స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలపై ఎస్‌ఈసీ పునేఠ ఆది నుంచి మౌనం
నామినేషన్లు స్వేచ్ఛాయుతంగా జరిగే దాఖలాలు లేవని ఏకంగా ఎన్నికల షెడ్యూల్‌లోనే జోక్యం చేసుకున్న సుప్రీం
దేశ చరిత్రలోనే ఇలాంటిది ఇదే తొలిసారి అంటున్న నిఫుణులు, అధికారులు
ఎన్నికల ప్రక్రియలో నిష్పాక్షిత కోసం ఎస్‌ఈసీకి గత నెలన్నర వ్యవధిలో 54 వినతి పత్రాలు సమర్పించిన వైఎస్సార్‌సీపీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌లో ఏకంగా సుప్రీం కోర్టు జోక్యం చేసుకునే వరకు దారి తీసిన పరిణామాలను గమనిస్తే... మునిసిపల్ ఎన్నికల నామినేషన్ల వేళ చోటు చేసుకున్న ఘటనలపై కనీస చర్యలు చేపట్టకుండా చేష్టలుడిగిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ పరువే పోయిందని రాజకీయ పరిశీలకులు, న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. రాజ్యాంగం ప్రకారం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉన్నప్పటికీ.. విపక్ష అభ్యర్థులను పలుచోట్ల పోలీసుల ద్వారా అడ్డగించి నామినేషన్లు దాఖలు చేయనివ్వకుండా అధికార పార్టీ నిరోధించింది.
ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుతున్న చంద్రబాబు సర్కారు బరి తెగింపుపై సర్వోన్నత న్యాయస్థానం కన్నెర్ర చేయడంతో అధికార యంత్రాంగం పరువు మంటగలిసిందని పేర్కొంటున్నారు. ఒకసారి ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత కోర్టులు జోక్యం చేసుకోవడం అత్యంత అరుదుగా జరుగుతుంటుందని.. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో అరాచకాలపై స్వయంగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న తీరు దేశ చరిత్రలో గతంలో ఎప్పుడూ జరగలేదని అధికార వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
మొత్తం 100 చోట్ల మున్సిపల్ ఎన్నికలు జరుగుతుండగా అభ్యర్థులు అధికారులకు అందజేసిన నామినేషన్‌లను అపహరించడం లాంటి అరాచక ఘటనల కారణంగా ఇప్పటికే ఒక చోట ఎన్నిక వాయిదా పడగా.. తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో మరో 19 చోట్ల రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్‌ను సవరిస్తూ ఆదేశాలివ్వడం దేశ ఎన్నికల చరిత్రలోనే అత్యంత అరుదైన ఘటనగా అధికార వర్గాలు అభివర్ణిస్తున్నాయి. ఇప్పటిదాకా ఏదైనా ఎన్నికల విషయంలో కోర్టులు ప్రత్యేకించి సంబంధిత అభ్యర్థులు దాఖలు చేసిన ఫిర్యాదుల విషయంలో స్పందించిన పరిస్థితి ఉందని.. కానీ రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో ఏకంగా 20 శాతం చోట్ల అభ్యర్థులు అసలు నామినేషన్లే దాఖలు చేసుకోలేని దుస్థితిపై జోక్యం చేసుకోవడం ఎప్పుడూ, ఎక్కడా ఉత్పన్నం కాలేదనే చర్చ సాగుతోంది.
హింసాత్మక ఘటనలపై ఎస్‌ఈసీ మౌనం వల్లే..
రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలైన తొలి పావు గంటలోనే వైఎస్సార్‌సీపీ లోక్‌సభా పక్ష నేత పీవీ మిధున్‌రెడ్డిపై దాడికి తెగబడటం.. ఎంపీ వాహనాల ధ్వంసం.. భద్రతా సిబ్బంది కాల్పుల ఘటనతో పాటు తొలి గంట వ్యవధిలోనే రాయచోటిలో వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై అధికార పార్టీ గూండాల దాడి.. వాహనాలకు నిఫ్పు పెట్టడం లాంటి అరాచకాలతో పచ్చమూకలు పేట్రేగినా ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న చోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్ధులు చైర్మన్ పదవులకు నామినేషన్లు దాఖలు చేయలేని పరిస్థితి కనిపిస్తున్నా ఎస్‌ఈసీ తీసుకున్న చర్యలు శూన్యం.
స్థానిక ఎన్నికల ప్రక్రియలో నిష్పాక్షిత కోసం ఎస్‌ఈసీకి వైఎస్సార్ సీపీ నేతలు గత నెలన్నర వ్యవధిలో 54 వినతి పత్రాలు సమర్పించి పారా మిలటరీ బలగాల పర్యవేక్షణలో నిర్వహించాలని కోరినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. ఇక మునిసిపల్ నామినేషన్లు మొదలైన నాటి నుంచి పచ్చమూకల దౌర్జన్యాలు, పోలీసుల ద్వారా అడ్డుకుని నామినేషన్లు కూడా దాఖలు చేయనివ్వకుండా అడ్డుకోవడంపై 41 ఫిర్యాదులు ఎస్‌ఈసీకి అందచేసినా ఎలాంటి చర్యలు తీసుకోకుండా బుట్టదాఖలు చేశారు. అధికార పార్టీ అరాచకాలను వివరిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌తో పాటు గవర్నర్‌కు మాజీ సీఎం వైఎస్ జగన్ వినతిపత్రాలిచ్చినా ఎలాంటి చర్యలు లేకపోవడంతో వైఎస్సార్‌సీపీ న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వచ్చింది.
మైదుకూరు ఎన్నిక వాయిదా.. బాధ్యులపై చర్యలేవీ?
అభ్యర్థులు అందజేసిన నామినేషన్లను ఇతరులు ఎన్నికల అధికారి కార్యాలయంలో చొరబడి ఎత్తుకెళ్లారని జిల్లా కలెక్టరు స్వయంగా నివేదిక ఇచ్చారంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ మైదుకూరు మున్సిపల్ ఎన్నికను వాయిదా వేసింది. అయితే, ఇప్పటి వరకు ఏ ఒక్క ఎన్నికల అధికారిపై గానీ, పోలీసులపైగానీ కనీస చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
నాడు ఈసీ తప్పించిన అధికారే... నేడు ఏకంగా ఎస్‌ఈసీగా
ఎన్నికలు జరిగే సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎవరైనా అధికారిని ఎన్నికలతో పాటు ఎన్నికలను ప్రభావితం చేసే విధుల నుంచి ఒకసారి తప్పిస్తే ఆ అధికారిని తర్వాత ఏ ఎన్నికల విధుల్లోనూ పాల్గొనకుండా ఈసీ నియంత్రిస్తుందన్న నిబంధన ఉంది. గతంలో మన రాష్ట్రంలో పనిచేసిన ఐఏఎస్ అధికారి ప్రవీణ్‌ప్రకాష్‌ను ఆ నిబంధనతో పలు మార్లు ఎన్నికల విధులకు దూరం పెట్టినట్లు ప్రస్తావిస్తున్నారు.
2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అనిల్ చంద్ర పునేఠ నాటి సీఎం చంద్రబాబు సూచనల మేరకు నడుచుకుంటూ, తమ ఆదేశాలు పాటించలేదనే కారణంతో కేంద్ర ఎన్నికల సంఘం పునేఠను ఎన్నికల విధుల నుంచి తప్పించింది. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అనిల్‌చంద్ర పునేఠ తిరిగి ఏ ఎన్నికల విధుల్లోనూ పాల్గొనకూడదు. అలాంటిది 2024లో చంద్రబాబు తిరిగి సీఎం కాగానే అదే అనిల్ చంద్ర పునేఠను ఎస్‌ఈసీగా నియమించడం గమనార్హం.


