ప్రకాశం జిల్లా పీసీపల్లిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలు లాక్కుంటున్న టీడీపీ గూండాలు, రాత్రి 7 గంటలకు నామినేషన్ ఉపసంహరించుకుని బయటకు వస్తున్న 25వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కుంచాల కరుణకుమారి
మున్సిపాలిటీలను ఏకగ్రీవం చేసుకునేందుకు ఎల్లో గ్యాంగ్ బెదిరింపులు
బీ ఫారాల చించివేత.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల సంతకాలు పోర్జరీ
చిత్తూరు కార్పొరేషన్‌లో 60 డివిజన్లకు గానూ 51 చోట్ల టీడీపీ, 8 చోట్ల జనసేన పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవం అని ప్రకటన
వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ బరితెగించి తీర్పు
పోలీసులను అడ్డుపెట్టుకుని రాక్షస మూక విధ్వంసం
సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్ : రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టంలోనూ ఎల్లో గ్యాంగ్ అరాచకం సృష్టిస్తోంది. పచ్చమూకలు పేట్రేగిపోయి తీవ్ర బెదిరింపులకు దిగాయి. ‘నామినేషన్‌ను ఉపసంహరించుకుంటే బావుంటుంది. లేదంటే ఏమవుతుందో తెలీదు. మర్యాదగా విత్ డ్రా చేస్తావా.. లేదా.. లేదంటే చంపేస్తాం’ అంటూ హెచ్చరించారు. ఇందుకు పలుచోట్ల పోలీసులు సైతం వంత పాడారు. ఎన్నో ఇక్కట్ల మధ్య నామినేషన్ వేసిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్‌లను స్క్రూటినీలో తీసివేసేందుకు ఎత్తులు వేశారు. అయినా పోటీలో నిలబడిన వారిని ఎలాగైనా తప్పించేందుకు బుధవారం రాష్ట్రంలోని పలు చోట్ల పచ్చ రౌడీలు బరితెగించారు.
పలు చోట్ల బెదిరింపులకు దిగి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులతో నామినేషన్ ఉపసంహరణ ఫారాలపై సంతకాలు చేయించారు. మరికొన్ని చోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల సంతకాలను ఫోర్జరీ చేశారు. ఇంకొన్ని చోట్ల వైఎస్సార్‌సీపీ బీ–ఫారాలను చించేశారు. చిత్తూరు కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 57 మంది వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల బీ ఫారాలు ఇచ్చేందుకు వెళ్లడంతో వాటిని పచ్చ రౌడీలు లాగేసుకుని చించేశారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్‌కు వైఎస్సార్‌సీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో బీ–ఫారాలు మళ్లీ ఇవ్వాలని సలహా ఇచ్చారు.
అడుగడుగునా అరాచకం
» చిత్తూరు కార్పొరేషన్‌లో 60 డివిజన్లకు గానూ 51 చోట్ల టీడీపీ, 8 చోట్ల జనసేన పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారులు డిక్లరేషన్ ఇచ్చారు. పోటీలో ఉన్న ఏ ఒక్క అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకోకపోయినా, వాళ్ల పేరిట దొంగ సంతకాలు పెట్టి మరీ ఫారాలు ఇవ్వడం విస్తుగొలుపుతోంది.
» నంద్యాల మున్సిపాలిటీలో 51వ వార్డుకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీలో నిలిచిన అవ్వారి నాగమణి సంతకాన్ని ఫోర్జరీ చేసిన పచ్చగ్యాంగ్ తమ పార్టీ అభ్యర్థి ఏకగ్రీవం అయ్యేలా అడ్డగోలుగా వ్యవహరించారు. తిరుపతి వైఎస్సార్‌సీపీ 63వ డివిజన్ అభ్యర్థి జమున భర్త కేశవులును బెదిరించారు. జమున సంతకాన్ని ఫోర్జరీ చేసి నామినేషన్ ఉపసంహరణ చేసినట్లు చూపడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అద్దంకి మున్సిపల్ ఎన్నికలు, నామినేషన్ల ఉపసంహరణలో అక్రమాలు జరగడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త డాక్టర్ అశోక్‌కుమార్ చింతలపూడి ఆందోళన చేశారు.
» అమలాపురం 25వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని పోలీసులు, టీడీపీ నాయకులు కలిసి బెదిరించి నామినేషన్ ఉపసంహరింపజేయడంపై వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పినిపే శ్రీకాంత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో నామినేషన్ల ఉపసంహరణ సందర్భంగా పచ్చ మూక చెలరేగిపోయి వైఎస్సార్‌సీపీ శ్రేణులపై రాళ్ల దాడికి పాల్పడింది. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికల్లో ఎనిమిది మంది వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అధికార పార్టీ నేతలు బెదిరించి నామినేషన్లు ఉపసంహరించేలా చేశారు.
» శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలో 10, 24 వార్డుల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు కోర్సిపాటి ప్రవీణ, బడుగు శ్రీనివాసుల ఫోర్జరీ సంతకాలతో టీడీపీ గూండాలు వారి నామినేషన్లు విత్ డ్రా చేయించారు. ఈ విషయం తెలుసుకుని పార్టీ నాయకులతో కలిసి మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న వారు తమ నామినేషన్లను విత్‌డ్రా చేసుకోలేదని చెప్పారు. విత్ డ్రాయిల్ ఫారాలు ఎవరు అందజేశారో సీసీ కెమెరాల వీడియో ఫుటేజీ చూడాలని కోరినా ఎన్నికల అధికారులు పట్టించుకోలేదు. కలెక్టర్‌ను సంప్రదించాలన్నారు.
» పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో 8 మంది వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ల అభ్యర్థులకు సంబంధించి బీ–ఫారాలను తీసుకోకుండా అధికారులు కాలయాపన చేశారు. తుదకు సాయంత్రం వెళ్లగా సమయం మించిపోయిందని చెప్పారు. వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి అప్పుడు అక్కడికి రాగా, ఆయనపై టీడీపీ మూకలు దాడి చేశాయి.
» పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మధ్యాహ్నం 3గంటలకు ముగియాల్సిన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ అర్ధరాత్రి వరకు కొనసాగింది. వైఎస్సార్‌సీపీకి చెందిన నలుగురు అభ్యర్థులను భయపెట్టి నామినేషన్లు ఉపసంహరింపచేశారు. 18వ వార్డు అభ్యర్ధి బండి రాణిని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లారు.
» ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో 36 వార్డులు ఉండగా.. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ల అభ్యర్థులను భయపెట్టి 12 మందితో విత్‌డ్రా చేయించారు. దీంతో పది మంది తెలుగుదేశం, ఇద్దరు జనసేన కౌన్సిలర్లు ఏకగ్రీవం అయ్యారు. మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి కూడా ఉపసంహరించుకునేలా చేయడానికి తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. అయితే అమె గట్టిగా నిలబడటంతో వారి పాచికలు పారలేదు.
» తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని 66 వార్డుల్లో నామినేషన్లు దాఖలు చేయడానికి వెళ్లిన వైఎస్సార్‌సీపి కార్పొరేటర్లను టీడీపీ గూండాలు కర్రలు, రాళ్లతో దాడులకు తెగబడ్డారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు వారి దాడులకు ఎదురొడ్డి నిలబడి మేయర్ అభ్యర్థి వాసుయాదవ్‌తో పాటు 48వార్డులకు నామినేషన్లు దాఖలు చేశారు.
» అమలాపురం మున్సిపల్ కార్యాలయంలో 25వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కురసాల భద్రాజీని టీడీపీ నేతలు బెదిరించి నామినేషన్ ఉపసంహరింపచేశారు.


