగింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top