PC: HCA
లక్డీకాపూల్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అపెక్స్ కౌన్సిల్ పదవీకాలం ఈ నెల 21తో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త కార్యవర్గం ఎన్నిక కోసం వెంటనే ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం) నిర్వహించాలని పలువురు సభ్యులు డిమాండ్ చేశారు.
మాజీ క్రికెటర్లు శివలాల్ యాదవ్, అర్షద్ అయూబ్ నేతృత్వంలో సమావేశమైన వీరు... సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా ఎన్నికలు జరపాలని ఏకసభ్య కమిటీ చైర్మన్, రిటైర్డ్ జస్టిస్ నవీన్ రావుకు వినతి పత్రం సమర్పించారు. అసోసియేషన్ నిబంధనల్లో అవసరమైన మార్పులు చేసిన అనంతరం ఏజీఎం నిర్వహించాలని వారు కోరారు.
అదే విధంగా.. సంస్థకు సంబంధించిన ఆడిట్‌ను సక్రమంగా నిర్వహించడంతో పాటు అసోసియేషన్ కార్యకలాపాలు నిరంతరాయంగా కొనసాగేందుకు తక్షణమే ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం జరిగిన మీడియా సమావేశంలో పురుషోత్తం అగర్వాల్, వంకా ప్రతాప్, జాన్ మనోజ్ తదితరులు పాల్గొన్నారు.


