‘సుప్రీం’ చెప్పినా బేఖాతరు! | Directives issued by the Supreme Court during the municipal election process in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

‘సుప్రీం’ చెప్పినా బేఖాతరు!

Oct 22 2026 4:21 AM | Updated on Oct 22 2026 4:21 AM

Directives issued by the Supreme Court during the municipal election process in Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ ఎన్నికల పర్వంలో వరసగా మూడురోజులపాటు సాగిన నామినేషన్ల ప్రహసనం గురించి బుధవారం సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు దేశ చరిత్రలో కనీవినీ ఎరుగనివి. ఒకసారంటూ ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాకఅందులో జోక్యం చేసుకోబోమని న్యాయస్థానాలు చెప్పటమే ఇన్నాళ్లూ చూశాం. కానీఆంధ్రప్రదేశ్‌లో సీఎం చంద్రబాబు కనుసన్నల్లో పోలీసులూ, టీడీపీ గూండాలూ ఉమ్మడిగా స్వైరవిహారం చేసి సాగించిన దారుణ దమనకాండను గ్రహించాక ధర్మాసనంలోని న్యాయమూర్తులు ఈ సంప్రదాయాన్ని పక్కనబెట్టక తప్పదని నిర్ణయానికొచ్చారు. 

నిరుడు పంజాబ్‌లో జరిగిన స్థానిక ఎన్నికల సందర్భంగా రెండు జిల్లాల్లోని వార్డుల్లో ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి రాగా ఇప్పుడు ఏకంగా ఏపీలోని 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల ప్రక్రియను నిలిపేయాలని, ఫిర్యాదులొచ్చిన ఇతరచోట్ల సైతం నామినేషన్ల గడువు పెంచుతూ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. చిత్రమేమంటే ఈ తీర్పు ప్రభావం కూటమి సర్కారుపై లేదా రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ)పై ఏ మాత్రం లేదు. తీర్పు వెలువరిస్తున్న సమయానికీ, ఆ తర్వాతా కూడా వివిధ మున్సిపాలిటీల్లో టీడీపీ మూకల దౌర్జన్యకాండ కొనసాగుతూనే ఉంది. ఈ మూకల అరాచకాన్ని అధిగమించి ఇంతక్రితం నామినేషన్లు వేసినవారు  బీ ఫాంలు అందజేయటానికొస్తే వాటినిచించేయటం, నెత్తురోడేలా కొట్టడం, కార్లను ధ్వంసం చేయటం షరా మామూలుగా చోటుచేసుకున్నాయి. 

తాజాగా ప్రారంభమైన జడ్‌పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ఘట్టంలో సైతం టీడీపీ హింసాకాండతో రాష్ట్రం అట్టడుకుతోంది. గూండాయిజం, దౌర్జన్యం వెరపులేకుండా సాగుతోంది. అభ్యర్థితోపాటు ప్రతిపాదకులు మాత్రమే వెళ్తే గొడవలుండవని హితవు పలికిన పోలీసులు... కుట్రపూరితంగా అంతకుముందే టీడీపీ మూకల్ని కార్యాలయాల్లో కూర్చోబెట్టారు. దగ్గరుండి మరీ దాడులు చేయించారు. అధికారుల చేతుల్లోంచి సైతం నామినేషన్‌ పత్రాలు లాక్కొనటం, అభ్యర్థుల్ని నెత్తురోడేలా కొట్టడం, వారు అపస్మారకంలోకి పోవటం చానెళ్ల సాక్షిగా కనబడింది.

చిత్తూరు మొదలుకొని వైఎస్సార్‌ కడప, అనంతపురం, రాజంపేట, ప్రకాశం, పల్నాడు, కాకినాడ తదితర జిల్లాల్లో అనేకచోట్ల గూండాల దౌర్జన్యం యధేచ్ఛగా సాగింది. శాంతియుతంగా ఉన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలపైనే పోలీసులు లాఠీచార్జి చేయటం, ఆడ పోలీసులు మహిళల దుస్తులు చించటంవంటి దుశ్శాసన పర్వం స్థానిక ఎన్నికల్లోనూ కనబడింది. నంద్యాల మున్సిపాలిటీలో ఏకంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ వార్డు అభ్యర్థి సంతకాన్ని ఫోర్జరీ చేస్తే, దాన్ని అధికారులుఆమోదించి టీడీపీ అభ్యర్థి ఏకగ్రీవంగా నెగ్గినట్టు ప్రకటించారు!

లోకంలో దుర్మార్గుల స్వభావం గురించి భర్తృహరి నీతి శతకంలోని పద్యం ‘కారణము లేని కలహంబు కరుణలేమి...’ అంటూ వరసగా ఏకరువు పెడుతుంది. కారణం లేకుండా గొడవ పెట్టుకోవడంతోపాటు ఎవరిపైనా దయ, జాలి చూపకపోవడం, మంచివారిని చూసి ఓర్వలేకపోవడం, దుర్జనులతో సాన్నిహిత్యంవంటివిఅందులో ఉన్నాయి. కానీ ఆ పద్యం చెప్పని మరో లక్షణం చంద్రబాబులో ఉంది. దుర్మార్గులు అధికార పీఠాలెక్కి పరమ పవిత్ర సాధు పుంగవుల్లా సూక్తిముక్తావళి వల్లిస్తారని మాత్రం భర్తృహరి ఊహించలేకపోయాడు. 

దేశ రాజకీయాల్లో ఇప్పుడు బాహాటంగా గజ్జెకట్టి ఆడుతున్న అనేక దుష్ట పోకడలకు చంద్రబాబు ఆద్యుడు. విద్యార్థిగా విశ్వవిద్యాలయంలో అనుసరించిన దుర్మార్గాలను సీఎంగా ఆంధ్రప్రదేశ్‌లో అమలుచేసి చూపి, ఎన్నో రాష్ట్రాల్లో మాఫియా ముఠాలకు ఆదర్శంగా నిలిచిన జాతకం ఆయనది. బహుశా ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ది ఆయన స్కూలే కావొచ్చు! తప్పనిసరై ఎన్నికలు జరపాల్సివచ్చినప్పుడల్లా ‘ఎలాగైనా’ గెలిచి తీరాలన్న యావ తప్ప బాబులో మరొకటి కనబడదు. వృత్తి నిబద్ధతకు తూట్లు పొడవటం, వినయ విధేయస్వామ్యానికి వీరతాళ్లు వేయటం చంద్రబాబుప్రవృత్తి. అవసాన దశకు చేరుకున్న బాబులో ఈ దుర్లక్షణాలు మరింత ప్రకోపించిన వైనం కనబడుతోంది. కానీ ప్రజాస్వామ్యంలో ఏ రోగానికైనా తగిన ‘చికిత్స’ ఉంటుంది. బాబుతోపాటు ఆయన వీరవిధేయులు ఎస్‌ఈసీ పునేఠ, డీజీపీ గుప్తా కూడా దీన్నిగ్రహించటం ఉత్తమం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement