గిరిజన భాగస్వామ్యంతోనే ప్రగతి | Progress through tribal participation | Sakshi
Sakshi News home page

గిరిజన భాగస్వామ్యంతోనే ప్రగతి

Oct 18 2026 2:13 AM | Updated on Oct 18 2026 2:13 AM

Progress through tribal participation

భారతదేశంలోని గిరిజన ప్రాంతాల్లో భూమి, అడవులు, నదులు, స్వపరిపాలనా హక్కుల కోసం దశాబ్దాలుగా పోరాటాలు సాగుతూనే ఉన్నాయి. కేవలం వనరుల కోసమో లేక రాజకీయ అధికారాల కోసమో జరుగుతున్న ఆందోళనలుగా వీటిని చూడలేము. ఈ ఘర్షణల వెనుక ‘అసలు అభివృద్ధి అంటే ఏమిటి, దానిని ఎవరి కోణంలో నిర్వచించాలి?’ అనే లోతైన తాత్విక ప్రశ్న దాగి ఉంది. దశాబ్దాలుగా మన విధాన నిర్ణేతలు విశాలమైన రహదారులు, భారీ ఆనకట్టలు, గనులు, వేగవంతమైన పట్టణీకరణ, జీడీపీ పెరుగుదల వంటి బాహ్య భౌతిక అంశాలనే అభివృద్ధికి ప్రధాన కొలమానాలుగా భావిస్తూ వస్తున్నారు. 

అయితే, ఈ యాంత్రిక దృక్పథం గిరిజన సమాజాల సజీవ జీవన విధానాన్ని, వారి అంతరంగాన్ని అర్థం చేసుకోవడంలో పూర్తిగా విఫలమవుతున్నది. గిరిజనులకు అడవి అంటే కేవలం ఆదాయాన్ని ఇచ్చే కలప కాదు, తమను కనిపెంచిన ప్రాణధాత్రి; నది అంటే విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం కాదు, ప్రాణాలను నిలిపే జీవనాడి;కొండలు అంటే తవ్వి తీయాల్సిన ఖనిజ నిల్వలు కావు, పూర్వీకుల ఆత్మలు సంచరించే పవిత్ర స్థలాలు; భూమి లాభాల కోసం వ్యాపారం చేసే రియల్‌ ఎస్టేట్‌ ఆస్తి కాదు, తమ సంస్కృతినీ భవిష్యత్‌ తరాలనూ కడుపులో దాచుకునే నేలతల్లి. ప్రకృతి పరిరక్షణ, సామూహిక బాధ్యత, సుస్థిర వ్యవసాయ పద్ధతులు, అటవీ సంపద పునరుత్పత్తి, మూలికా వైద్యం వంటి ఎన్నో రంగాల్లో తరతరాలుగా ప్రవహిస్తూ వచ్చిన గిరిజనుల అద్భుతమైన మౌఖిక సంప్రదాయ జ్ఞానాన్ని ఆధునిక సమాజం ‘శాస్త్రీయమైనది కాదు’ అని తేలిగ్గా కొట్టిపారేయడం మన మేధోపరమైన అసమానతకూ, పరిమితులకూ ప్రత్యక్ష నిదర్శనం.

కార్పోరేట్‌ లాభాలా? పర్యావరణ పరిరక్షణా?
1991 నూతన ఆర్థిక సంస్కరణల తర్వాత దేశంలో వేళ్లూనుకున్న ప్రైవేటీకరణ, మార్కెట్‌ ఆధారిత నమూనాలు ఆర్థిక వృద్ధి రేటును పెంచి ఉండవచ్చు కానీ, పర్యావరణ సుస్థిరతను, సామాజిక న్యాయాన్ని, సాంస్కృతిక వైవిధ్యాన్ని తీవ్రంగా దెబ్బ తీశాయి. భారీ బహుళార్థ సాధక ప్రాజెక్టులు, బొగ్గు, బాక్సైట్‌ గనుల తవ్వకాల వల్ల స్వతంత్రంగా బతికిన వేలాది గిరిజన గ్రామాలు ఒక్క రాత్రిలోనే తమ ఉనికిని కోల్పోయాయి. తమ సొంత నేలమీద హక్కులను, ఇళ్లను, వ్యవసాయ భూములను, జీవనోపాధిని కోల్పోయి గిరిజనులు శరణార్థులుగా మారడం, నగరాల మురికి వాడల్లో కూలీలుగా చేరాల్సిన దుస్థితి ఏర్పడటం అత్యంత విచారకరం. 

