మైనర్లతో చిత్రీకరించే దృశ్యాలు ఉండడానికి వీల్లేదు
పిల్లల సురక్షిత భవిష్యత్తు కోసం ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి
కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: మైనర్లతో చిత్రీకరించే అసభ్యకరమైన దృశ్యాలు, కంటెంట్‌ను అరికట్టడంలో సోషల్ మీడియా వేదికలు వైఫల్యం చెందడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. పిల్లలకు హాని కలిగించే కంటెంట్‌ను ప్రత్యక్షంగా, పరోక్షంగా అందించకుండా, అప్లోడ్ చేయకుండా, ప్రచారం చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
2024లో జారీ చేసిన ఆదేశాలను సోషల్ మీడియా వేదికలు పాటించడం లేదని తాము పదేపదే ప్రస్తావించినప్పటికీ ఎటువంటి చర్యలూ తీసుకోలేదని జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కె.వినోద్ చంద్రన్ల ధర్మాసనం ఆక్షేపించింది.
పోక్సో చట్టంలోని సెక్షన్ 15, ఐటీ చట్టంలోని సెక్షన్ 67బీల నుంచి తప్పించుకునేలా హానికరమైన కంటెంట్‌కు సంబంధించిన పరోక్ష లింక్‌లను సోషల్ మీడియా అల్గారిథమ్‌ల ద్వారా ప్రచారం చేస్తున్నారని, పంచుకుంటున్నారని గుర్తుచేసింది. తాము తీర్పు వెలువరించి రెండేళ్లకు పైగా గడిచినప్పటికీ చెప్పుకోదగ్గ పురోగతి ఏదీ కనిపించడం లేదని తప్పుపట్టింది. ఈ స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం ఈ నెల 15న విచారణ చేపట్టింది.
నియంత్రణ సంస్థలు లేదా సోషల్ మీడియా యాజమాన్యాలు చిత్తశుద్ధితో చొరవ చూపకపోవడంతో ఈ వ్యవహారాలను తాము స్వయంగా తమ చేతుల్లోకి తీసుకోవడం తప్ప మరో మార్గం లేకపోయిందని స్పష్టంచేసింది. మన పిల్లల భద్రత, సంక్షేమానికి సంబంధించి ఇటీవల వచి్చన వార్తా కథనాలు మరింత ఆందోళనకరమైన వాస్తవాలను వెల్లడిస్తున్నాయని తెలిపింది. తమ ముందు ఉంచిన ఆ వార్తా కథనాలను చూసి తీవ్ర విచారం వ్యక్తం చేసింది.
నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానా
బాలల లైంగిక దోపిడీకి సంబంధించిన ఏ అంశాన్ని గానీ సోషల్ మీడియాలో అందుబాటులోకి తీసుకురావడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. పిల్లల సురక్షిత భవిష్యత్తు కోసం ఆచరణీయమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఆన్లైన్ వేదికలపై పిల్లల డేటా ప్రైవసీ దెబ్బతినకుండా చట్టాలను మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. ఆన్లైన్ వేధింపుల కేసుల్లో తక్షణమే స్పందించేలా ప్రత్యేక యంత్రాంగాన్ని బలోపేతం చేయాలని పేర్కొంది.
పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సాంకేతికతను సురక్షితంగా, బాధ్యతాయుతంగా వాడుకునేలా జాతీయ స్థాయిలో సమగ్ర మార్గదర్శకాలను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఐటీ చట్టం, ఐటీ నిబంధనలను ఉల్లంఘించినవారికి జరిమానా విధించే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. అసభ్యకరమైన కంటెంట్‌ను ప్రసారం చేస్తూ ఏదైనా సబ్‌్రస్కిప్షన్ ద్వారా సోషల్ మీడియా వేదికలు ఆదాయాన్ని పొందినట్లయితే ఆ ఆదాయాన్ని జప్తు చేసేలా చర్యలు చేపట్టాలని వెల్లడించింది.


