పవర్లిఫ్టింగ్ పోటీల్లో కాంస్యం సాధించిన డి.వి. శంకరరావు
రెనో (అమెరికా), అక్టోబర్ 15: సంకల్ప బలానికి వయసు అడ్డుకాదని, గుండెకు బైపాస్ సర్జరీ జరిగినా ఆత్మవిశ్వాసంతో ప్రపంచాన్ని జయించవచ్చని నిరూపించారు భద్రాచలానికి చెందిన 74 ఏళ్ల రిటైర్డ్ ఎస్బీఐ అధికారి డి.వి. శంకరరావు. అమెరికాలోని నెవాడా రాష్ట్రం, రెనో నగరంలో జరుగుతున్న 2026 IPF వరల్డ్ మాస్టర్స్ క్లాసిక్ అండ్ ఎక్విప్డ్ పవర్లిఫ్టింగ్ ఛాంపియన్షిప్స్లో మాస్టర్స్-4, 74 కిలోల విభాగంలో ప్రపంచ స్థాయిలో మూడో స్థానం సాధించి కాంస్య పతకం గెలిచి పోడియంపై స్థానం పొందారు.
ఒకప్పుడు గుండె బైపాస్ శస్త్రచికిత్సను ఎదుర్కొన్న శంకరరావు, నేడు అదే గుండె నిండా ఆత్మవిశ్వాసంతో ప్రపంచ క్రీడావేదికపై భారత త్రివర్ణ పతాకానికి గౌరవం తీసుకురావడం అపూర్వమైన ఘట్టం. జాతీయ స్థాయిలో పలు పతకాలు, రికార్డులు సాధించిన ఆయన, ఆర్థిక ఇబ్బందులను సైతం అధిగమించి ప్రపంచ పోటీలకు వెళ్లి ఈ ఘనవిజయం అందుకున్నారు.
ఇది కేవలం ఒక కాంస్య పతకం ఎంతమాత్రం కాదు. ఆయన ప్రదర్శన దేశానికి గర్వకారణం, తెలంగాణకు కీర్తికిరీటం, భద్రాచలానికి అపూర్వ గౌరవమని చెప్పొచ్చు. “వయసు శరీరానికే తప్ప సంకల్పానికి కాదు! గుండెకు శస్త్రచికిత్స జరగవచ్చు, కానీ గుండెలోని గెలవాలనే తపనకు కాదు!” అని శంకర్రావు విషయంలో నిజమైంది.


