కోల్కతా: బెంగాలీయులకు దుర్గా పూజ అంటే దుర్గాదేవిని ఇంటికి ఆహ్వానించడం. ఈ పండుగ సమయంలో చేపలకు సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. బెంగాలీయులు దుర్గాదేవికి ప్రతిరోజూ వివిధ రకాల చేపలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ వంటకాలను ఉల్లిపాయ లేదా వెల్లుల్లి లేకుండా తయారుచేస్తారు. దుర్గా పూజకు వివిధ వర్గాల ప్రజలలో భిన్నమైన అర్థాలు ఉండవచ్చు. కానీ బెంగాలీ సమాజానికి మాత్రం ఎలాంటి పరిమితులు లేకుండా అమ్మవారిపై భక్తిని వ్యక్తపరచడమే లక్ష్యంగా సాగుతుంది. అలాగే శాకాహార, మాంసాహార రుచుల విందు లేకుండా ఏ దుర్గా పూజ కూడా పూర్తి కాదు. వీటిని దుర్గాదేవికి నైవేద్యంగా సమర్పిస్తారు.
చేపలను బెంగాలీయులు అత్యంత శుభప్రదమైనవిగా భావిస్తారు. అవి శ్రేయస్సును, సంతానోత్పత్తి, దీర్ఘాయుష్షను అందిస్తాయని చెబుతారు. దుర్గా పూజ సమయంలో చేపలను ఒక పవిత్రమైన నైవేద్యంగా బావిస్తారు. వారు శాక్త సంప్రదాయాన్ని అనుసరిస్తారు, ఇందులో మాంసాహారం అనేది కృతజ్ఞతను, ఆతిథ్యాన్ని జీవిత పరిపూర్ణతను వ్యక్తీకరించే మార్గంగా పరిగణిస్తారు. కోల్కతాకు చెందిన కళా నిపుణుడు అమర్ ముఖర్జీ తెలిపిన వివరాల ప్రకారం, బెంగాలీయులు దుర్గాదేవికి హిల్సా, రోహూ, ఇతర స్థానిక చేపలను సమర్పిస్తారు. ‘అపారమైన నదీ సంపద ఉన్న బెంగాల్ ఎల్లప్పుడూ చేపలతో సమృద్ధిగా ఉంటుంది, ఇది ప్రకృతి అనుగ్రహాన్ని సూచిస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు.
చేపలకు, దుర్గా పూజకు ఉన్న అనుబంధం గురించి అమర్ వివరిస్తూ ‘సప్తమి నుండి దశమి వరకు రోహూ, పుంటి, హిల్సా, బోయల్, కోయి వంటి చేపలను ప్రతిరోజూ అమ్మవారికి సమర్పిస్తారు’ అని తెలిపారు. ఈ సంప్రదాయం ముఖ్యంగా తూర్పు బెంగాల్ పూజల్లో విస్తృతంగా కనిపిస్తుందని, అక్కడ ఈ నైవేద్యాలను తరతరాలుగా పాటిస్తూ వస్తున్నారని ఆయన తెలిపారు. బెంగాలీయులకు దుర్గాదేవి కేవలం ఒక దేవత మాత్రమే కాదు, నాలుగు రోజుల పాటు తన పిల్లలతో కలిసి పుట్టింటిని సందర్శించడానికి వచ్చిన కన్నకూతురు.
బెంగాలీ కుటుంబాలు అమ్మవారికి అత్యుత్తమమైన వాటితో ఆతిథ్యం ఇవ్వడానికి ఆసక్తి చూపుతారు. ‘బెంగాలీయుల భోజనంలో ఎప్పుడూ అన్నం, చేపలే ప్రధానంగా ఉంటాయి, కాబట్టి కుమార్తె ఇంటికి వచ్చినప్పుడు, కుటుంబ సభ్యులు తాము ఎంతో ఇష్టపడే ఆహారాన్నే ఆమెకు కూడా సమర్పిస్తారు’ అందుకే కొన్ని పూజల్లో చేపలను రకరకాల రూపాల్లో తప్పనిసరిగా వడ్డిస్తారు. దశమి నాడు సమర్పించే నైవేద్యానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ‘ఆ రోజు భోగ్ను ‘పంతా భత్’ అని పిలుస్తారు. దీనిలో రాత్రంతా నానబెట్టిన అన్నంతో పాటు హిల్సా, పుంటి వంటి తెల్లటి పొలుసులు గల చేపలను వడ్డిస్తారు. కూతురు తిరిగి కైలాసానికి వెళ్లడానికి సిద్ధమవుతున్నప్పుడు భోజనంతో ‘చల్లబరచడానికి’ ఇది ఒక మార్గం’అని తెలిపారు. సంప్రదాయబద్ధంగా చూస్తే దశమి నుండి వసంత పంచమి వరకు బెంగాలీ ఇళ్లలో హిల్సా చేపలను వండరు లేదా తినరు. ఎందుకంటే ఈ సమయం హిల్సా చేపల సంతానోత్పత్తి కాలం. పూజ సమయంలో సమర్పించే అన్ని చేపల వంటకాలను ఉల్లిపాయ లేదా వెల్లుల్లి లేకుండా తయారు చేస్తారు. పూజ పవిత్రతను కాపాడుతూనే రుచిని పెంచడానికి జీలకర్ర, ఇంగువ, పచ్చిమిర్చి వంటి సాధారణ సుగంధ ద్రవ్యాలను మాత్రమే వంటలలో ఉపయోగిస్తారు.
ఇదీ చదవండి: 17 రాష్ట్రాల్లో ఇకపై ‘ఎస్ఎస్ఆర్’..‘సర్’కు ఎంత భిన్నం?


