మేమున్నాం.. ధైర్యంగా నామినేషన్లు వేయండి | MP Mithun Reddy and former minister Peddireddi reassure YSRCP ranks regarding nominations | Sakshi
Sakshi News home page

మేమున్నాం.. ధైర్యంగా నామినేషన్లు వేయండి

Oct 22 2026 6:19 AM | Updated on Oct 22 2026 6:19 AM

MP Mithun Reddy and former minister Peddireddi reassure YSRCP ranks regarding nominations

వైఎస్సార్‌సీపీ శ్రేణులకు ఎంపీ మిథున్‌రెడ్డి, మాజీమంత్రి పెద్దిరెడ్డి భరోసా

చౌడేపల్లె: ఎదుటివారి భయాన్ని పెట్టుబడిగా చేసుకుని కూటమి నేతలు రాజకీయం చేయాలని చూస్తున్నారని వైఎస్సార్‌సీపీ లోక్‌సభాపక్ష నేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, మాజీమంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. భయపడితే ఇక్కడ రాజకీయం చేయలేమని చెప్పారు. అన్నమయ్య జిల్లా చౌడేపల్లెలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలతో మంగళవారం నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో వారు మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎంపీ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ క్లిష్ట పరిస్థితుల్లో పార్టీకోసం నిలబడిన ప్రతి ఒక్కరిని భవిష్యత్తులో భుజాలపై మోసుకుని కాపాడుకుంటానని భరోసానిచ్చారు. 

‘మనమేమీ మర్డర్లు, మానభంగాలు చేయలేదు, భయపడకండి. కేసులు పెడతారు, అంతేగా. నేను ఉన్నాను., ఎవరికి ఏం జరిగినా పూర్తి బాధ్యత నాదే..’ అని న్యాయబద్ధంగా నామినేషన్లు వేయాలని కోరారు. ఇటీవల మున్సిపల్‌ ఎన్నికల్లో తానే స్వయంగా ముందుండి తల ఎత్తుకుని వెళ్లి నామినేషన్‌ వేశానని గుర్తుచేశారు. కార్యకర్తలంతా అదే ధైర్యంతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయి అరాచకాలపై ఇప్పటికే దాదాపు 20 మంది టీడీపీ ముఖ్యనేతలే తనతో ఫోన్‌లో ఆవేదన వ్యక్తం చేశారని చెప్పారు. బయటి ఊరి వాళ్లను తెచ్చి ఇక్కడ రెచ్చగొడుతున్నారని, రేపు అధికారం పోతే వారు రాష్ట్రం విడిచి పారిపోతారని ఆయన పేర్కొన్నారు. 

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ తాము పుంగనూరుకు ప్రాతినిధ్యం వహించినప్పటి నుంచి చౌడేపల్లె మండలం వైఎస్సార్‌సీపీకి పటిష్టమైన ఆదరణ అందించిందని చెప్పారు. గతం నుంచి ఇప్పటివరకు ఇక్కడ మనదే ఆధిపత్యమని గుర్తుచేశారు. ఈ పిల్ల రౌడీల చేష్టలకు ఎవరూ వెనకడుగు వేయాల్సిన అవసరం లేదని, మనకున్నంత కేడర్‌ బలం మరే పార్టీకి లేదని చెప్పారు. ప్రతి పంచాయతీ నుంచి కనీసం వందమందితో కలిసి ధైర్యంగా వెళ్లి నామినేషన్లు వేయాలని, అభ్యర్థులను గెలిపించుకునే పూర్తి బాధ్యత తాము తీసుకుంటామని కార్యకర్తల్లో ధైర్యం నింపారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు దామోదరరాజు, రుక్మిణమ్మ, నేతలు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.  

సుప్రీంకోర్టు ఆదేశాలను అమలుచేసి అభ్యర్థులకు నామినేషన్ల స్వేచ్ఛ కల్పించాలి : ఎంపీ మిథున్‌రెడ్డి  
మదనపల్లె (కురబలకోట): స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్ష అభ్యర్థులను అడ్డుకున్నచోట పటిష్ట భద్రతతో కలెక్టర్ల సమక్షంలో నామినేషన్లు స్వీకరించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు చంద్రబాబు ప్రభుత్వానికి చెంపపెట్టు అని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో బుధవారం మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాలను వెంటనే అమలు చేసి, ప్రతి అభ్యర్థికి భయం లేకుండా నామినేషన్‌ వేసే స్వేచ్ఛ కల్పించాలని డిమాండ్‌ చేశారు. 

ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలు విని, రాజకీయ ఒత్తిళ్లకు లొంగి చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడి వివాదాల్లో చిక్కుకోవద్దని అధికారులకు సూచించారు. అధికారం శాశ్వతం కాదని, రాజ్యాంగాన్ని కాపాడటం అధికారుల బాధ్యత అని గుర్తుచేశారు. ఇప్పుడు కార్యకర్తలను రెచ్చగొడుతున్న పెద్ద నాయకులు అధికారం కోల్పోయాక నగరాలకే పరిమితమవుతారని, ఆ తర్వాత క్షేత్రస్థాయిలో కేసులు, ఘర్షణలు ఎదుర్కోవాల్సింది స్థానిక కార్యకర్తలేనని చెప్పారు. నాయకుల మాటలు విని భవిష్యత్తును పాడుచేసుకోవద్దని సూచించారు. సమావేశంలో తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌రెడ్డి కూడా పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement