నేడు, భారత్ విండీస్ ఐదో టి20
సిరీస్ ఫలితాన్ని తేల్చే మ్యాచ్
భారత జట్టులో భువనేశ్వర్‌కు చోటు
రాత్రి 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లలో ప్రసారం
వెస్టిండీస్ టీమ్ భారత గడ్డపై అడుగు పెట్టినప్పుడు అసలు ఆ జట్టు ఏమాత్రం పోటీనివ్వలేదని అంతా భావించారు. కానీ సిరీస్ ఓడినా చివరి వన్డేలో 352 పరుగులు లక్ష్యాన్ని అందుకొని ఆ జట్టు సత్తా చాటింది. టి20ల్లోనైతే భారత్‌కు ఏమాత్రం తగ్గకుండా 2–2తో సమంగా నిలిచింది. ఇలాంటి స్థితిలో ఇప్పుడు టి20 సిరీస్ కోల్పోకుండా భారత్ తమ స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించాల్సి ఉంది. 2019 ఫిబ్రవరి నుంచి సొంత గడ్డపై ఒక్క టి20 సిరీస్ కూడా చేజార్చుకోని టీమిండియా చెలరేగి ఈ రికార్డును కాపాడుకుంటుందా లేక విండీస్ పైచేయి సాధిస్తుందా అనేది ఆసక్తికరం.
బెంగళూరు: నాలుగు టి20 మ్యాచ్‌లలో పరుగుల వరద, పలు కొత్త రికార్డులు నమోదు... ఇప్పుడు సిరీస్ విజేతను తేల్చే ఆఖరి సమరంలో కూడా దాదాపు ఇదే తరహా వేదిక సిద్ధం! భారీ స్కోర్లకు అడ్డావంటి చిన్నస్వామి స్టేడియం, చిన్న బౌండరీలు... ఇక బ్యాటర్లకు తిరుగేముంది. మరోసారి బౌలర్లు భయపడే పిచ్‌పై పోరుకు భారత్, వెస్టిండీస్ సన్నద్ధమయ్యాయి. నేడు జరిగే చివరిదైన ఐదో టి20లో ఇరు జట్లు తలపడనున్నాయి. 2002 నుంచి భారత గడ్డపై ఏ ఫార్మాట్లో సిరీస్ గెలవని వెస్టిండీస్ ఇప్పుడు అరుదైన అవకాశాన్ని అందుకోవాలని సవాల్ విసురుతుండగా... ఆ చాన్స్ ఇవ్వరాదని భారత్ పట్టుదలగా ఉంది.
అభిషేక్ అదరగొట్టేనా...
నాలుగో టి20 మ్యాచ్‌లో భారత్ ఓటమికి కారణాల్లో అభిషేక్ శర్మ వైఫల్యం ఒకటి. 24 బంతుల్లో అతడు 29 పరుగులే చేయడం అనూహ్యం. ఈసారి సామ్సన్తో పాటు అభిషేక్ నుంచి మెరుపు ఆరంభాన్ని ఆశిస్తున్నారు. ఇషాన్ కిషన్ కూడా అంచనాలకు అనుగుణంగా ఆడలేకపోయాడు. తొలి టి20లో సెంచరీ తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా తడబడుతుండగా, తిలక్ వర్మ కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. బౌలింగ్‌లో మన పేలవ ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. మయాంక్ యాదవ్, ప్రిన్స్, అక్షర్, నమన్ ధీర్ విండీస్ హిట్టర్లను ఎలా నిలువరిస్తారనేది చూడాలి.
ఆల్‌రౌండర్‌గా తన స్థానం పదిలం చేసుకోవాలని భావిస్తున్న ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి కీలక సమయాల్లో విఫలమవుతున్నాడు. ఈ మ్యాచ్ అతడికి మరో అవకాశం కల్పిస్తోంది. గత మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో గాయపడిన అర్‡్షదీప్ ఈ మ్యాచ్‌లో ఆడేది అనుమానమే. దాంతో అతని స్థానంలో సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను ఎంపిక చేశారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) రెండు ఐపీఎల్ టైటిల్స్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన భువీ... బెంగళూరు పిచ్‌పై ప్రభావం చూపించవచ్చని భారత్ నమ్ముతోంది. సరిగ్గా నాలుగేళ్ల క్రితం భువీ భారత్ తరఫున తన చివరి టి20 మ్యాచ్ ఆడాడు.
హోప్‌ను ఆపితేనే...
భారత్‌తో పర్యటనకు ముందు కాస్త మెరుగైన బ్యాటర్‌గానే గుర్తింపు ఉన్నా... ఈ టూర్లో షై హోప్ బీభత్సమైన బ్యాటింగ్ ప్రదర్శన చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. మూడు వన్డేల్లో 248 బంతుల్లోనే 278 పరుగులు చేసిన అతను...నాలుగు టి20ల్లో 135 బంతుల్లోనే 261 పరుగులు బాదాడు. వన్డేలు, టి20లు కలిపి హోప్‌ను తొందరగానే అవుట్ చేసిన నాలుగు మ్యాచ్‌లలో నెగ్గిన భారత్... అతను చెలరేగిన 3 మ్యాచ్‌లలో ఓడింది. కాబట్టి అతడిని నిలువరించడం ఎంత కీలకమో అర్థమవుతుంది.
ఆండ్రూ రూపంలో విండీస్‌కు మరో మెరుగైన ఓపెనర్ లభించగా... హెట్‌మైర్, పావెల్, రూథర్‌ఫర్డ్ క్రీజ్‌లో ఉన్నంతసేపు చూపించే విధ్వంసం జట్టు విజయావకాశాలను పెంచుతోంది. గత మ్యాచ్‌లోనైతే షెఫర్డ్‌కు బ్యాటింగ్ రాకుండానే విండీస్ 247 పరుగులు సాధించగలిగింది. బౌలింగ్‌పరంగా విండీస్ బలహీనమే అయినా తమ దూకుడైన బ్యాటింగ్‌తో ఆ లోపాన్ని అధిగమిస్తోంది. ఛేజ్, పాల్, స్ప్రింగర్, గుడకేశ్ మోతీ తమ పరిధిలో ఫర్వాలేదనిపిస్తున్నారు.
పిచ్, వాతావరణం
మంచి బౌన్స్, చిన్న బౌండరీలతో బ్యాటింగ్‌కు స్వర్గధామం. ఎంత భారీ స్కోరు చేసినా ఛేదనకు అవకాశం ఉంది. మంచు ప్రభావం వల్ల టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవచ్చు. వర్షసూచన ఉంది. మ్యాచ్‌కు అంతరాయం కలగవచ్చు.
తుది జట్లు (అంచనా)
భారత్: శ్రేయస్ (కెప్టెన్), సామ్సన్, అభిషేక్, ఇషాన్ కిషన్, తిలక్, నమన్, నితీశ్, అక్షర్, భువనేశ్వర్, మయాంక్, ప్రిన్స్.
వెస్టిండీస్: హోప్ (కెప్టెన్), ఆండ్రూ, హెట్‌మైర్, పావెల్, రూథర్‌ఫర్డ్, షెఫర్డ్, పాల్, ఛేజ్, స్ప్రింగర్, జోసెఫ్, మోతీ.