ఈ అన్యాయమైన అభివృద్ధి నమూనాకు వ్యతిరేకంగా సాగిన ఒడిశాలోని ‘నియమగిరి ఉద్యమం’ దేశ చరిత్రలోనే ఒక చిరస్మరణీయ అధ్యాయంగా నిలిచింది. తమ పవిత్ర నియమరాజా కొండల్లో అంతర్జాతీయ కార్పొరేట్‌ సంస్థ చేపట్టదలచిన బాక్సైట్‌ మైనింగ్‌ను తీవ్రంగా నిరసిస్తూ డోంగ్రియా కొంధ్‌ గిరిజనులు చేసిన పోరాటం సుప్రీంకోర్టు దాకా వెళ్లగా, అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిన గ్రామసభల్లో స్థానిక ప్రజలందరూ ఏకగ్రీవంగామైనింగ్‌ను తిరస్కరించారు. 

ఒక ప్రాజెక్టు విలువను కేవలం దాని వల్ల వచ్చే లాభాలతో కాకుండా స్థానిక సంస్కృతి, జీవనాధారం, పర్యావరణ పరిరక్షణల ఆధారంగానే నిర్ణయించాలని నియమగిరి నిరూపించింది. రాజ్యాంగంలోని 5, 6వ షెడ్యూళ్లు, పేసా చట్టం (1996), అటవీ హక్కుల చట్టం (2006) గిరిజనులకు ప్రత్యేక స్వపరిపాలన, అటవీ హక్కులను చట్టబద్ధం చేసినప్పటికీ, క్షేత్ర స్థాయి నిర్ణయాల్లో గ్రామసభల అనుమతులను నామమాత్రం చేస్తూ నిబంధనలను పక్కనబెట్టడం తీవ్ర నిరాశ కలిగిస్తోంది.

ఆధిపత్య నిర్ణయాలు మానుకోవాలి
నేడు మన ముందున్న అసలు ప్రశ్న ‘ఆధునికత కావాలా వద్దా?’ అనేది కాదు, ‘ఎలాంటి ఆధునికతను మనం నిర్మించు కోవాలి?’ అన్నదే. ఢిల్లీ లేదా న్యూయార్క్‌ వంటి నగరాల్లో తయారైన ఒకే రకమైన మోడల్‌ దేశంలోని ప్రతి పల్లెకూ, ప్రతి అడవికీ ఎంత మాత్రం సరిపోదు. గిరిజనులను కేవలం పరిశోధన కోసం సమాచారం ఇచ్చే వస్తువులుగానో లేక సహాయం పొందాల్సిన బలహీనులుగానో చూడటం మానుకుని, వారిని సజీవ విజ్ఞానాన్ని సృష్టించే సమాన భాగస్వాములుగా గుర్తించేలా విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి. ‘అభివృద్ధిని ఎవరు నిర్వచిస్తున్నారు, దాని ఫలితాలను ఎవరు అనుభవిస్తున్నారు, దానికి సంబంధించిన నష్టాలను ఎవరు భరిస్తున్నారు?’ అనే మౌలిక ప్రశ్నలను మనం ధైర్యంగా వేసుకో వాల్సిన సమయం ఆసన్నమైంది. 

గిరిజనుల సమస్యలను వారికంటే మనమే బాగా అర్థం చేసుకున్నామనే అహంకారంతో వారి తరఫున నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలి. వారితో కలిసి కూర్చోవడం, వారి మాటలను శ్రద్ధగా వినడం, వారి జ్ఞానాన్ని గౌరవించడం, పాలనా నిర్ణయాల్లో వారిని సమాన భాగస్వా ములుగా గుర్తించడమే నిజమైన ప్రత్యామ్నాయ మార్గంఅవుతుంది. గ్లోబల్‌ వార్మింగ్‌తో విలవిలలాడుతున్న నేటి భూగోళాన్ని కాపాడటానికి గిరిజనులు శతాబ్దాలుగా కాపాడుకుంటూ వస్తున్న సామూహిక బాధ్యత, ప్రకృతితో సామరస్యజీవన సూత్రాలే ఏకైక మార్గదర్శకాలు. కేవలం కాంక్రీట్‌ రోడ్లు,ఆకాశ హార్మ్యాలు, గనుల తవ్వకాలు, మార్కెట్‌ లాభాలు మాత్రమే ప్రగతి కావు. ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ, వారి సాంస్కృతికఅస్తిత్వాన్ని పరిరక్షిస్తూ, పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ భవిష్యత్‌ తరాలకు పచ్చని భూమిని అందించడమే నిజమైన సమగ్ర అభివృద్ధి. 

గిరిజనుల మాటలను శ్రద్ధగా వినడం, వారి జ్ఞానాన్ని గౌరవించడం, పాలనా నిర్ణయాల్లో వారిని సమానభాగస్వాములుగా గుర్తించడమే నిజమైన ప్రత్యామ్నాయ మార్గం అవుతుంది.
 


-వ్యాసకర్త ఏకలవ్య ఫౌండేషన్‌ వ్యవస్థాపక చైర్మన్‌
-పి. వేణుగోపాల్‌ రెడ్డి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement