శ్రేయస్‌ బృందానికి సవాల్‌ | Indias first T20 against New Zealand today | Sakshi
Sakshi News home page

శ్రేయస్‌ బృందానికి సవాల్‌

Oct 22 2026 4:40 AM | Updated on Oct 22 2026 4:40 AM

Indias first T20 against New Zealand today

న్యూజిలాండ్‌తో నేడు తొలి టి20

జోరు మీదున్న ఆతిథ్య జట్టు

మధ్యాహ్నం గం. 12:30 నుంచి సోనీ స్పోర్ట్స్‌ చానెల్స్, సోనీ లివ్‌ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం  

క్రైస్ట్‌చర్చ్‌: సొంతగడ్డపై వెస్టిండీస్‌తో టి20 సిరీస్‌లో హోరాహోరీగా తలపడిన భారత జట్టు వారం రోజుల వ్యవధిలో మరో ప్రత్యర్థితో, పూర్తిగా భిన్నమైన వాతావరణంలో కొత్త పోరుకు సిద్ధమైంది. అయితే ఈ సారి జట్టుకు న్యూజిలాండ్‌ రూపంలో బలమైన ప్రత్యర్థి ఎదురుగా నిలిచింది. టీమిండియాలో నలుగురు ఆటగాళ్లకు మాత్రమే గతంలో కివీస్‌ గడ్డపై ఆడిన అనుభవం ఉండగా... చాలా రోజుల తర్వాత కివీస్‌ టీమ్‌ పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు జరిగే తొలి పోరులో ఇరు జట్లు తలపడనున్నాయి.  

నితీశ్‌ రెడ్డికి చోటు... 
విండీస్‌తో ఆడిన సిరీస్‌తో పోలిస్తే తుది జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. అయితే ఒక స్పిన్నర్‌కు బదులుగా పరిస్థితులను బట్టి అదనపు పేసర్‌ను ఆడించాలని భారత్‌ భావిస్తోంది. కాబట్టి ప్రిన్స్‌ యాదవ్‌ లేదా వరుణ్‌ చక్రవర్తిలలో ఒకరికే అవకాశం దక్కుతుంది. మరోవైపు నమన్‌ ధీర్‌ స్థానంలో ఆంధ్ర ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డికు చాన్స్‌ లభించవచ్చు. ఓపెనర్లుగా సామ్సన్, అభిషేక్‌ శర్మ ఖాయం కాబట్టి వైభవ్‌ మరికొంత కాలం ఎదురు చూడక తప్పదు. కెప్టెన్‌ అయ్యర్‌ కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. 

ఇషాన్‌ కిషన్, అయ్యర్, తిలక్, దూబేలతో జట్టు బ్యాటింగ్‌ బలంగా ఉంది. నితీశ్‌ కుమార్‌ బ్యాటింగ్‌లో కూడా ప్రభావం చూపిస్తే భారీ స్కోరు సాధించవచ్చు. అయితే భారత్‌కు ఒకే ఒక అంశం కాస్త ప్రతికూలంగా కనిపిస్తోంది. విండీస్‌తో సిరీస్‌ శనివారం ముగియగా, ఆదివారం ఉదయమే భారత్‌ నుంచి బయల్దేరి సుదీర్ఘ ప్రయాణం చేసిన తర్వాత ఆటగాళ్లకు తగినంత విశ్రాంతి దక్కలేదు. పైగా భిన్నమైన వాతావరణానికి అలవాటు పడేలా తగినంత ప్రాక్టీస్‌ కూడా చేయలేదు. దీనిని అధిగమిస్తే భారత్‌ పైచేయి సాధించగలదు.  

పూర్తి స్థాయి జట్టుతో... 
కివీస్‌ చివరిసారిగా భారత్‌తో టి20 ప్రపంచకప్‌ ఫైనల్లో తలపడి ఓడిపోయింది. ఇప్పుడు స్వదేశంలో ఐదు మ్యాచ్‌ల పోరులో సత్తా చాటాలని టీమ్‌ పట్టుదలగా ఉంది. న్యూజిలాండ్‌కు సొంతంగా టి20 లీగ్‌ లేకపోవడంతో ఆ దేశపు ఆటగాళ్లు ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు లీగ్‌లలో ఆడుతున్నారు. దాంతో ప్రతీ సిరీస్‌కు పలువురు ప్లేయర్లు దూరమవుతూ వచ్చారు. చాలా కాలం తర్వాత ఇప్పుడు పూర్తి స్థాయి జట్టు అందుబాటులో ఉంది. దాంతో కొత్త ఉత్సాహంతో కివీస్‌ బరిలోకి దిగుతోంది. పదునైన నలుగురు పేసర్లతో పాటు ముగ్గురు స్పిన్నర్లు జట్టులో కీలక పాత్ర పోషించగలరు. అలెన్, సీఫెర్ట్‌లాంటి విధ్వంసక ఓపెనర్లు సొంత అభిమానులను తమ బ్యాటింగ్‌తో అలరించేందుకు సిద్ధమయ్యారు. కాన్వే, ఫిలిప్స్, మిచెల్‌లతో మిడిలార్డర్‌ కూడా పటిష్టంగా ఉంది.

పిచ్, వాతావరణం 
కొత్తగా వేసిన రెడీమేడ్‌ పిచ్‌లు, చలి వాతావారణం (మ్యాచ్‌ స్థానిక సమయం రాత్రి 8 గంటలకు)లో స్వింగ్‌ బౌలింగ్‌ భారత్‌కు సవాల్‌ విసరనున్నాయి. మంచు ప్రభావం మ్యాచ్‌ అంతా ఉండవచ్చు. న్యూజిలాండ్‌లో జరిగిన గత 8 అంతర్జాతీయ టి20ల్లో ఒక్కసారి కూడా స్కోరు 200 దాటలేదు. ఇప్పుడు కూడా భారీ స్కోర్లకు అవకాశం తక్కువ.

తుది జట్లు (అంచనా) 
భారత్‌: శ్రేయస్‌ (కెప్టెన్‌), సామ్సన్, అభిషేక్, ఇషాన్‌ కిషన్, తిలక్‌ వర్మ, శివమ్‌ దూబే, నితీశ్‌ రెడ్డి, అక్షర్‌ పటేల్, భువనేశ్వర్, అర్ష్ దీప్, వరుణ్‌. 
న్యూజిలాండ్‌: సాంట్నర్‌ (కెప్టెన్‌), అలెన్, సీఫెర్ట్, కాన్వే, ఫిలిప్స్, మిచెల్, బ్రేస్‌వెల్, నాథన్‌ స్మిత్, జేమీసన్, హెన్రీ, ఫెర్గూసన్‌.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement