లాటరీ కింగ్‌ లింక్‌.. తమిళనాడు పాలిటిక్స్‌లో కోట్ల కలకలం! | Lottery king Santiago Martin linked DMK And AIADMK Funds Row | Sakshi
Sakshi News home page

లాటరీ కింగ్‌ లింక్‌.. తమిళనాడు పాలిటిక్స్‌లో కోట్ల కలకలం!

Oct 17 2026 7:58 AM | Updated on Oct 17 2026 7:58 AM

Lottery king Santiago Martin linked DMK And AIADMK Funds Row

రాజకీయాల్లో ప్రత్యర్థులంటే ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటారు! ఎన్నికల బరిలో హోరాహోరీగా తలపడతారు. కానీ విరాళాల దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఇద్దరికీ ఒకే సంస్థ నుంచి భారీగా నిధులు అందాయి. తమిళనాడులో రాజకీయ ప్రత్యర్థులైన డీఎంకే, అన్నాడీఎంకేలకు కోల్‌కతాకు చెందిన టైగర్ అసోసియేట్స్ ఏకంగా రూ.260 కోట్లు విరాళంగా ఇచ్చింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ వివరాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికల సంఘానికి సమర్పించిన నివేదికలను ఉటంకిస్తూ పీటీఐ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇంతకీ ఏ పార్టీకి ఎన్ని కోట్లు వచ్చాయి? ఈ సంస్థకు లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్‌తో ఉన్న సంబంధమేంటి?.

తమిళనాడులో ప్రధాన రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న డీఎంకే, అన్నాడీఎంకేలకు టైగర్ అసోసియేట్స్ భారీ మొత్తంలో విరాళాలు అందించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో అన్నాడీఎంకేకు రూ.135 కోట్లు, డీఎంకేకు రూ.125 కోట్లు ఇచ్చింది. ఈ రెండు పార్టీలకు కలిపి వచ్చిన రూ.352.55 కోట్ల విరాళాల్లో ఈ ఒక్క సంస్థ వాటానే దాదాపు 74 శాతం ఉండటం గమనార్హం. అన్నాడీఎంకేకు అందిన మొత్తం రూ.161.36 కోట్ల విరాళాల్లో టైగర్ అసోసియేట్స్ వాటా దాదాపు 84 శాతం. ఇక డీఎంకేకు వచ్చిన రూ.191.19 కోట్ల విరాళాల్లో ఈ సంస్థ వాటా 65 శాతానికి పైగా ఉంది. అంతకుముందు 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ రెండు పార్టీలకు కలిపి రూ.110 కోట్లు ఇచ్చిన టైగర్ అసోసియేట్స్.. తాజాగా ఆ మొత్తాన్ని రెట్టింపునకు పైగా పెంచింది.

లాటరీ కింగ్‌తో లింక్.. ఏంటీ కథ?
టైగర్ అసోసియేట్స్‌కు లాటరీ వ్యాపారవేత్త శాంటియాగో మార్టిన్‌తో వ్యాపార సంబంధాలున్నట్లు కార్పొరేట్ రికార్డులు సూచిస్తున్నాయి. ఈ సంస్థలో డిజిగ్నేటెడ్ పార్ట్‌నర్‌గా ఉన్న సుబ్బయన్ నాగరాజన్.. మార్టిన్‌కు దీర్ఘకాల వ్యాపార సహచరుడు. వీరిద్దరూ మరో సంస్థలోనూ భాగస్వాములుగా ఉన్నట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. గతంలో మార్టిన్‌కు చెందిన ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ సంస్థ ఎన్నికల బాండ్ల పథకం ద్వారా అత్యధిక మొత్తంలో బాండ్లను కొనుగోలు చేసింది. 2024 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు ఈ పథకాన్ని రద్దు చేసిన తర్వాత బహిర్గతమైన వివరాల ప్రకారం.. ఆ సంస్థ డీఎంకేకు రూ.509 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లను అందించింది. అయితే, టైగర్ అసోసియేట్స్, ఫ్యూచర్ గేమింగ్ వేర్వేరు సంస్థలుగా ఉన్నాయి.

ట్రస్టుల నుంచి కోట్ల విరాళాలు
డీఎంకే, అన్నాడీఎంకేలకు ఎలక్టోరల్ ట్రస్టుల నుంచి కూడా భారీగా విరాళాలు అందాయి. ట్రయంఫ్ ఎలక్టోరల్ ట్రస్ట్ డీఎంకేకు రూ.15 కోట్లు, అన్నాడీఎంకేకు రూ.5 కోట్లు ఇచ్చింది. జైభారత్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి ఈ పార్టీలకు వరుసగా రూ.4 కోట్లు, రూ.3 కోట్లు అందాయి. ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ డీఎంకేకు రూ.25 కోట్లు ఇచ్చింది. ఈ మూడు ట్రస్టులు కలిపి రెండు పార్టీలకు రూ.52 కోట్లు అందించాయి. టైగర్ అసోసియేట్స్‌తో పాటు ఈ మూడు ట్రస్టుల విరాళాలను కలిపితే రూ.312 కోట్లు అవుతాయి. అంటే రెండు పార్టీలకు అందిన మొత్తం విరాళాల్లో దాదాపు 88.5 శాతం ఈ నాలుగు సంస్థల నుంచే వచ్చినట్లు లెక్కలు చెబుతున్నాయి.

డీఎంకేకు మొత్తం విరాళాలు తగ్గినా..
డీఎంకేకు 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.365.82 కోట్ల విరాళాలు అందగా, 2025-26లో ఆ మొత్తం రూ.191.19 కోట్లకు తగ్గింది. అయినప్పటికీ టైగర్ అసోసియేట్స్ నుంచి వచ్చిన విరాళాలు మాత్రం రూ.50 కోట్ల నుంచి రూ.125 కోట్లకు పెరిగాయి. మరోవైపు, అన్నాడీఎంకేకు వచ్చిన మొత్తం రూ.161.36 కోట్ల విరాళాల్లోనూ ఈ సంస్థదే ప్రధాన వాటా. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఈ పార్టీలకు గణనీయమైన విరాళాలు అందాయి. ఆ ఎన్నికల్లో నటుడు విజయ్ స్థాపించిన టీవీకే విజయం సాధించడంతో డీఎంకే అధికారాన్ని కోల్పోయింది. ప్రత్యర్థి పార్టీలకు ఒకే సంస్థ నుంచి వందల కోట్ల విరాళాలు అందడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇదీ చదవండి: దీప్కే ఎక్కడ?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement