‘పారా’ ఆటగాళ్ల పతక వర్షం | 27 medals for India in a single day at the Asian Para Games | Sakshi
Sakshi News home page

‘పారా’ ఆటగాళ్ల పతక వర్షం

Oct 22 2026 4:38 AM | Updated on Oct 22 2026 4:38 AM

27 medals for India in a single day at the Asian Para Games

ఒకే రోజు భారత్‌ ఖాతాలో 27 పతకాలు 

అథ్లెటిక్స్‌లోనే 5 స్వర్ణాలు సహా 22 మెడల్స్‌ 

ప్రస్తుతం 62 పతకాలతో 5వ స్థానంలో భారత్‌

నగోయా: ఆసియా పారా క్రీడల్లో భారత ఆటగాళ్ల అసాధారణ ప్రదర్శన కొనసాగుతోంది. మన ప్లేయర్లే ఒకరితో మరొకరు పోటీ పడుతూ పతకాలు అందుకోవడంలో దూసుకుపోతున్నారు. పోటీల మూడో రోజు బుధవారం భారత బృందం ఖాతాలో ఏకంగా 27 పతకాలు చేరాయి. వీటిలో 5 స్వర్ణాలు సహా 22 మెడల్స్‌ అథ్లెటిక్స్‌లోనే వచ్చాయి. స్విమ్మింగ్‌ మరో 3 పతకాలు అందించగా... ఆర్చరీ, పవర్‌లిఫ్టింగ్‌లలో సాధించిన మెడల్స్‌తో మన ఓవరాల్‌ పతకాల సంఖ్య 62కు చేరింది.  

స్వర్ణధారులు... 
పారా ఆసియా క్రీడల్లో మన అథ్లెట్ల హవా సాగింది. ఐదుగురు భారత అథ్లెట్లు పసిడి పతకాలతో మెరిశారు. పురుషుల షాట్‌పుట్‌ ఎఫ్‌53 ఈవెంట్‌లో ఆయుశ్‌ వర్మ గుండును 8.16 మీటర్ల దూరం విసిరి స్వర్ణం గెలుచుకున్నాడు. అలీరెజా (ఇరాన్‌–8.09 మీ.) రజతం గెలుచుకోగా, మఖమ్‌బెత్‌ (కజకిస్తాన్‌–6.81 మీ.)కు కాంస్యం దక్కింది. పురుషుల షాట్‌పుట్‌ ఎఫ్‌46 ఈవెంట్‌లో మూడు పతకాలు భారత్‌ ఖాతాలోనే చేరడం విశేషం. సచిన్‌ ఖలారి గుండును 15.87 మీటర్లు విసిరి అగ్రస్థానంలో నిలవగా... యాసీర్‌ (15.06 మీ.), పర్వీన్‌ (14.94 మీ.) రజత, కాంస్యాలు సొంతం చేసుకున్నారు. 

పురుషుల 100 మీటర్ల టి47 ఈవెంట్‌లో దిలీప్‌ గవిట్‌ స్వర్ణం గెలుచుకున్నాడు. అతను రేస్‌ను 10.69 సెకన్లలో పూర్తి చేయగా...భారత్‌కే చెందిన మొర్సింగనకత్‌ (10.72 సెకన్లు) రజతం సాధించాడు. కంగున్‌ షి (చైనా–10.80 సెకన్లు)కు కాంస్యం లభించింది. మహిళల 100 మీటర్ల టి20 రేస్‌ను 12.02 సెకన్లలో పూర్తి చేసిన సిమ్రన్‌ స్వర్ణ పతకం అందుకుంది. ఈ రేస్‌లో హజర్‌ సఫర్‌ (ఇరాన్‌–12.30 సెకన్లు), నిపుత్రి (ఇండో నేసియా–12.51 సెకన్లు) రజత, కాంస్యాలు దక్కించుకున్నారు. పురుషుల హైజంప్‌ టి64 పోటీల్లో ప్రవీణ్‌ కుమార్‌ 2.05 మీటర్ల ఎత్తు ఎగిరి స్వర్ణం సాధించగా, మరో భారత ఆటగాడు బంటి (1.92 మీ.) రజతం సాధించాడు. గియజోవ్‌ (ఉజ్బెకిస్తాన్‌–1.86 మీ.)కు కాంస్యం లభించింది.  

అథ్లెటిక్స్‌లో రజత పతక విజేతలు: మహిళల 100 మీ. టి35: ప్రీతి పాల్‌; మహిళల షాట్‌పుట్‌ ఎఫ్‌34: భాగ్యశ్రీ జాదవ్‌; పురుషుల జావెలిన్‌ ఎఫ్‌12/ఎఫ్‌13: మన్‌జీత్‌; మహిళల 100 మీ. టి35: ప్రీతి పాల్‌; మహిళల షాట్‌పుట్‌ ఎఫ్‌34: భాగ్యశ్రీ జాదవ్‌; పురుషుల జావెలిన్‌ ఎఫ్‌12/ఎఫ్‌13: మన్‌జీత్‌; పురుషుల 1500 మీ. టి12/టి13: శరత్‌ 
మకనహళ్లి.  

అథ్లెటిక్స్‌లో కాంస్య పతక విజేతలు: పురుషుల 100 మీ.టి35: అనుభవ్‌ చౌధరీ; 100 మీ. టి37: రాకేశ్‌ భట్‌; 100 మీ. టి64: ప్రణవ్‌ దేశాయ్‌; ఎఫ్‌ 55: సుఖ్‌చైన్‌; మహిళల డిస్కస్‌త్రో ఎఫ్‌55: కరమ్‌జ్యోతి; పురుషుల డిస్కస్‌త్రో ఎఫ్‌ 37: హనీ; పురుషుల లాంగ్‌జంప్‌ టి42/టి61/టి63: శైలేష్‌ కుమార్‌.  

శీతల్‌–పాయల్‌ జోడీకి రజతం 
పారా ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించే లక్ష్యంతో బరిలోకి దిగిన భారత ఆర్చరీ ద్వయం శీతల్‌ దేవి–పాయల్‌ నాగ్‌కు నిరాశ ఎదురైంది. కాంపౌండ్‌ మహిళల డబుల్స్‌ ఫైనల్లో శీతల్‌–పాయల్‌ 141–150తో చైనా చేతిలో పరాజయం పాలయ్యారు. మహిళల పవర్‌లిఫ్టింగ్‌ 67 కేజీల విభాగంలో కస్తూరి రాజమణి మొత్తం 108 కిలోల బరువెత్తి రజతం సొంతం చేసుకుంది. పురుషుల స్విమ్మింగ్‌ 100 మీటర్ల బ్రెస్ట్‌ స్ట్రోక్‌ ఎస్‌బీ11 ఈవెంట్‌లో హిమాన్షు నందల్‌ కాంస్యం గెలుచుకోగా, ఎస్‌బీ14 రేస్‌లో రోహిత్‌ కుమార్‌కు కాంస్యం దక్కింది.  

దీప్తి జివాంజికి స్వర్ణం 
పారా ఆసియా క్రీడల అథ్లెటిక్స్‌లో బుధవారం తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు పతకాలు సొంతం చేసుకున్నారు. తెలంగాణకు చెందిన బానోతు అకీరా నందన్‌ పురుషుల 400 మీ. టి35/38 ఈవెంట్‌లో రజత పతకం సొంతం చేసుకున్నాడు. ఈ రేస్‌ను అకీరా 51.25 సెకన్లలో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రొంగళి రవి పురుషుల షాట్‌పుట్‌ ఎఫ్‌40 ఈవెంట్‌లో కాంస్యం గెలుచుకున్నాడు. గుండును రవి 10.02 మీటర్ల దూరం విసిరి మూడో స్థానంలో నిలిచాడు. 

పురుషుల స్విమ్మింగ్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బుడిగిన రవి కార్తీక్‌ ఈ ఆసియా క్రీడల్లో రెండో పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. 100 మీటర్ల బ్రెస్ట్‌ స్ట్రోక్‌ ఎస్‌13 ఈవెంట్‌లో రవి కార్తీక్‌ రజతం సాధించాడు. రేస్‌ను అతను 1 నిమిషం 10.10 సెకన్లలో పూర్తి చేశాడు. పోటీల రెండో రోజు మంగళవారం తెలంగాణ అథ్లెట్‌ దీప్తి జీవాంజి స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకుంది. మహిళల 400 మీటర్ల టి20 ఈవెంట్‌ను ఆమె 56.36 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని సాధించింది. 2023 హాంగ్జౌ ఆసియా పారా  గేమ్స్‌లోనూ దీప్తికి స్వర్ణం లభించింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement