దేశ యువత సృష్టించిన ‘వ్యంగ్య రాజకీయ ఉద్యమాన్ని’ ప్రస్తావించిన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల నిపుణురాలి నివేదికను భారతదేశం కొట్టిపారేసింది. అదొక వదంతి మాత్రమేనని తేల్చిచేసింది. ధ్రువీకరించని ఆరోపణలు చేయడం సరైంది కాదని పేర్కొంది. ఏదైనా మాట్లాడేముందు నిజానిజాలు తెలుసుకోవాలని ఆ నిపుణురాలికి సూచించింది.
ఐరాస సర్వసభ్య సమావేశం మూడో కమిటీ 81వ సమావేశంలో భారత ప్రతినిధి అనూజ్ స్వరూప్ ఈ మేరకు ప్రకటన చేశారు. భారతదేశంలోని యువత మానసిక ఆరోగ్యం, లింగ సమానత్వం గురించి చర్చించినందుకు ప్రతీకారం లేదా వివక్షను ఎదుర్కొంటున్నారని ఆక్షేపిస్తూ ‘ఫ్రీడమ్ ఆఫ్ పీసుఫుల్ అసెంబ్లీ, అసోసియేషన్’ ప్రత్యేక ప్రతినిధి గినా రోమెరో నివేదిక సమర్పించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఆమె వాదనను ఖండించారు. ధ్రువీకరించని ఆరోపణల ఆధారంగా ప్రపంచంలోనే అతిపెద్ద యువ జనాభాపై చేసిన ఈ తీవ్రమైన ఆరోపణలో ఎంతమాత్రం నిజం లేదని ఉద్ఘాటించారు. ఇది ఐక్యరాజ్యసమితి నివేదిక ముసుగులో జరిగిన వదంతి మాత్రమేనని తెలిపారు.
తమ ప్రతినిధి బృందం దీనిని పూర్తిగా తిరస్కరిస్తున్నట్లు స్వరూప్ తేల్చిచెప్పారు. 140 కోట్ల మంది ప్రజల గురించి ప్రచారం చేయడానికి అజ్ఞాత వ్యక్తులు అందించిన సమాచారంపై ఆధారపడిన ఒక బాధ్యతాయుత అధికారి, తనకు అప్పగించిన బాధ్యతకే అపకారం చేస్తున్నారని విమర్శించారు. ఎవరినైనా విమర్శించే ముందు వాస్తవాలను సరిచూసుకోవాలని స్పష్టంచేశారు. అలాగే నివేదికల్లో నిజాయతీ, నిష్పాక్షికతను పాటించాలని కోరుతున్నట్లు చెప్పారు.


