దుర్గామాత మండపం వద్ద తొక్కిసలాట.. 17 మంది మృతి | 17 Killed, Many Injured After Stampede At Kolkata Durga Puja Pandal | Sakshi
Sakshi News home page

Kolkata Stampede: దుర్గామాత మండపం వద్ద తొక్కిసలాట.. 17 మంది మృతి

Oct 17 2026 10:33 PM | Updated on Oct 17 2026 10:55 PM

17 Killed, Many Injured After Stampede At Kolkata Durga Puja Pandal

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తర కోల్‌కతాలోని చోర్ బగాన్ సర్వజనీన్ దుర్గామాత మండపం వద్ద తొక్కిసలాట జరగడంతో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. 

తక్షణమే అప్రమత్తమైన  పోలీసులు, ఫైర్ సిబ్బంది, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ బృందాలు క్షణాల వ్యవధిలో ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయ‌ప‌డిన వారిని స‌మీపంలోని కోల్‌కతా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.

సాయంత్రం 7 గంటల ప్రాంతంలో భారీ వర్షం, ఈదురుగాలుల కారణంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వర్షం ప్రారంభం కావడంతో పండల్ బయట నిలిచి ఉన్న జనం ఒక్కసారిగా ముందుకు తోసుకుని రావడంతో తొక్కిసలాట జరిగినట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఈ క్రమంలో కొందరు రోడ్డుపై ప‌డిపోయి ప్రాణాలు కోల్పోయార‌ని స‌ద‌రు అధికారి పేర్కొన్నారు.

ఘటనా స్థలానికి వెళ్లిన సీఎం
కాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ అగర్వాల్‌తో కలిసి స్వయంగా ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ఆస్పత్రికి వెళ్లిన ఆయన, చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఈ దుర్ఘటనపై పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "చోర్‌బగాన్ పూజా పండల్‌లో జరిగిన తొక్కిసలాట వార్త తీవ్ర దిగ్భ్రాంతిని, బాధను కలిగించింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని, ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబాలకు అమ్మ దుర్గా దేవి మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను" అని ఎక్స్ వేదికగా ఆమె పేర్కొన్నారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement