రెండు స్వర్ణాలు సాధించిన భారత ఆర్చర్
అథ్లెటిక్స్‌లో మరో 5 పసిడి పతకాలు
‘పారా’ ఆసియా క్రీడల్లో నాలుగో స్థానానికి భారత్
‘పారా’ ఆసియా క్రీడల్లో భారత బృందం పతకాల వేట కొనసాగుతూనే ఉంది. పోటీల నాలుగో రోజు గురువారం భారత్ 7 స్వర్ణాలు, 5 రజతాలు, 13 కాంస్య పతకాలు సాధించింది. ఇందులో ఆర్చర్ శీతల్ దేవి రెండు పసిడి పతకాల ప్రదర్శన హైలైట్‌గా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ స్విమ్మర్ రవి కార్తీక్ పోటీల్లో మూడో పతకంతో మెరవగా, ఆంధ్రప్రదేశ్‌కే చెందిన వలసనైని రవన్ని కూడా తన రెండో పతకాన్ని అందుకుంది. ప్రస్తుతం ఓవరాల్‌గా భారత్ 21 స్వర్ణాలు, 26 రజతాలు, 41 కాంస్యాలతో కలిపి 88 పతకాలతో నాలుగో స్థానానికి ఎగబాకింది.
నగోయా: మహిళల ఆర్చరీ కాంపౌండ్ డబుల్స్‌లో రజతంతో సంతృప్తి చెందిన శీతల్ దేవి ఈసారి ఒకే రోజు రెండు స్వర్ణాలతో సత్తా చాటింది. వ్యక్తిగత, మిక్స్‌డ్ ఈవెంట్‌లలో ఆమె పసిడి పతకాలు గెలుచుకుంది. కాంపౌండ్ వ్యక్తిగత ఫైనల్లో శీతల్ 142–139 స్కోరుతో నూర్ అలీమ్ (సింగపూర్)పై విజయం సాధించింది. మిక్స్‌డ్ ఫైనల్లో శీతల్–తోమన్ కుమార్ ద్వయం 151–148 తేడాతో ఇండోనేసియా జోడీ అయుడియా ఫెరేలీ–కెన్ స్వాగుమిలన్‌ను ఓడించింది. పారా అథ్లెటిక్స్‌లో భారత్ ఖాతాలో గురువారం కూడా 5 స్వర్ణాలు చేరాయి.
పురుషుల 400 మీటర్ల టి27 పరుగులో దిలీప్ గవిట్ పసిడి సాధించాడు. అతను రేస్‌ను 48.27 సెకన్లలో పూర్తి చేశాడు. కకేరు ఇషిదా (జపాన్; 49.58 సెకన్లు), మారూఫాన్ (ఉజ్బెకిస్తాన్; 50.03 సెకన్లు) రజత, కాంస్యాలు గెలిచారు. పురుషుల లాంగ్‌జంప్ టి44/టి62/టి64 ఈవెంట్‌లో సొలైరాజ్ ధర్మరాజ్ (7.15 మీటర్లు) స్వర్ణం గెలుచుకున్నాడు. ఎడీ బెర్నార్డ్ (మలేసియా; 6.34 మీటర్లు) రజతం, యుమా టమాకి (జపాన్; 6.34 మీటర్లు) కాంస్యం సాధించారు. మహిళల డిస్కస్‌త్రో ఎఫ్54 లో సువర్ణ రాజ్ స్వర్ణం అందుకుంది. డిస్క్‌ను ఆమె 15.66 మీటర్ల దూరం విసిరింది. షహాలా (ఇరాన్; 15.45 మీటర్లు), తి గుయెన్ (వియత్నాం; 14.65 మీటర్లు) రజత, కాంస్యాలు అందుకున్నారు.
మహిళల 400 మీటర్ల టి47 పరుగులో అంజనాబెన్ బంబాడియా స్వర్ణం సొంతం చేసుకుంది. ఆమె ఈ ఈవెంట్‌ను 59.97 సెకన్లలో పూర్తి చేయగా, భారత్‌కే చెందిన జయంతి బెహరా (1 నిమిషం 00.65 సెకన్లు) రజతం సాధించింది. ససిరవన్ (థాయ్‌లాండ్; 1 నిమిషం 02.58 సెకన్లు) కాంస్యం అందుకుంది. పురుషుల హైజంప్ టి63 ఈవెంట్‌లో మూడు పతకాలూ భారత్ ఖాతాలోనే చేరడం విశేషం. శైలేష్ కుమార్ 1.89 మీటర్ల ఎత్తుకు ఎగిరి స్వర్ణం సాధించగా...వరుణ్ భాటి (1.84 మీటర్లు), రాహుల్ (1.81 మీటర్లు) రజత, కాంస్యాలు దక్కించుకున్నారు.
భారత రజత పతక విజేతలు: ఆర్చరీ: స్వాతి చౌధరీ (మహిళల డబ్ల్యూ1 ఈవెంట్); అథ్లెటిక్స్: తేజల్‌బెన్ (మహిళల 400 మీ. టి12); స్విమ్మింగ్: కపిల్‌కుమార్ (పురుషుల 400 మీ. ఫ్రీస్టయిల్ ఎస్10).
భారత కాంస్య పతక విజేతలు: బ్యాడ్మింటన్: సూర్యకాంత్–నవీన్ శివకుమార్ (పురుషుల డబుల్స్ ఎస్‌ఎల్3–ఎస్‌యూ5); సంజన కుమారి (మహిళల సింగిల్స్ ఎస్‌ఎల్3); మనీషా రాందాస్–ప్రమోద్ భగత్ (మిక్స్‌డ్ డబుల్స్ ఎస్‌ఎల్3–ఎస్‌యూ5); అభిజీత్ సఖూజా, సుహాస్ లలినకేరే (పురుషుల సింగిల్స్ ఎస్‌ఎల్4); మనీషా రాందాస్ (మహిళల సింగిల్స్ ఎస్‌యూ5); కృష్ణ నగార్–నిత్యశ్రీ సుమతి (మిక్స్‌డ్ డబుల్స్ ఎస్‌హెచ్6). స్విమ్మింగ్: తేజస్ నందకుమార్ (పురుషుల 100 మీ. బ్యాక్‌స్ట్రోక్ ఎస్7); స్వాతిక్ పాటిల్ (పురుషుల 100 మీ. బ్రెస్ట్‌స్ట్రోక్ ఎస్‌బీ9). టేబుల్ టెన్నిస్: శుభమ్ వాధ్వా–భవీనా పటేల్ (మిక్స్‌డ్ డబుల్స్–క్లాస్ ఎక్స్‌డీ7).
రవి కార్తీక్, రవన్నిలకు కాంస్యాలు
ఆంధ్రప్రదేశ్ స్విమ్మర్ బుడిగిన రవి కార్తీక్ ఆసియా క్రీడల్లో 2 రజతాల తర్వాత కాంస్యాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. పురుషుల 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లీ ఎస్‌ఎం13 ఈవెంట్‌ను 2 నిమిషాల 28.36 సెకన్లలో ముగించి అతను రెండో స్థానంలో నిలిచాడు. రవన్ని ఈ క్రీడల్లో రెండో కాంస్యాన్ని అందుకుంది. మహిళల 400 మీటర్ల టి11 పరుగును 1 నిమిషం 03.64 సెకన్లలో పూర్తి చేసి ఆమె మూడో స్థానం సాధించింది.


