సాక్షి, అమరావతి: పల్నాడు జిల్లాలో పోలీసులు పచ్చ రౌడీలను మరిపిస్తున్నారు. పిడుగురాళ్ల, గురజాల మున్సిపాలిటీల పరిధిలో శనివారం చైర్మన్తో పాటు వార్డు మెంబర్లు అందరితో ఒకేసారి నామినేషన్లు వేయించాలని గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్ రెడ్డి నిర్ణయించారు. ప్రతిచోట భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్లు వేయాలని ప్రణాళిక రూపొందించారు. ఇదే జరిగితే నామినేషన్లు ఆపలేమని భావించిన అధికార పార్టీ నేతలు పోలీసులను అడ్డుపెట్టుకొని కుతంత్రం రచించారు.
ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి పిడుగురాళ్ల, గురజాలలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు, ముఖ్య నేతలను ఏ కారణం చెప్పకుండా వారి ఇళ్లలో అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లు తిప్పుతున్నారు. కుటుంబ సభ్యులు అడ్డుపడినా, వారిని తీవ్రంగా బెదిరించి ఎత్తుకుపోవడం గమనార్హం. గురజాల మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పూలు వీరారెడ్డి, పెదకూరపాడు నియోజకవర్గ పరిశీలకుడు ఎనుముల మురళీధర్ రెడ్డి, మాచర్ల పరిశీలకుడు కొమ్మినేని వెంకటేశ్వర్లుతోపాటు పలువురు ముఖ్య నేతలను పోలీసులు తీసుకెళ్ళినట్లు సమాచారం. అధికార పార్టీ నేతల ఆదేశాలతో పల్నాడు జిల్లాలో పోలీసులు అరాచకాన్ని సృష్టిస్తున్నారని వైఎస్సార్సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే రీతిలో పలు గ్రామాల్లోని ముఖ్య నేతలను సైతం పోలీసులు బలవంతంగా తీసుకెళ్లినట్లు తెలిసింది.
ఇదీ చదవండి: టీడీపీ గూండాయిజం.. ఎస్ఈసీ మౌనం!


