అతడి కోసం త్యాగం చేశాడు.. భయ్యా గొప్పోడు: అభిషేక్‌ | Abhishek Reveals Sanju Sacrifice Behind Vaibhav Sooryavanshi Promotion | Sakshi
Sakshi News home page

అతడి కోసం త్యాగం చేశాడు.. సంజూ భయ్యా గొప్పోడు: అభిషేక్‌

Oct 28 2026 1:34 PM | Updated on Oct 28 2026 2:15 PM

Abhishek Reveals Sanju Sacrifice Behind Vaibhav Sooryavanshi Promotion

సంజూతో అభిషేక్‌ (PC: BCCI X)

న్యూజిలాండ్‌తో మూడో టీ20లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు భారత ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ. తన విధ్వంసకర ఆట తీరుతో కివీస్‌ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. కేవలం 35 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఆకాశమే హద్దుగా ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు.

నల్లేరు మీద నడకే
కేవలం 38 బంతుల్లోనే తొమ్మిది ఫోర్లు, పదకొండు సిక్సర్ల సాయంతో అభిషేక్‌ శర్మ 113 పరుగులు సాధించడు. అతడికి తోడుగా మరో ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీ (19 బంతుల్లో 45) ధనాధన్‌ దంచికొట్టడంతో భారత్‌ గెలుపు నల్లేరు మీద నడకే అయింది.

వైభవ్‌ కోసం.. సంజూ త్యాగం
అయితే, రెగ్యులర్‌ సీనియర్‌ ఓపెనర్‌ సంజూ శాంసన్‌ మూడో టీ20లో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. గత మ్యాచ్‌లో మూడో స్థానంలో వచ్చి విఫలమైన.. వైభవ్‌ సూర్యవంశీ కోసం ఈసారి తన ఓపెనింగ్‌ స్థానాన్ని త్యాగం చేశాడు. ఈ క్రమంలో అభిషేక్‌కు జోడీగా వచ్చిన వైభవ్‌ అదరగొట్టగా.. సంజూ 13 బంతుల్లో కేవలం 18 పరుగులే చేయగలిగాడు.

ఈ నేపథ్యంలో అభిషేక్‌ శర్మ సంజూ శాంసన్‌పై ప్రశంసలు కురిపించాడు. జట్టు ప్రయోజనాల కోసం, వైభవ్‌ కోసం సంజూ తన ఓపెనింగ్‌ స్థానాన్ని త్యాగం చేయడం గొప్ప విషయమని కొనియాడాడు. న్యూజిలాండ్‌తో మంగళవారం నాటి మూడో టీ20లో విజయానంతరం మాట్లాడుతూ..

సంజూ భయ్యా గొప్పోడు
‘‘ఈరోజు నేను, వైభవ్‌ ఓపెనింగ్‌ చేశాము. నిజానికి సంజూ భాయ్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాల్సింది. అయితే, తన స్థానాన్ని త్యాగం చేశాడు. జట్టులోని ప్రతి ఒక్కరిలోనూ ఇలాంటి నిస్వార్థ గుణం ఉంది.

సంజూ భాయ్‌ గత రెండు మ్యాచ్‌లలో ఆడాడు. అయినా సరే జట్టు ప్రయోజనాల కోసం వన్‌డౌన్‌లో వచ్చాడు. సంజూ భాయ్‌ వ్యక్తిత్వం కూడా గొప్పదే. అందరు ఆటగాళ్లు భాయ్‌లాగే ఆలోచిస్తారు కూడా! జట్టు కోసం ఏ స్థానంలోనైనా ఆడతారు’’ అని అభిషేక్‌ శర్మ సంజూపై ప్రశంసల వర్షం కురిపించాడు.

కాగా గతంలోనూ.. అభిషేక్‌ సంజూను కొనియాడిన సంగతి తెలిసిందే. అందరు ఆటగాళ్ల గురించి సంజూ ఆలోచిస్తాడని.. సహచర ఆటగాళ్లకు ఎల్లవేళలా మద్దతుగా ఉంటాడని ప్రశంసించాడు. 

ఇక కివీస్‌తో తొలి టీ20లో 33 బంతుల్లోనే 67 పరుగులు చేసి సంజూ జట్టును గెలిపించి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు. అయితే, రెండో టీ20లో మాత్రం 14 పరుగులే చేయగలిగాడు. మూడో టీ20లో వన్‌డౌన్‌లో వచ్చి స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు.

చదవండి: పెరట్లో ఆడినట్లుంది.. నా వల్ల కాదు! హ్యాట్సాఫ్‌ సంజూ: యువీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement