హింస జరుగుతుంటే నామినేషన్లు వేయడానికి ఎవరొస్తారు?.. నామినేషన్ల కేంద్రాల వద్ద శాంతిభద్రతలు లేకుంటే ఎలా?
సామాన్యులు నామినేషన్ కేంద్రాల వైపు కన్నెత్తి చూసే ధైర్యం చేయగలరా?
నిర్లక్ష్యం వహిస్తే సహించం
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు రక్షణ కల్పించాలి
పోలీసుల తీరును తీవ్రంగా ఆక్షేపించిన సుప్రీంకోర్టు
స్థానిక ఎన్నికల్లో పచ్చమూకల స్వైర విహారంపై పోలీసులు, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు గడ్డిపెట్టిన అత్యున్నత న్యాయస్థానం
ఒక్క కేసు కూడా నమోదు చేయకపోవడంపై విస్మయం
ఒక్క ఫిర్యాదూ రాలేదన్న ప్రభుత్వ న్యాయవాదుల వాదనపై ఆశ్చర్యం
ఇలాంటి పరిస్థితుల్లో నామినేషన్లు వేయడానికి ఎవరొస్తారు?
విపక్షంతో సహా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం అందరికీ సమానంగా ఉండాలి
గట్టి బందోబస్తు, సీసీటీవీలు ఏర్పాటు చేయండి
మా ఆదేశాల అమలుకు తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వండి
డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశం
శాంతిభద్రతల కారణంగా నామినేషన్లు వేయలేని చోట్ల గడువు పెంచండి
అభ్యర్థుల తుది జాబితా ప్రకటనను 25కి వాయిదా వేయండి
వైఎస్సార్‌సీపీ, ఇతరులు ఇచ్చిన ఫిర్యాదులను, ఆధారాలను పరిశీలించండి
గడువు పెంచితే 48 గంటల సమయం ఇవ్వండి
జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లే నామినేషన్లను స్వీకరించేలా ఏర్పాట్లు చేయండి
మా ఆదేశాల అమలుపై నివేదిక ఇవ్వండి
రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు సుప్రీంకోర్టు ఆదేశం.. తదుపరి విచారణ ఈ నెల 27కి వాయిదా
స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికలు రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగం.. ఎన్నికల్లో పాల్గొనే హక్కు, నామినేషన్లు వేసే హక్కు అందులో అంతర్భాగం.. సాధారణంగా ఎన్నికల విషయంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవు.. కానీ రాజ్యాంగ బాధ్యతల నిర్వహణలో ఎన్నికల సంఘం విఫలమైతే మా జోక్యం తప్పదు..
వైఎస్సార్‌సీపీ అన్నీ ఆధారాలతోనే మా వద్దకు వచ్చింది.. బల ప్రయోగం, బెదిరింపులు, శాంతిభద్రతలకు విఘాతంపై ఆధారాలిచ్చింది.. అలాంటప్పుడు మా న్యాయ సమీక్ష అధికారాన్ని పక్కన పెట్టేయలేం.. కండబలం, దౌర్జన్యం కారణంగా ఎన్నికలు కలుషితమవుతుంటే చేతులు ముడుచుకుని ఉండలేం..
విస్తృతమైన హింస వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగి, దాని కారణంగా నామినేషన్ల దాఖలులో అభ్యర్థులందరికీ సమాన అవకాశాలు లేనప్పుడు, రాష్ట్ర ఎన్నికల సంఘం తన రాజ్యాంగ బాధ్యతను నెరవేర్చనప్పుడు, కోర్టు న్యాయ సమీక్షాధికారాన్ని ఉపయోగించకుండా ఉండలేదు.
ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులందరూ ఎలాంటి ఆటంకం లేకుండా నామినేషన్ పత్రాలను దాఖలు చేసేలా చూడటానికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టడం కూడా ఖచ్చితంగా ఆ బాధ్యతల్లో భాగమే.
నామినేషన్ పత్రాల దాఖలు సమయంలో బలాన్ని ప్రయోగించడం, బెదిరింపులకు గురిచేయడం లాంటి తీవ్రమైన ఆందోళనకర ఘటనలను నిరూపించే సమగ్ర ఆధారాలు, వినతిపత్రాలను కోర్టు ముందుంచింది. ఎన్నికల విషయాల్లో కోర్టులు జోక్యం చేసుకోకూడదనే నెపంతో మా న్యాయ సమీక్షాధికారాన్ని పక్కన పెట్టేయలేం. ఇలాంటి సందర్భాల్లో ఎన్నికల ప్రక్రియ నిష్పాక్షికంగా, న్యాయబద్ధంగా ముగిసేలా చూడటానికి న్యాయస్థానాల జోక్యం అత్యంత ఆవశ్యకం. ప్రజాస్వామ్యాన్ని, చట్టబద్ధ పాలనను పరిరక్షించడానికి ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో నమ్మకాన్ని కలిగించడం ఎంతో కీలకం.
‘ఎన్నికల చట్టాన్ని నిర్దేశించే సూత్రాలను, వైఎస్సార్‌సీపీ సమర్పించిన ఆధారాలను, ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను, వినతి పత్రాలను ఈ కోర్టు పరిగణనలోకి తీసుకుంటోంది. ఈ వ్యవహారంలో తగిన ఆదేశాలు జారీ చేయడానికి వైఎస్సార్‌సీపీ మా ముందు ప్రాథమిక ఆధారాలను ఉంచింది. వీటి ఆధారంగా ఈ ఆదేశాలు జారీ చేస్తున్నాం.
నామినేషన్ కేంద్రాల వద్ద డీజీపీ తగిన పోలీస్ బందోబస్తు, సీసీటీవీ నిఘాను ఏర్పాటు చేయాలి. సంబంధిత కేంద్రాలకు నామినేషన్లు వేయడానికి వచ్చే అభ్యర్థులకు అవసరమైన భద్రత కల్పించేలా అన్ని చర్యలు తీసుకోవాలి. – సుప్రీంకోర్టు ధర్మాసనం
సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ: స్థానిక సంస్థల ఎన్నికల్లో అడ్డూ అదుపు లేకుండా భౌతిక దాడులతో పేట్రేగిపోతున్న అధికార పార్టీ నేతలకు.. వారితో కుమ్మక్కై శాంతి భద్రతలను గాలికొదిలేసిన పోలీసులకు.. పచ్చమూకల స్వైర విహారాన్ని పట్టించుకోని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు సుప్రీంకోర్టు మూకుమ్మడిగా గడ్డి పెట్టింది. ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు కూడా వేయనివ్వకుండా అడ్డుకోవడం.. పార్టీ అభ్యర్థులపై దాడులకు పాల్పడటం.. వారి ఆస్తుల విధ్వంసం లాంటి ఘటనలపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర విస్మయం వ్యక్తం చేసింది.
స్వేచ్ఛగా, ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికల్లో అడ్డూ అదుపు లేకుండా అధికార పార్టీ నేతలు హింసకు పాల్పడుతుండటంతో పోలీసులు కనీస స్థాయిలో కూడా స్పందించకపోవడం పట్ల తీవ్రస్థాయిలో మండిపడింది. కనీసం ఒక్క కేసు కూడా నమోదు చేయకపోవడాన్ని తీవ్రంగా గర్హించింది. ఎన్నికల ఘర్షణలపై ఇప్పటి వరకు ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని పోలీసుల తరఫున ప్రభుత్వ న్యాయవాదులు చెప్పడంపై కూడా సుప్రీంకోర్టు తీవ్ర విస్మయం వ్యక్తం చేసింది.
‘క్షేత్రస్థాయిలో అంత హింస జరుగుతుంటే.. నామినేషన్ కేంద్రాల వద్ద కనీస స్థాయిలో శాంతి భద్రతలు లేకుంటే.. ఇక నామినేషన్లు వేయడానికి ఎవరొస్తారు? ఇలాంటి పరిస్థితుల నడుమ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే సామాన్యులు నామినేషన్ కేంద్రాల వైపు కన్నెత్తి చూసే ధైర్యం చేయగలరా?’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం పోలీసులను నిలదీసింది. ఎన్నికల్లో పోటీ చేయడానికి విపక్షాలతో సహా అందరికీ పూర్తి అవకాశం ఉండి తీరాలని తేల్చి చెప్పింది. ఈ అరాచకాలను అడ్డుకోకుండా నిర్లక్ష్యం వహిస్తే చూస్తూ ఊరుకునేది లేదని అటు పోలీసులు ఇటు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను సుప్రీంకోర్టు గట్టిగా హెచ్చరించింది.
ఎన్నికల సంఘం విఫలమైతే.. కోర్టుల జోక్యం తప్పదు
‘స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించడమనేది రాజ్యాంగ మౌలిక స్వరూపంలో ఓ భాగం. ఎలాంటి అడ్డంకులు లేకుండా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడం, స్వేచ్ఛగా నామినేషన్ పత్రాలను దాఖలు చేయడం లాంటివి స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికల ప్రక్రియలో కీలక అంశం. అధికరణ 243 జెడ్ ఏ ప్రకారం ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా నిర్వహించడం, పర్యవేక్షించడం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు రాజ్యాంగం అప్పగించిన బాధ్యత.
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులందరూ ఎలాంటి ఆటంకం లేకుండా నామినేషన్ పత్రాలను దాఖలు చేసేలా చూడటానికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టడం కూడా కచ్చితంగా ఆ బాధ్యతల్లో భాగమే. ఎన్నికల విషయాలలో న్యాయస్థానాల ‘న్యాయ సమీక్ష’ అధికారాలు పరిమితం. అయినప్పటికీ.. విస్తృతమైన హింస వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగి, దాని కారణంగా నామినేషన్ల దాఖలులో అభ్యర్థులందరికీ సమాన అవకాశాలు లేనప్పుడు, రాష్ట్ర ఎన్నికల సంఘం తన రాజ్యాంగ బాధ్యతను నెరవేర్చనప్పుడు, కోర్టు న్యాయ సమీక్షాధికారాన్ని ఉపయోగించకుండా ఉండలేదు’ అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
ఎన్నికలు కలుషితమవుతుంటే కోర్టుల జోక్యం తప్పదు
‘న్యాయస్థానాలు సాధారణంగా ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవు. కానీ కండబలం, దౌర్జన్యం కారణంగా ఎన్నికలు కలుషితమవుతుంటే, అలాంటి వాటిని నిరోధించడానికి కోర్టుల జోక్యం తప్పదు. అత్యవసరమైనప్పుడు జోక్యం చేసుకోకుండా కోర్టులు చేతులు ముడుచుకుని కూర్చోవు’ అని ధర్మాసనం విస్పష్టంగా తేల్చి చెప్పింది.
వైఎస్సార్‌సీపీ సమర్పించిన ఆధారాలను పరిగణనలోకి తీసుకున్నాం
‘ఎన్నికల చట్టాన్ని నిర్దేశించే సూత్రాలను, వైఎస్సార్‌సీపీ సమర్పించిన ఆధారాలను, ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను, వినతి పత్రాలను ఈ కోర్టు పరిగణలోకి తీసుకుంటోంది. ఈ వ్యవహారంలో తగిన ఆదేశాలు జారీ చేయడానికి వైఎస్సార్‌సీపీ మా ముందు ప్రాథమిక ఆధారాలను ఉంచింది. వీటి ఆధారంగా ఈ ఆదేశాలు జారీ చేస్తున్నాం’ అని సుప్రీంకోర్టు పేర్కొంది.
అదనపు నామినేషన్ కేంద్రాల కోసం వైఎస్సార్‌సీపీ న్యాయ పోరాటం
స్థానిక ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడమే కాకుండా భౌతిక దాడులతో అధికార పార్టీ నేతలు విధ్వంసం సృష్టిస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ లేదా ఎన్నికల అధికారి లేదా ఆర్డీవో వద్ద నామినేషన్లు దాఖలు చేసేలా ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలంటూ వైఎస్సార్‌సీపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ మండవ కిరణ్మయి.. అదనపు నామినేషన్ కేంద్రాల విషయంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థనను తోసిపుచ్చుతూ ఉత్తర్వులిచ్చారు.
ధర్మాసనం ముందు అప్పీల్
హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాలు చేస్తూ వైఎస్సార్‌సీపీ ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన హైకోర్టు ధర్మాసనం ముందు శనివారం అత్యవసరంగా హౌస్‌మోషన్ రూపంలో అప్పీల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం కొట్టివేస్తూ ఈ నెల 18న ఉత్తర్వులిచ్చింది.
అత్యవసరంగా సుప్రీం తలుపుతట్టిన వైఎస్సార్‌సీపీ
హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులను సవాలు చేస్తూ వైఎస్సార్‌సీపీ అత్యవసరంగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తులు జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీ, జస్టిస్ వి.మోహన ధర్మాసనం బుధవారం సుదీర్ఘ విచారణ జరిపింది. వైఎస్సార్‌సీపీ తరఫున సీనియర్ న్యాయవాదులు మణీందర్ సింగ్, నిఖిల్ గోయల్, న్యాయవాది మెహఫూజ్ నజ్కీ వాదనలు వినిపించారు.
అడుగడుగునా దౌర్జన్యాలు.. అడ్డంకులు
స్థానిక ఎన్నికల్లో ప్రతిపక్ష అభ్యర్థులను అధికార పక్షం అడుగడుగునా అడ్డుకున్న తీరును, పోలీసుల ప్రేక్షకపాత్రను వైఎస్సార్‌సీపీ తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. నామినేషన్ల ఘట్టం మొదలైన రోజు నుంచి వరుసగా జరిగిన ఘటనలన్నింటినీ వివరించారు. నామినేషన్ల ప్రక్రియ ఏకపక్షంగా, హింసాత్మకంగా సాగిందని గణాంకాలతో నివేదించారు. రాష్ట్రంలోని 19 పట్టణ స్థానిక సంస్థల్లో మొత్తం 723 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా అధికార పార్టీ దౌర్జన్యం, పోలీసుల కుమ్మక్కు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిస్సహాయత కారణంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్‌సీపీ కేవలం 263 స్థానాల్లో (36.43 శాతం) మాత్రమే నామినేషన్లు వేయగలిగిందని కోర్టుకు వివరించారు. మిగిలిన సుమారు 63.57 శాతం మంది అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అధికార పార్టీ నేతలు, పోలీసులు ఉద్దేశపూర్వకంగా, భౌతికంగా అడ్డుకున్నారని, ఎన్నికల కేంద్రాల వద్ద దౌర్జన్యాలకు పాల్పడ్డారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.
సిట్టింగ్ ఎంపీపై హత్యాయత్నం జరిగితే.. పోలీసులు ఆయనపైనే కేసు పెట్టారు
పుంగనూరు, రాయచోటి, మైదుకూరు తదితర ప్రాంతాల్లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలను లాక్కుని చించేశారని, అడ్డుకోబోయిన వారిపై భౌతిక దాడులకు దిగారని మణీందర్ సింగ్ తదితరులు సుప్రీం ధర్మాసనానికి నివేదించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షించేందుకు వెళ్లిన స్థానిక సిట్టింగ్ ఎంపీపై ఏకంగా హత్యాయత్నం చేసి, ఆయనకు చెందిన కార్లను తగలబెట్టారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. అయితే విస్మయకరంగా పోలీసులు దాడికి పాల్పడిన వారిపై కాకుండా దెబ్బలు తిన్న బాధితులపైనే హత్యాయత్నం లాంటి అక్రమ కేసులు బనాయించారని కోర్టు దృష్టికి తెచ్చారు.
అభ్యర్థులకు రక్షణపై హైకోర్టు ఆదేశాలు బేఖాతర్
దాడులకు పాల్పడటంపై ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానం ద్వారా ఫిర్యాదు చేసినా స్థానిక పోలీసులు, ఎన్నికల అధికారులు కనీసం పట్టించుకోలేదన్నారు. అభ్యర్థులకు తగిన రక్షణ కల్పించాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు క్షేత్రస్థాయిలో ఏమాత్రం అమలు కాలేదని ధర్మాసనానికి నివేదించారు. దాడులు, బెదిరింపులు, పోలీసుల నిర్లక్ష్యం వల్ల భారీ ఎత్తున ఏకపక్ష ఏకగ్రీవాలు జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో భద్రత పూర్తిగా లోపించినందున ప్రత్యామ్నాయంగా జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ల వద్ద నామినేషన్లు వేసేలా తగిన ఏర్పాట్లు చేయడంతో పాటు లేదా నామినేషన్లు వేయలేకపోయిన వారికి మరో అవకాశం కల్పించేలా నామినేషన్ల గడువును పొడిగించేలా ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేయాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు.
పక్కా ఆధారాలతో వచ్చింది.. అలాంటప్పుడు మా అధికారాన్ని ఎలా పక్కన పెడతాం?
‘ఎన్నికల సంఘం పర్యవేక్షణ, నియంత్రణ విషయంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోకపోవడం అనే సిద్ధాంతం ఒక అత్యవసరమైన అవసరం నుంచి∙పుట్టుకొచ్చింది. ఎన్నికల ప్రక్రియను నిర్దేశిత కాల పరిమితిలోపు పూర్తి చేయడమన్నది స్వతంత్ర రాజ్యాంగ వ్యవస్థ అయిన ఎన్నికల సంఘం పని. ఇందులో కోర్టులు జోక్యం చేసుకుంటే ఆ ప్రక్రియ సకాలంలో పూర్తి కాదు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అన్ని ఫిర్యాదులను లేదా అభ్యంతరాలను ఎన్నికలు పూర్తయిన తర్వాత ‘ఎన్నికల పిటిషన్’ ద్వారా మాత్రమే ప్రస్తావించాల్సి ఉంటుంది. అయితే రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష రాజకీయ పార్టీ (వైఎస్సార్‌సీపీ) ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ముందే హైకోర్టును ఆశ్రయించింది.
నామినేషన్ పత్రాల దాఖలు సమయంలో బలాన్ని ప్రయోగించడం, బెదిరింపులకు గురిచేయడం లాంటి తీవ్రమైన ఆందోళనకర ఘటనలను నిరూపించే సమగ్ర ఆధారాలు, వినతిపత్రాలను కోర్టు ముందుంచింది. ఎన్నికల విషయాల్లో కోర్టులు జోక్యం చేసుకోకూడదనే నెపంతో మా న్యాయ సమీక్షాధికారాన్ని పక్కన పెట్టేయలేం. ఇలాంటి సందర్భాల్లో ఎన్నికల ప్రక్రియ నిష్పాక్షికంగా, న్యాయబద్ధంగా ముగిసేలా చూడటానికి న్యాయస్థానాల జోక్యం అత్యంత ఆవశ్యకం. ప్రజాస్వామ్యాన్ని, చట్టబద్ధ పాలనను పరిరక్షించడానికి ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో నమ్మకాన్ని కలిగించడం ఎంతో కీలకం’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇవీ
శాంతి భద్రతల వల్ల నామినేషన్లు వేయలేని చోట్ల గడువు పెంచండి
