లోకేశ్ కోసం రాష్ట్రాన్ని రావణకాష్టంగా మారుస్తున్నారు
ఎన్నికల్లో పోలీసుల అండతోనే టీడీపీ దాడులు, అరాచకాలు
టీడీపీ గూండాలు సర్జికల్ బ్లేడ్లతో స్వైరవిహారం చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు
సుప్రీంకోర్టు ఆదేశాలతోనైనా పోలీసులు బుద్ధి తెచ్చుకోవాలి
అధికార పార్టీకి ఒక న్యాయం, ప్రతిపక్షానికి మరో న్యాయం అనే పద్ధతిని విడనాడాలి
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఐపీఎస్, డీఎస్పీ స్థాయి అధికారులు కొందరు రౌడీలుగా మారిపోయి, ఎన్నికల్లో అక్రమ సంపాదన కోసం వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి చెప్పారు. లోకేశ్ శునకానందం కోసం, ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం చంద్రబాబు ఈ రాష్ట్రాన్ని రావణకాష్టంగా మారుస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో టీడీపీ అక్రమాలను ప్రోత్సహిస్తున్న డీఎస్పీలకు ఒక్కొక్కరికీ రోజుకు రూ.60 లక్షలు, డీఐజీలకు కోట్లాది రూపాయలు ముడుపులు అందుతున్నాయని, కావాలంటే దీనిపై ఎవరైనా విచారణ చేసుకోవచ్చని అన్నారు.
ఎన్నికలను స్వేచ్ఛగా నిర్వహించాల్సిన పోలీసులే అధికార పార్టీతో కుమ్మక్కై, కిందిస్థాయి సిబ్బందికి కూడా డబ్బులు పంచుతూ రూ.కోట్లు దండుకుంటున్నారని మండిపడ్డారు. నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసుల సమక్షంలోనే తమ అభ్యర్థులపై దాడులు జరుగుతున్నా, నామినేషన్ పత్రాలు చించేస్తున్నా పట్టించుకోకుండా టీడీపీకి సహకరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో టీడీపీ గూండాలు కట్టెలకు సర్జికల్ బ్లేడ్లు కట్టుకుని రోడ్లపై స్వైరవిహారం చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. కడపలో టీడీపీ అభ్యర్థుల నుంచి రూ. 40 కోట్లు వసూలు చేసి, అందులో సింహభాగాన్ని ఈ పోలీసు అధికారులకే పంచుతున్నారని ఆరోపించారు. డీఎస్పీ స్థాయి అధికారులు ఈ ఎన్నికల ద్వారానే ఏకంగా రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు సంపాదిస్తున్నారని టీడీపీ నాయకులే తనతో చెబుతున్నారని తెలిపారు. అదనపు డీజీ స్థాయిలో ఉన్న ఓ అధికారి డీజీపీ పదవి కోసం టీడీపీ గూండాలు ఏం చేసినా చూస్తూ ఉండాలని ఆదేశాలు ఇచ్చారని తెలిపారు.
దాడులపై ఆధారాలున్నా పోలీసుల చర్యలు శూన్యం
‘మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామిపై జరిగిన దాడితో పాటు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో టీడీపీ గూండాలు చేస్తున్న దాడులు, ఆస్తుల ధ్వంసంపై ఆధారాలు ఉన్నా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఎన్నికల ప్రక్రియలో అడ్డంకులు సృష్టించిన వారిపై ఎన్ని కేసులు పెట్టారు? బాధ్యులైన వారిలో ఒక్కరినైనా అరెస్టు చేశారా? పైగా, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై మాత్రం సెక్షన్ 144 పేరుతో ఆంక్షలు విధిస్తున్నారు. అక్రమంగా కేసులు పెడుతున్నారు. వీటన్నింటికీ చంద్రబాబు ప్రభుత్వం, పోలీసు అధికారులు సమాధానం చెప్పాలి. అభ్యర్థులకు రక్షణ కల్పించి, ఎన్నికలను కేంద్ర బలగాల పర్యవేక్షణలో నిష్పక్షపాతంగా నిర్వహించాలి’ అని చెప్పారు.
ఇదేనా సీఎం చేయాల్సిన పని?
‘ఎన్నికలను స్వేచ్ఛగా నిర్వహించాల్సిన ప్రభుత్వమే వాటిని ఒక ఫార్స్‌గా మార్చడం సిగ్గుచేటు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిజాయితీగా నిర్వహించలేనప్పుడు చంద్రబాబు నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చినట్లు? పరువు, మర్యాదలతో బతికే వారు, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి రావాలనుకునే వారు ఈ దౌర్జన్యాలను చూసి బెంబేలెత్తిపోతున్నారు. చంద్రబాబుకు నిజంగా దమ్ముంటే వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అడ్డుకోవడం మానేసి, ఆయనే దగ్గరుండి నామినేషన్లు వేయించాలి. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేక పోలీసులను, అధికారులను అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష అభ్యర్థులను అడ్డుకోవడం ఎందుకు? ఎవరిని ఎన్నుకోవాలో నిర్ణయించుకునే ప్రజల హక్కును కూడా కాలరాస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి వ్యవహరించాల్సిన తీరు ఇదేనా?’ అని ధ్వజమెత్తారు.
దౌర్జన్యాలకు పాల్పడేవారిపై చర్యలు తీసుకోవాలి
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పునేఠా సుప్రీం కోర్టు ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలి. ప్రతి అభ్యర్థీ స్వేచ్ఛగా నామినేషన్ వేసేలా భద్రత కల్పించాలి. దాడులు, బెదిరింపులు, ఆస్తుల ధ్వంసంపై నమోదైన ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలి. ఒత్తిళ్లకు తలొగ్గకుండా ఎన్నికల సంఘం తన రాజ్యాంగబద్ధ బాధ్యతను నిర్వర్తించాలి. సుప్రీం కోర్టు ఆదేశాలతోనైనా పోలీసులు, అధికారులు బుద్ధి తెచ్చుకోవాలి. చట్టబద్ధంగా వ్యవహరించాలి. అధికార పార్టీకి ఒక న్యాయం, ప్రతిపక్షానికి మరో న్యాయం అనే పద్ధతిని విడనాడాలి. ‘ప్రజలు గెలవాలి.. ప్రజాస్వామ్యం గెలవాలి’ అనే లక్ష్యంతో మా పోరాటం కొనసాగుతుంది’ అని చెప్పారు.
జగన్ ప్రజాదరణను తగ్గించి చూపే కుట్రలు..
వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ఉన్న ప్రజాదరణను తగ్గించి చూపేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. తన ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు జగన్‌పై నిందలు వేస్తున్నారు. వైఎస్ జగన్ లక్ష్యంగా ఎల్లో మీడియా చౌకబారు రాతలు రాస్తోంది. ఎన్ని కుట్రలు చేసినా ప్రజల గుండెల్లో వైఎస్ జగనే అసలు సిసలు హీరో’ అని చెప్పారు.


