తిరుపతి/అన్నమయ్య జిల్లా: సుప్రీంకోర్టు తీర్పు కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టు అని వైఎస్సార్‌సీపీ నేతలు అన్నారు. ఏపీలో హింస జరిగిన 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల గడువుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అన్యాయాలు చేస్తున్నారు కాబట్టే సుప్రీం కోర్టు స్పందించిందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అధికారులు నామినేషన్లు తీసుకోవడం లేదని, రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు ఎన్నడూ చూడలేదని తెలిపారు. టీడీపీ నేతలు దాడులు చేస్తే బాధితులపైనే కేసులు పెట్టారని చెప్పారు. వందలాది మందిపై అక్రమ కేసులు పెట్టారని అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతోనైనా అధికారులకు బుద్ధి రావాలని పెద్దిరెడ్డి చెప్పారు.
బలిపశువులు కావద్దు: మిథున్‌రెడ్డి
అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని కార్యాలయంలో తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డితో కలిసి రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. కూటమి అరాచకాలపై సుప్రీంకోర్టు చెంపపెట్టు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు ప్రజాస్వామ్య విజయం. అమాయక ప్రజల మధ్య చిచ్చుపెట్టి గ్రామాలను రణరంగంగా మార్చే కుట్రలు చేస్తున్నారు. కక్షపూరిత ఆలోచనలతో ఘర్షణలు రేకెత్తిస్తున్నారని, ఏదైనా ప్రాణనష్టం జరిగితే ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి.
చంద్రబాబు మాటలు విని ప్రభుత్వ అధికారులు తప్పులు చేసి వివాదాల్లో ఇరుక్కోవద్దు, బలిపశువులు కావద్దు. అధికారం ఏ ఒక్కరికీ శాశ్వతం కాదు. రాజ్యాంగాన్ని, వ్యవస్థలను కాపాడాల్సిన బాధ్యత అధికారులపైనే ఉంది. నేడు రెచ్చగొడుతున్న పెద్ద నాయకులు అధికారం పోయాక హైదరాబాద్‌లో దాక్కుంటారు. క్షేత్రస్థాయిలో సమస్యలను ఎదుర్కోవాల్సింది కార్యకర్తలే. పల్లెల్లో ప్రశాంత వాతావరణాన్ని కాపాడాలి’’ అని చెప్పారు.
సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది
భూమన కరుణాకర్ రెడ్డి స్పందిస్తూ.. సుప్రీంకోర్టు నేడు సంచలన తీర్పు ఇచ్చిందని, మరో 24 గంటల్లో ఎలక్షన్ కమిషన్ నివేదికను సుప్రీంకోర్టు కోరిందని చెప్పారు. ‘‘48 గంటల వరకు నామినేషన్ తుది జాబితాను ప్రకటించకూడదని కోర్టు ఉత్తర్వులు వచ్చాయి. నామినేషన్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. సుప్రీంకోర్టు తీర్పు చంద్రబాబు ప్రభుత్వానికి చెంపపెట్టు.
పోలీసుల అమరవీరుల దినోత్సవం వేళ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటు. మున్సిపల్ అభ్యర్థులు కార్పొరేటర్ల పైన వందల సంఖ్యలో దాడులు నిర్వహించారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. భయపెట్టి బెదిరించి దాడులు చేసి ఏకగ్రీం చేసుకోవాలన్న చంద్రబాబు కుయుక్తులకు సుప్రీంకోర్టు చెక్ పెట్టింది. చంద్రబాబుకు నిజంగా ఎన్నికలపై చెత్తశుద్ధి ఉంటే సజావుగా ఎన్నికలు జరిపించాలి’’ అని తెలిపారు.
సుప్రీంకోర్టు తీర్పుపై గుడివాడ అమర్నాథ్ స్పందిస్తూ.. సుప్రీంకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు అని అన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి రావాలని, పోలీసు వ్యవస్థ సక్రమంగా పనిచేయాలని చెప్పారు.
నామినేషన్లపై కూటమి ప్రభుత్వ తీరు దారుణమని మార్గాని భరత్ చెప్పారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఆదేశాలు జారీ చేయాల్సి వచ్చిందని అన్నారు. పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో ఊహించుకోవచ్చని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ఎస్‌ఈసీ అమలు చేయాలని చెప్పారు.