రాష్ట్ర ఎన్నికల సంఘం అభ్యర్థుల తుది జాబితా ప్రచురణను 25.10.2026 వరకు వాయిదా వేయాలి. ఈలోగా, వైఎస్సార్‌సీపీ లేదా ఇతర అభ్యర్థులు సమర్పించిన వినతిపత్రాలను, అలాగే వారిచ్చిన ఆధారాలను, ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ పరిశీలించాలి. శాంతిభద్రతల సమస్య కారణంగా అభ్యర్థులు తమ నామినేషన్లను వేయలేకపోయారని భావించే పట్టణ స్థానిక సంస్థల్లో నామినేషన్ల దాఖలుకు గడువును పొడిగించేలా నిర్ణయం తీసుకోవాలి. అటువంటి నిర్ణయాన్ని ఎన్నికల కమిషన్ కచ్చితంగా రేపటికల్లా (గురువారం) తీసుకోవాలి. ఎక్కడైనా నామినేషన్ గడువును పొడిగించాలని నిర్ణయించుకుంటే.. ఆ నిర్ణయాన్ని ప్రచురించిన సమయం నుంచి కనీసం 48 గంటల సమయాన్ని ఎన్నికల నోటిఫికేషన్‌ను సవరించడం ద్వారా పొడిగించాలి.
కలెక్టర్ వద్ద నామినేషన్లకు ఏర్పాట్లు చేయండి
అవసరమైన ప్రదేశాలలో నామినేషన్లు వేయడానికి, జిల్లా కలెక్టర్ సమక్షంలో జిల్లా కేంద్రాలలో నామినేషన్లు వేసేందుకు అనువుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ అదనపు ఏర్పాట్లు చేయాలి. వీటితో పాటు వైఎస్సార్‌సీపీకి, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఎన్నికల ప్రక్రియలో స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా పాల్గొనే అవకాశం ఉందన్న నమ్మకాన్ని కలిగించాలి. వారి అనుమానాలను నివృత్తి చేసేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అన్ని అవసరమైన చర్యలు తీసుకోవాలి. తదుపరి విచారణ తేదీ నాటికి మా ఈ ఆదేశాల అమలుకు తీసుకున్న చర్యలను వివరిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఓ నివేదికను మా ముందుంచాలి.
అభ్యర్థులకు అవసరమైన భద్రత కల్పించండి
నామినేషన్ కేంద్రాల వద్ద డీజీపీ తగిన పోలీస్ బందోబస్తు, సీసీటీవీ నిఘాను ఏర్పాటు చేయాలి. సంబంధిత కేంద్రాలకు నామినేషన్లు వేయడానికి వచ్చే అభ్యర్థులకు అవసరమైన భద్రత కల్పించేలా అన్ని చర్యలు తీసుకోవాలి. తదుపరి విచారణ నాటికి ఈ ఆదేశాల అమలు విషయంలో నివేదిక సమర్పించాలి.
ఒక్క ఫిర్యాదూ రాలేదన్న ప్రభుత్వం
రాష్ట్రప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, సిద్ధార్థ్ లుథ్రా వాదనలు వినిపిస్తూ.. ప్రతిపక్షాలకు ఎన్నికల్లో పోటీ చేసే ఆసక్తి లేదన్నారు. ఎన్నికల ఘర్షణలపై ఇప్పటి వరకు ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని చెప్పారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ తరఫు సీనియర్ న్యాయవాది పరమేశ్వరన్ స్పందిస్తూ.. అభ్యర్థులు సరైన ఆధారాలతో వస్తే పరిశీలిస్తామని, ఇప్పటికే అందిన ఫిర్యాదుల నేపథ్యంలో మైదుకూరు మున్సిపాలిటీలో ఎన్నికను నిలిపివేశామని తెలిపారు. అందరి వాదనలు విన్న ధర్మాసనం అటు ఎన్నికల సంఘానికి, ఇటు పోలీసులకు విస్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది.


