Punjab: పట్టాలు తప్పిన గూడ్సు రైలు.. రాకపోకలకు తీవ్ర అంతరాయం | Goods Train Derail in Punjabs Bathinda | Sakshi
Sakshi News home page

Punjab: పట్టాలు తప్పిన గూడ్సు రైలు.. రాకపోకలకు తీవ్ర అంతరాయం

Oct 17 2026 8:53 AM | Updated on Oct 17 2026 8:53 AM

Goods Train Derail in Punjabs Bathinda

చండీగఢ్: పంజాబ్‌లోని బటిండా సమీపంలోని రాంపురా ఫూల్ రైల్వే స్టేషన్ వద్ద శుక్రవారం కార్లను తీసుకెళ్తున్న ఒక గూడ్స్ రైలుకు చెందిన మూడు బోగీలు పట్టాలు తప్పడంతో రైలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బటిండా నుంచి అంబాలా వైపు ఈ గూడ్స్ రైలు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం గానీ, ఎవరికీ గాయాలు గానీ కాలేదని వెల్లడించారు.

సమాచారం అందిన వెంటనే రైల్వే అధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పునరుద్ధరణ పనులు చేపట్టారు. పట్టాలు తప్పిన బోగీలను తొలగించి, ట్రాక్‌లను పరిశీలించిన అనంతరం రైళ్ల రాకపోకలను తిరిగి పునరుద్ధరించారు. అవసరమైన భద్రతా తనిఖీలు, మరమ్మతు పనుల కారణంగా రైళ్ల రాకపోకలు కొంత సమయం పాటు నిలిచిపోయాయని అధికారులు తెలిపారు. ప్రాథమిక నివేదికల ప్రకారం, చక్రాలకు సంబంధించిన సాంకేతిక లోపం వల్లే రైలు పట్టాలు తప్పి ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే ప్రమాదానికి గల కారణం ఇంకా నిర్ధారణ కాలేదని అధికారులు చెప్పారు.

మహారాష్ట్రలోని రాయ్‌గడ్ జిల్లాలో.. 
ఇలాంటి ఘటనే మరొకటి మహారాష్ట్రలోని రాయ్‌గడ్ జిల్లా కలంబోలి యార్డులో మంగళవారం చోటుచేసుకుంది. అక్కడ గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో గంటకు పైగా ప్రయాణికుల రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగిందని సెంట్రల్ రైల్వే (సీఆర్‌) అధికారులు తెలిపారు. మంగళవారం సాయంత్రం కలంబోలి యార్డ్ సెక్షన్‌లోని పాయింట్ నెం.156 వద్ద గూడ్స్ రైలు వాగన్ ట్రాలీ పట్టాలు తప్పిందని చెప్పారు. ఇంజిన్ నుంచి 11వ వాగన్ ట్రాలీ రాత్రి 7:58 గంటలకు పట్టాలు తప్పినట్లు సెంట్రల్ రైల్వే ప్రతినిధి తెలిపారు. రెండు యాక్సిడెంట్ రిలీఫ్ రైళ్ల సహాయంతో రాత్రి 9:30 గంటల ప్రాంతంలో రైలును తిరిగి ట్రాక్‌పైకి తెచ్చారు. వివిధ రకాల సరుకుతో కూడిన ఈ గూడ్స్ రైలు ఒడిశా నుంచి కలంబోలి యార్డుకు వచ్చిందని ప్రతినిధి పేర్కొన్నారు.

ముంబై సమీపంలోని ప్రధాన ట్రంక్ రూట్లలో ఒకదానిపై రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్ల రాకపోకలపై ప్రభావం పడింది. ఈ కారణంగా సావంత్‌వాడి రోడ్-దివా ప్యాసింజర్ (10106), మడ్గావ్-సిఎస్‌టిఎమ్ మాండోవి ఎక్స్‌ప్రెస్ (10104), గోవా సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ (12449), మడ్గావ్-బాంద్రా టెర్మినస్ ఎక్స్‌ప్రెస్ (10116) రైళ్ల రాకపోకల వేళల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.

ఇదీ చదవండి: దుర్గా పూజలో అమ్మవారికి చేపలు ఎందుకు పెడతారంటే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement