రంజీ ట్రోఫీ-2027 ఎలైట్ గ్రూప్-డిలో ముంబై జట్టు తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. శరద్ పవార్ క్రికెట్ అకాడమీ వేదికగా హర్యానాతో జరిగిన మ్యాచ్‌లో ముంబై 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ సీజన్‌లో ముంబైకి ఇది వరుసగా మూడో విజయం కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై తమ మొదటి ఇన్నింగ్స్‌లో 430 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
ముంబై ఇన్నింగ్స్‌లో అంగ్క్రిష్ రఘువంశీ(114), ముషీర్ ఖాన్(109) భారీ సెంచరీలతో కదం తొక్కారు. అనంతరం హర్యానా తమ తొలి ఇన్నింగ్స్‌లో 270 పరుగులకే ఆలౌటైంది. ముంబై బౌలర్లలో ముషీర్ ఖాన్ 6 వికెట్లతో సత్తాచాటగా.. తనీష్ కొటియన్ మూడు వికెట్లు పడగొట్టాడు.
అయితే 160 పరుగుల తేడాతో ఉండడంతో హర్యానాను ముంబై ఫాలో ఆన్ ఆడాలని నిర్ణయించింది. ఫాలో ఆన్‌లో కూడా హర్యానా ఆట తీరు ఏ మాత్రం మారలేదు. ముంబై స్పిన్నర్ తనీష్ కొటియన్ ఏకంగా 8 వికెట్లు పడగొట్టి హర్యానాను దెబ్బతీశాడు.
దీంతో హర్యానా జట్టు తమ రెండో ఇన్నింగ్స్‌లో 256 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ముంబై ముందు హర్యాని కేవలం 97 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే ఉంచింది. ఈ లక్ష్యాన్ని ముంబై ఓపెనర్లు కేవలం 10.4 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా ఊదిపడేశారు.
ఓపెనర్ ఆంగ్‌క్రిష్ రఘువంశీ హర్యానా బౌలర్లపై విరుచుకుపడుతూ కేవలం 29 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. అతను మొత్తంగా 39 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 67 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మరో ఓపెనర్ దివ్యాన్ష్ సక్సేనా 25 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 30 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టిన ముషీర్ ఖాన్ ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు.


