తిరుపతి కలెక్టరేట్ వద్ద చెవిరెడ్డిని అరెస్టు చేస్తున్న పోలీసులు
కలెక్టరేట్ వద్ద నిరసన.. అదుపులోకి తీసుకున్న పోలీసులు
చెవిరెడ్డి లక్ష్మి, మోహిత్‌రెడ్డి, హర్షిత్‌రెడ్డిలతో పాటు అభ్యర్థులు అరెస్ట్
టీడీపీ గూండాల దాడులపై ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులతో కలిసి శాంతియుత నిరసన
తిరుపతి రూరల్: తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్లను దాఖలు చేయనివ్వకుండా దాడులు చేయడాన్ని నిరసిస్తూ చంద్రగిరి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఆధ్వర్యంలో అభ్యర్థులు కలెక్టర్ కార్యాలయంలో బుధవారం శాంతియుత నిరసన చేపట్టారు. అనంతరం ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కలెక్టర్‌కు విన్నవించారు. తమ నామినేషన్లను దాఖలు చేయించేంత వరకు కలెక్టర్ కార్యాలయం నుంచి కదిలేది లేదని బైఠాయించారు.
నామినేషన్ కేంద్రాల వద్ద టీడీపీ గూండాల చేతిలో గాయపడిన అభ్యర్థులతో కలసి 6 గంటలపాటు అక్కడే బైఠాయించిన చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డిలకు మద్దతు తెలిపేందుకు వైఎస్సార్‌సీపీ నేత, ప్రభుత్వ మాజీ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో పాటు ఆయన సతీమణి లక్ష్మి అక్కడకు వచ్చారు. దీంతో పోలీసులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి దంపతులతోపాటు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డిలను అదుపులోకి తీసుకుని తిరుచానూరు పోలీస్ స్టేషన్‌కు తరలించించి అక్రమంగా నిర్బంధించారు.

దీంతో చెవిరెడ్డితో పాటు ఆయన కుటుంబం మొత్తం ఎంపీటీసీ అభ్యర్థులతో కలసి పోలీస్ స్టేషన్‌లోనే నేలపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. అక్రమ అరెస్టులకు చెవిరెడ్డి కుటుంబం భయపడదని, తప్పు చేసిన ఏ అధికారినీ వదిలిపెట్టేది లేదని చెవిరెడ్డి హెచ్చరించారు. అక్రమ నిర్బంధంలో ఉన్న చెవిరెడ్డి కుటుంబానికి సంఘీభావంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు పెద్దఎత్తున తిరుచానూరు పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు.


