తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజైన శనివారం సాయంత్రం పుష్పక విమానంపై రుక్మిణి, సత్యభామ సమేతంగా గోవర్ధనగిరిధారి శ్రీకృష్ణుని అలంకారంలో శ్రీ మలయప్పస్వామివారు భక్తులకు అభయమిచ్చారు. స్వామివారి దివ్యమంగళ రూపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
మూడు సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం సందర్భంగా నిర్వహించే నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో పుష్పక విమానసేవను నిర్వహించడం విశేషం.
వాహనసేవల అనంతరం స్వామి, అమ్మవార్లు సేదతీరే సంప్రదాయంలో భాగంగా ఈ సేవను నిర్వహిస్తారు.
కొబ్బరి చెట్ల ఆకులతో రూపొందించిన ఈ ప్రత్యేక పుష్పక విమానం 24 అడుగుల ఎత్తు, 15 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పుతో, సుమారు ఒక టన్ను బరువు ఉంటుంది. వివిధ రకాల సంప్రదాయ పుష్పాలతో దీనిని సుందరంగా అలంకరించారు.
విమానానికి ఇరువైపులా శ్రీ ఆంజనేయస్వామి, శ్రీ గరుత్మంతుడు, నాలుగు యుగాలకు చెందిన దేవతామూర్తుల రూపాలను తీర్చిదిద్దారు.


