కోల్కతా: కోల్కతా నగరపు దుర్గా పూజల వైభవంలో ఈసారి కొత్త రూపం కనువిందు చేస్తున్నది. బాగుయిఆటి రైల్ పోఖర్ యునైటెడ్ క్లబ్ తమ 73వ శారదా నవరాత్రుల వేళ చెత్తబుట్టకు చేరాల్సిన వేలాది కిలోల పాత దినపత్రికలను అద్భుతమైన కళాఖండంగా మలిచింది. ప్రముఖ కళాకారుడు సోమనాథ్ తామ్లీ సృజనాత్మక ఆలోచనల నుంచి పుట్టిన ఈ ‘కొల్లాజ్’ మండపం పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని అత్యంత హృద్యంగా చాటిచెబుతోంది.
ప్రతిరోజూ ఉదయమే సమాజాన్ని మేల్కొలిపే న్యూస్ పేపర్లనును ఉపయోగించి, భక్తిశ్రద్ధలతో దివ్య ప్రాంగణాన్ని నిర్మించడం నగరవాసులను మంత్రముగ్ధులను చేస్తోంది. మహిషాసుర మర్దనం కోసం ముక్కోటి దేవతల దివ్య శక్తులన్నీ ఒక్కటై శ్రీ దుర్గాదేవి ఆవిర్భవించిన పురాణ గాథే ఈ మండపం నిర్మాణానికి మూల ప్రేరణగా నిలిచింది. సమాజంలోని వైవిధ్యం, సామూహిక కృషిని ప్రతిబింబించేలా ఈ అక్షర వేదికను తీర్చిదిద్దారు.
బెంగాల్ గడ్డ అందించిన యుగపురుషులు రవీంద్రనాథ్ ఠాగూర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, సత్యజిత్ రే, సత్యేంద్రనాథ్ బోస్, వీరవనిత మాతంగిని హజ్రా, ఈశ్వర చంద్ర విద్యాసాగర్, స్వామి వివేకానందల చారిత్రక ఔన్నత్యాన్ని ఈ పత్రికా కళాకృతుల ద్వారా కళ్లకు కట్టారు. ఆ మహనీయుల ఆలోచనలు, ఆదర్శాలు కాగితపు మడతల్లో సరికొత్త రూపంలో జీవం పోసుకున్నాయి.
ఈ మండపం కేవలం ఒక పర్యావరణహిత నిర్మాణం మాత్రమే కాదు. సమాచార విప్లవ ప్రయాణాన్ని ఆవిష్కరించిన జీవన దర్పణం. వేకువజామునే వార్తాపత్రికల కట్టలు రావడం, వీధివీధినా సైకిళ్లపై పేపర్లు విసురుతూ సాగే ఆత్మీయ అనుబంధాలను ఇక్కడి కళారూపాలు గుర్తుచేస్తున్నాయి. ప్రింట్ జర్నలిజం కాలపు జ్ఞాపకాల నుంచి ఆధునిక స్మార్ట్ఫోన్ల డిజిటల్ యుగం వరకు వార్తా ప్రసారాలలో చోటుచేసుకున్న మార్పులను అద్భుతమైన విజువల్స్ ద్వారా ప్రదర్శించారు. పశ్చిమ బెంగాల్ ఉన్నత విద్యాశాఖ మంత్రి జగన్నాథ్ చటోపాధ్యాయ్, ఎమ్మెల్యే తరుణ్ జ్యోతి తివారీ తదితర ప్రముఖుల సమక్షంలో ఘనంగా ప్రారంభమైన ఈ వేదిక కోల్కతా ముద్రణా సంస్కృతిని నేటి తరానికి సగర్వంగా పరిచయం చేస్తూ, అక్షర జ్యోతులను వెలిగిస్తోంది.
ఇదీ చదవండి: నెట్ సునామీ: డిష్ టీవీలు ఢమాల్.. 75 లక్షమంది గుడ్బై!


