అనేక చోట్ల ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన పచ్చ మూకలు
ఆర్వో కార్యాలయాల వద్ద వందలాదిగా టీడీపీ గూండాలు
సినిమా సీన్లు తల³ంచేలా విధ్వంసాలు
సాయపడిన పోలీసులు.. చేష్టలుడిగిన అధికార యంత్రాంగం
అచేతనంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్
కనిపించని ఎన్నికల స్క్వాడ్లు, వీడియో చిత్రీకరణలు
అధికార పార్టీ అరాచకాలపై ఉదయమే ఎస్ఈసీకి ఫిర్యాదు
తిరిగి పోలీసులకే పంపి చేతులు దలుపుకున్న ఎస్ఈసీ!
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలి రోజునే అధికార పార్టీ మూకలు నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించాయి. వాటిని అమలు చేయాల్సిన అధికార యంత్రాంగం ప్రభుత్వ పెద్దలకు భయపడి చేష్టలుడిగి చూస్తుండిపోయింది. ఇక అధికార పార్టీకి సాగిలపడిన పోలీసు యంత్రాంగం పచ్చ మూకలకు యధాశక్తి సాయపడింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) అచేతనంగా ఉండిపోయింది.
అర్హత ఉండి, ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరూ ఏ ఎన్నికల్లోనైనా పోటీ చేసే స్వేచ్ఛని రాజ్యాంగం కల్పించింది. అయినా కొద్ది రోజులుగా అధికార పార్టీ నేతలు బలమైన విపక్ష నేతలు నామినేషన్లు వేయకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నామినేషన్లు ప్రారంభమైన శుక్రవారం పలు చోట్ల విపక్ష నేతలు, అభ్యర్థులపై ఏకంగా దాడులకే దిగారు. నామినేషన్ల దాఖలు సమయంలో ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ (ఆర్వో) కార్యాలయానికి వంద మీటర్ల పరిధిలో అభ్యర్థులు, వారి సహాయకులను మాత్రమే అనుమతించాలని ఆర్వో నిబంధనావళి ఛాప్టర్ –3లో స్పష్టంగా ఉంది.
కానీ, పుంగనూరులో వైఎస్సార్సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి వచ్చిన సమయంలో వారిని అడ్డుకునేందుకు వందల మంది అధికార పార్టీ మూకలు ఆర్వో గదిని చుట్టుముట్టడం, దాడులకు దిగడం గమనార్హం. వైఎస్సార్సీపీ అభ్యర్థులను అధికార పార్టీ నేతలు భయభ్రాంతులకు గురి చేస్తుండటంతో లోక్ సభ సభ్యుడు మిథున్రెడ్డి స్వయంగా వారిని ఆర్వో కార్యాలయానికి తీసుకొస్తుంటే అధికార పార్టీ మూకలు ఆయన కార్లను వెంటాడి దాడులకు తెగబడ్డాయి. ఆయన అభ్యర్థులను కార్యాలయం సమీపంలో దించి తిరిగి వెళ్తున్న సమయంలోనూ టీడీపీ మూకలు దాడులు చేశాయి.
అయినా పోలీసులు, అధికార యంత్రాంగం ఆ మూకలను అడ్డుకొనే ప్రయత్నం చేయలేదు. రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ టీడీపీ మూకలు చెలరేగిపోయి సినిమా సీన్లను తలపించే రీతిలో దాడులకు తెగబడినా రాష్ట్ర ఎన్నికల కమిషన్ మౌన ముద్ర వహించిందన్న విమర్శలున్నాయి. పుంగనూరు, రాయచోటి, తిరుపతి, దాచేపల్లి వంటి ప్రాంతాల్లో జరిగిన దాడులపై శుక్రవారం ఉదయమే రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేసినా, ఆయన వాటిని తిరిగి పోలీసుల పరిశీలనకే పంపి చేతులు దులుపుకున్నారన్న విమర్శలున్నాయి.
సమస్యాత్మక ప్రాంతాల్లో వీడియో చిత్రీకరణ చేయాల్సి ఉన్నా..
ఎస్ఈసీ ఆదేశాల మేరకు సమస్యాత్మక ప్రాంతాల్లో నామినేషన్ల ప్రక్రియ మొత్తాన్ని ప్రత్యేక బృందాలతో వీడియో చిత్రీకరణ చేయాలి. ఎన్నికలు జరిగే వంద ప్రాంతాల్లో వెయ్యి స్క్వాడ్లను ఏర్పాటు చేసినట్లు షెడ్యూల్ విడుదల సమయంలో మున్సిపల్ శాఖ డైరెక్టర్ తెలిపారు. ఈ స్క్వాడ్లు ఎన్నికలు జరిగే పట్టణాల్లో ఎలాంటి ఘర్షణలు జరగకుండా చూడాలి. సమస్యాత్మక ప్రాంతాల్లో్ల ప్రత్యేక వీడియోగ్రాఫర్లను కూడా తీసుకొని వెళ్లి ప్రతి సంఘటనను రికార్డు చేయాలి. అయితే, పుంగనూరు ఆర్వో కార్యాలయం వద్ద, రాయచోటిలో అధికార పార్టీ గూండాలు దాడులు చేస్తూ విధ్వంసం సృష్టించిన సమయంలో ప్రత్యేక ఎన్నికల స్క్వాడ్లే కనిపించలేదని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
జిల్లాలకే వెళ్లని ఎన్నికల పరిశీలకులు!
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన బుధవారం నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని ఎస్ఈసీ పునేఠా చెప్పారు. శుక్రవారం నుంచి నామినేషన్ల దాఖలు కూడా మొదలైంది. ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా నిర్వహించేలా, కోడ్ ఉల్లంఘనలను నియంత్రించేందుకు ప్రతి జిల్లాకు ఓ ఐఏఎస్ అ«ధికారిని ఎన్నికల పరిశీలకులుగా నియమించింది. ఘర్షణలు, వివాదాలపై ఈ పరిశీలకులు ఇచ్చే నివేదికల ఆధారంగానే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తుది నిర్ణయం తీసుకుంటారు.
అయితే, ఎన్నికల పరిశీలకులుగా నియమితులైన ఐఏఎస్ అధికారులు నామినేషన్ ప్రక్రియ మొదలైనా వారికి కేటాయించిన జిల్లాలకు వెళ్లలేదని అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. కొందరు అధికారులు ఈ విధులపై ఆసక్తి చూపకపోవడంతో కొన్ని జిల్లాల పరిశీలకులను మార్చాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్కు వినతులు వచ్చినట్టు సమాచారం. జిల్లాలకు ఎన్నికల పరిశీలకులే వెళ్లకపోవడంతో పుంగనూరు, రాయచోటి, తిరుపతి వంటి చోట్ల జరిగిన ఘర్షణలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎవరి నివేదికల ఆధారంగా చర్యలు చేపడుతుందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.


