తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా టీడీపీ గూండాలు అడ్డుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఇంటిపై దాడులు చేసి ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని తెలిపారు. నామినేషన్లు విత్ డ్రా చేసుకోవాలని బెదిరిస్తున్నారని, లేదంటే కేసులు పెడుతున్నారని తెలిపారు.
తాడేపల్లిలో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘పోలీసుల అండతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై దాడులు చేస్తున్నారు. గంజాయి కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై కేసులు పెట్టి ఒత్తిడి తీసుకొస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ఆహ్వానిస్తున్నాం. వాటిని ఎస్‌ఈసీ పాటిస్తుందని భావిస్తున్నాం. ఎక్కడికక్కడ మా అభ్యర్థులను నిర్బంధిస్తున్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా లెక్క చేయడం లేదు. టీడీపీ గూండాలకు పోలీసులు వంత పాడుతున్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ దాడులకు పాల్పడుతున్నారు. మొత్తం 11 జిల్లాల్లో 76 ఘటనలు జరిగాయి. దాడులు చేస్తూ నామినేషన్ పేపర్లు లాక్కుంటున్నారు. ఓటమి భయంలో టీడీపీ వాళ్లు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు.
చంద్రబాబు, ఆయన కొడుకు డైరక్షన్‌లోనే ఇదంతా జరుగుతోంది. మా వైపు నుంచి ఎక్కడా దాడులు లేవు. దాడులను ఎవరు ప్రోత్సహిస్తున్నారు? మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కారుపై దాడి చేశారు. సీనియర్ దళిత నాయకుడిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. దాడులు చేస్తున్న ఈడీపీ వాళ్లకు పోలీసులే రక్షణ కల్పిస్తున్నారు’’ అని చెప్పారు.
పరిషత్ ఎన్నికల్లోనూ అదే తీరు
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలైందని సజ్జల అన్నారు. ‘‘ఈ రెండు ఓవర్ ల్యాప్ కావడం గందరగోళానికి దారి తీస్తోంది. ఇది కాకుండా మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్లు వేయకుండా మా అభ్యర్ధుల్ని అడ్డుకోవడం, స్క్రూటినీలో అడ్డగోలుగా తిరస్కరించడం, స్క్రూటినీకి మా అభ్యర్ధులు రానివ్వకుండా అడ్డుకోవడం చేశారు. అలాగే విత్ డ్రా చేసుకోమనే బెదిరింపులు కూడా కొనసాగాయి. ఆ విధంగా పోలీసుల తప్పుడు కేసులు, వీళ్ల అండతో టీడీపీ నాయకుల బెదిరింపులు కొనసాగాయి. ఈ కారణాల వల్లే మా అభ్యర్ధులు కొన్ని చోట్ల విత్ డ్రా చేసుకున్నారు తప్ప డమ్మీగా నిలబడటమో, వైఎస్సార్సీపీ తరఫున నిలబడాలన్న కోరిక వారికి లేకపోవడమూ కాదు.
పోలీసులు, అధికారుల నుంచి వస్తున్న ఒత్తిళ్ల నుంచి నుంచి తప్పించుకునేందుకు, గంజాయి, ఇతర తప్పుడు కేసుల్లో ఇరికిస్తామనే బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. ఇవాళ మొదలైన పరిషత్ ఎన్నికల నామినేషన్లలోనూ ఇవన్నీ కొనసాగుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు వీటిపై ఫిర్యాదులు చేస్తున్నా ప్రయోజనం ఉండటం లేదు. పోలీసులకు, డీజీపీకి ఫిర్యాదు చేస్తున్నా ఫలితం లేదని ఎస్ఈసీకి చెప్తే .. ఆయన ఆ ఫిర్యాదుల్ని తిరిగి వారికే పంపడం, అధికారులకు నీతి సూత్రాలు చెప్పడం జరుగుతూనే ఉన్నాయి. ఆచరణలో మాకు పై నుంచి ఒత్తిడి ఉంది, ఏమనుకోకండి, మీరు నామినేషన్లు వేయొద్దని బుజ్జగింపులు, బెదిరింపులు, ఇవేవీ కుదరకపోతే తప్పుడు కేసులు పెడుతున్నారు. వీటిపైనే మేం కింది కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేసినా ఫలితం లేక సుప్రీంకోర్టు వరకూ వెళ్లాం’’ అని తెలిపారు.
ఇవాళ 11 జిల్లాల్లో 76 ఘటనలు
ఇవాళ 11 జిల్లాల్లో ఇలాంటి 76 దాడులు, నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకోవడం, నామినేషన్ పత్రాలు చించేయడం వంటి ఘటనలు జరిగాయని సజ్జల తెలిపారు. ‘‘వైఎస్సార్ జిల్లాలో 22, అన్నమయ్య జిల్లాలో 11, పల్నాడు జిల్లాలో 18, తిరుపతి జిల్లా 11, చిత్తూరు జిల్లా 2, ప్రకాశం జిల్లా 4, కర్నూలు జిల్లా 2, నంద్యాల జిల్లా 2, అనంతపురం జిల్లా 2, సత్యసాయి జిల్లా 1, కాకినాడ జిల్లా ఒకటి కలిపి ఇలాంటి 76 ఘటనలు జరిగాయి. ఇందులో టీడీపీ శ్రేణులు పోలీసుల అండతో దాడులు చేసిన ఘటనలు 11, పోలీసుల అండతో స్టేషన్లకు తరలింపులు చేసిన ఘటనలు 14, పోలీసుల గృహనిర్బంధ ఘటనలు 12, పోలీసుల అడ్డగింతలు, బెదిరింపులు, ఇతర ఆంక్షలు 14, నామినేషన్ పత్రాలు చించేసిన ఘటనలు 7, నామినేషన పత్రాలు లాక్కొన ఘటనలు 2 ఉన్నాయి.
గతంలో చెదురుమదురు ఘటనల మధ్య పోలింగ్ జరిగేది. కానీ ఇప్పుడు నామినేషన్ల నుంచే ఇవన్నీ మొదలుపెట్టేశాడు. ఓటమి భయంతో చంద్రబాబు, ఆయన కుమారుడి దర్శకత్వంలో ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు. సుప్రీంకోర్టు దృష్టిలో ఉందని తెలిసీ బరితెగించి మరీ ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు. ఇవన్నీ తిరిగి సుప్రీంకోర్టు ముందు పెడతాం. ఈ ఘటనలకు కారకులైన అధికారుల్ని బదిలీ చేయాలి, వీఆర్ కు పంపాలని ఎస్ఈసీని ఇప్పటికే కోరాం. ఇప్పుడు సుప్రీంకోర్టు ముందూ ఇదే విజ్ఢప్తిచేస్తాం. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత అయినా ఆయా అధికారులు నిబంధనల ప్రకారం వ్యవహరిస్తారని ఆశిస్తున్నాం’’ అని అన్నారు.
ఇదీ చదవండి: రౌడీలను తీసుకొచ్చి రెచ్చగొడుతున్నారు: ఎంపీ మిథున్‌రెడ్డి


