ఆన్లైన్ ముప్పు పేరుతో నిరాకరించలేం
జ్ఞాన సముపార్జన, విద్యాభివృద్ధికి అత్యవసరం
డిజిటల్ ప్రపంచానికి వారిని దూరం చేయడం తగదు
స్పష్టం చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం
సాక్షి, న్యూఢిల్లీ: ఇంటర్నెట్ను ఉపయోగించుకోవడం పిల్లల ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. వారికి ఇంటర్నెట్ సేవలను దూరం చేయడం సరికాదని స్పష్టంచేసింది. ‘జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయెన్స్’ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కె.వినోద్ చంద్రన్ల సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ నెల 15న విచారణ చేపట్టింది. నేటి డిజిటల్ యుగంలో విద్య, విజ్ఞాన సముపార్జనకు ఇంటర్నెట్ అత్యంత కీలక సాధనమని గుర్తుచేసింది. ఈ విషయంలో గతంలో ఇచ్చిన తీర్పులను ప్రస్తావించింది.
నూతన ఆలోచనలు, సృజనాత్మక వ్యక్తీకరణకు, సమాచారం పొందడానికి ఇంటర్నెట్ అత్యవసరమని పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ఇంటర్నెట్ను పొందే, ఉపయోగించుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని వెల్లడించింది. అది ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు అని చెప్పడానికి తమకు ఎలాంటి సంకోచం లేదని తెలియజేసింది. మన పిల్లలు వయస్సుతో సంబంధం లేకుండా అవే హక్కులను అనుభవిస్తారని వ్యాఖ్యానించింది. పిల్లలకు హక్కులను పూర్తిగా నిరాకరించడం అనేది అసంబద్ధం అని స్పష్టంచేసింది.
ఆ హక్కును కాలరాయకూడదు
ఆన్లైన్లో పిల్లలకు ఎదురయ్యే సైబర్ బెదిరింపులు, అశ్లీల కంటెంట్, ఇతర హానికరమైన అంశాలను సాకుగా చూపి ఇంటర్నెట్ను పూర్తిగా నిరాకరించడం ఏమాత్రం తగదని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. ఇంటర్నెట్కు దూరంగా ఉంచడం వల్ల పిల్లలు ఆధునిక విద్యా విధానాలకు, ప్రపంచస్థాయి సమాచారానికి దూరం అవుతారని పేర్కొంది. ఇంటర్నెట్ ద్వారా ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి పటిష్టమైన నియంత్రణ వ్యవస్థలను తీసుకురావాలి తప్ప సాంకేతికతను వినియోగించుకునే హక్కును కాలరాయకూడదని సూచించింది. ముప్పు ఉందనే భయంతో జ్ఞానాన్ని దూరం చేయడం రాజ్యాంగ విరుద్ధమని వెల్లడించింది.
విద్యాభివృద్ధికి ఇంటర్నెట్ కీలకం
కరోనా తదనంతర పరిస్థితుల్లో విద్యావ్యవస్థ ఆన్లైన్ వైపు మళ్లిన విషయాన్ని ధర్మాసనం గుర్తుచేసింది. ఆన్లైన్ తరగతులు, అసైన్మెంట్లు, ప్రాజెక్టుల కోసం విద్యార్థులు ఇంటర్నెట్పైనే ఆధారపడుతున్నారని తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటర్నెట్ నిరాకరణ పిల్లల విద్యాభివృద్ధిని, వ్యక్తిగత ఎదుగుదలను అడ్డుకోవడమే అవుతుందని స్పష్టం చేసింది. రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కు, భావ ప్రకటనా స్వేచ్ఛలో భాగంగా ఇంటర్నెట్ వినియోగం ప్రాథమిక హక్కు కిందికే వస్తుందని, ఇది చిన్నారులకూ సమానంగా వర్తిస్తుందని న్యాయస్థానం తన తీర్పులో తెలియజేసింది. ఈ మేరకు 137 పేజీల ఉత్తర్వు జారీ చేసింది. డిజిటల్ సాధికారత సాధించే క్రమంలో చిన్నారుల హక్కులను పరిరక్షించడం ప్రభుత్వాల ప్రథమ కర్తవ్యమని నొక్కిచెప్పింది.


