భారత్‌ క్లీన్‌ స్వీప్‌ | Zimbabwe lost to India by 92 runs in the final T20 | Sakshi
Sakshi News home page

భారత్‌ క్లీన్‌ స్వీప్‌

Oct 22 2026 4:36 AM | Updated on Oct 22 2026 4:36 AM

Zimbabwe lost to India by 92 runs in the final T20

ఆఖరి టి20లో టీమిండియా జయభేరి

92 పరుగుల తేడాతో ఓడిన జింబాబ్వే

3–0తో సిరీస్‌ భారత్‌ వశం

హర్మన్‌ప్రీత్, షఫాలీ విజృంభణ  

రాయ్‌పూర్‌: సొంతగడ్డపై సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన భారత మహిళల టి20 క్రికెట్‌ జట్టు జింబాబ్వేతో సిరీస్‌ను 3–0తో  ‘క్లీన్‌ స్వీప్‌’ చేసింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి సిరీస్‌ ఖాతాలో వేసుకున్న స్మృతి మంధాన సారథ్యంలోని భారత జట్టు... మంగళవారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో 92 పరుగుల తేడాతో విజయం సాధించింది. పూర్తి స్థాయి కెప్టెన్‌గా స్మృతి భాధ్యతలు అందుకున్న తర్వాత ఇది తొలి సిరీస్‌ గెలుపు. టాస్‌ నెగ్గి మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియా... నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. 

మాజీ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (41 బంతుల్లో 91 నాటౌట్‌; 10 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగగా... ఓపెనర్‌ షఫాలీ వర్మ (37 బంతుల్లో 69; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపులు మెరిపించింది. మూడు ఫార్మాట్‌లలో సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత హర్మన్‌ స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేసింది. మైదానం నలువైపులా షాట్‌లు బాదుతూ... ఫోర్లు, సిక్స్‌లతో హోరెత్తించింది. జింబాబ్వే బౌలర్లలో బిజాకు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం భారీ లక్ష్యఛేదనలో జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 124 పరుగులు చేసింది. 

మాయెర్స్‌ (49 బంతుల్లో 60; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు). బిజా (50 బంతుల్లో 44; 5 ఫోర్లు) పోరాడినా ఫలితం లేకపోయింది. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు 82 పరుగులు జోడించారు. ఈ జంట మినహా తక్కినవాళ్లంతా సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో నందని శర్మ 4 ఓవర్లలో 18 పరుగులేఇచ్చి 3 వికెట్లు పడగొట్టింది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, షఫాలీ వర్మకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డులు దక్కాయి. ఇరు జట్ల మధ్య శుక్రవారం వడోదరా వేదికగా తొలి వన్డే మ్యాచ్‌ జరగనుంది.

రోజుకు ఐదు గంటల ప్రాక్టీస్‌ 
చాలా బాగుంది. ఆటను ఆస్వాదించాలనుకున్నాను. మైదానంలో కొంత సమయం గడపాలనుకున్నా. వీలైనంత ఎక్కువసేపు క్రీజులో ఉండాలని ముందే అనుకున్నా. కెప్టెన్‌ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత ఎలాంటి ఒత్తిడి లేదు. ఇప్పుడు పూర్తి స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేయడంపైనే నా దృష్టి. మున్ముందు కూడా అదే చేస్తా. ఆసియా క్రీడల తర్వాత నెట్స్‌లో విపరీతంగా శ్రమించా. బ్యాటింగ్‌ కోచ్‌ హిమాన్షుతో కలిసి గంటలకొద్ది ప్రాక్టీస్‌ చేశా. దాని ఫలితం ఇప్పుడు కనిపించింది. ప్రతీ రోజు ఐదు గంటలకు తగ్గకుండా నెట్స్‌లో సాధన చేశా. అది మ్యాచ్‌లో ఎంతగానో ఉపయోగపడింది. ఇప్పుడు ఫిట్‌నెస్‌పై మరింత దృష్టి పెట్టి నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నా.  –హర్మన్‌ప్రీత్‌ కౌర్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement