తమ అభ్యర్ధులను పోలీసులే అడ్డుకోవడంపై ఎస్‌ఈసీకి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు
అక్రమాలకు పాల్పడిన పోలీసు, రెవెన్యూ యంత్రాంగాన్ని ఎన్నికల విధుల నుంచి తప్పించాలని డిమాండ్
సాక్షి, అమరావతి: మున్సిపల్ ఎన్నికల తరహాలోనే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియకు టీడీపీ నేతలు ఆటంకాలు కల్పించి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకోవడంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్రను పునేఠకు వైఎస్సార్‌సీపీ నేతలు బుధవారం ఫిర్యాదు చేశారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, శాంతి భద్రతలను కాపాడుతూ అభ్యర్థులకు రక్షణ కల్పించాలని వైఎస్సార్‌సీపీ నేతలు కోరారు.
మున్సిపల్ ఎన్నికల్లో కనీసం నామినేషన్లు దాఖలు చేయనివ్వని పరిస్థితులపై స్వయంగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న తర్వాత కూడా పలుచోట్ల పోలీసులే అధికార పార్టీ గూండాలకు అండగా నిలవడం.. నామినేషన్లు వేయడానికి వెళుతున్న మహిళలను అడ్డుకోవడం.. అనంతపురం, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, పల్నాడు జిల్లాల్లో అభ్యర్థులపై దాడుల ఘటనలను ఎస్‌ఈసీ దృష్టికి తెచ్చారు. అనంతరం పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు మీడియాతో మాట్లాడారు.
సుప్రీం ఆదేశాలు పాటించకుంటే మరోసారి న్యాయపోరాటం
సుప్రీంకోర్టు ఆదేశాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా అమలు చేయాలని.. మున్సిపల్ ఎన్నికల నామినేషన్లలో అక్రమాలకు పాల్పడిన పోలీసు, రెవెన్యూ అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని నేతలు డిమాండ్ చేశారు. ‘సుప్రీంకోర్టు తీర్పును తమకు అనుకూలంగా వక్రీకరించి ప్రచారం చేస్తున్న అధికార పార్టీ తీరును ఎన్నికల సంఘం గమనించాలి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల విషయంలో ఎన్నికల సంఘం న్యాయం చేయకుంటే మరోసారి సుప్రీంకోర్టు తలుపులు తడతాం. చట్టాన్ని పక్కనపెట్టి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించే పోలీసు, రెవెన్యూ అధికారులపై న్యాయపోరాటం చేస్తాం. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఘటనలపై విచారణ జరిపించి బాధ్యులను చట్టం ముందు నిలబెడతాం’ అని పేర్కొన్నారు.
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సమయంలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం వ్యవహరించిన తీరుతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని.. ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ సీఎం చంద్రబాబు తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డీజీపీ, హోంమంత్రి నైతిక బాధ్యత వహించాలన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికైనా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల నిర్వహణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. శాంతి భద్రతలను కాపాడటంలో విఫలమైన పోలీసు అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని పేర్కొన్నారు. ఎన్నికల కమిషనర్‌ను కలిసిన వారిలో వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.మనోహర్‌రెడ్డి, పార్టీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్‌రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి యనమల నాగార్జునయాదవ్ తదితరులున్నారు.


