ఈ సర్టిఫికెట్లులేని కారణంగా నామినేషన్లు తిరస్కరించవద్దు
అధికారులకు ఎన్నికల కమిషనర్ ఆదేశాలు
ఇప్పుడు తాపీగా ఈ ఆదేశాలు ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు
సాక్షి, అమరావతి: అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసే సమయంలో తప్పనిసరిగా ‘నో అబ్జెక్షన్, నో డ్యూస్ సర్టిఫికెట్లు’ సమర్పించాలనే నిబంధన ఎన్నికల నియమావళిలో లేదని తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ సర్టిఫికెట్లు లేవన్న కారణంగా నామినేషన్లు తిరస్కరించరాదని స్పష్టంచేసింది. నామినేషన్ పత్రాలతో పాటు ‘కేసులకు సంబంధిత పోలీస్‌స్టేషన్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్’, అలాగే ఏదైనా ప్రభుత్వ శాఖ నుంచి ‘బకాయిల్లేవని తెలిపే నో డ్యూస్ సర్టిఫికెట్’ సమర్పించలేదనే కారణంతో నామినేషన్‌ను తిరస్కరించకూడదని స్పష్టంచేసింది.
ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, జెడ్పీ సీఈవోలు, డీపీవోలతో పాటు ఆయా ఎన్నికలాధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్రపునేఠ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా అదనపు నిబంధనలు విధించకుండా, అర్హులైన అభ్యర్థులు నిబంధనల ప్రకారం నామినేషన్లు దాఖలుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
కాగా, మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా ఈ సర్టిఫికెట్ల కోసం అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కీలక ప్రక్రియ ముగిసిన తర్వాత ఇప్పుడు తాపీగా ఎన్నికల కమిషనర్ నుంచి ఈ ప్రకటన ఏమిటంటూ సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఆలస్యంగా జారీ చేసిన ఈ ఆదేశాల పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపల్ ఎన్నికలకు దాఖలైన మొత్తం నామినేషన్లలో వివిధ రకాల కారణాలతో దాదాపు 1,665 నామినేషన్ల తిరస్కరణకు గురికావడం గమనార్హం.


