నెట్‌ సునామీ: డిష్‌ టీవీలు ఢమాల్‌.. 75 లక్షమంది గుడ్‌బై! | DTH Connection Decrease 13 Percent in Year | Sakshi
Sakshi News home page

నెట్‌ సునామీ: డిష్‌ టీవీలు ఢమాల్‌.. 75 లక్షమంది గుడ్‌బై!

Oct 14 2026 11:48 AM | Updated on Oct 14 2026 11:48 AM

DTH Connection Decrease 13 Percent in Year

న్యూఢిల్లీ: దేశంలో డైరెక్ట్-టు-హోమ్ (డీటీహెచ్‌) సేవల వినియోగం గణనీయంగా తగ్గిపోతోంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్‌) తాజా నివేదిక ప్రకారం గడిచిన ఏడాది కాలంలో దేశంలోని నాలుగు ప్రధాన డీటీహెచ్‌ ఆపరేటర్ల యాక్టివ్ సబ్‌స్క్రైబర్లలో 13.4 శాతం క్షీణత నమోదైంది. దాదాపు 75.1 లక్షల మంది వినియోగదారులు తమ కనెక్షన్లను రద్దు చేసుకోవడంతో, మొత్తం చెల్లింపుదారుల సంఖ్య 5.6 కోట్ల నుంచి 4.85 కోట్లకు పడిపోయింది. ఇదే సమయంలో ప్రైవేట్ ఎఫ్ఎం రేడియోల ప్రకటనల ఆదాయం కూడా తగ్గడం సంప్రదాయ వినోద మాధ్యమాలపై పెరుగుతున్న ఒత్తిడిని సూచిస్తోంది.

ప్రస్తుత మార్కెట్ వాటాను పరిశీలిస్తే, టాటా ప్లే 1.48 కోట్ల వినియోగదారులతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాతి స్థానాల్లో భారతీ టెలిమీడియా (ఎయిర్‌టెల్) 1.35 కోట్లు, సన్ డైరెక్ట్ 1.09 కోట్లు, డిష్ టీవీ ఇండియా 2.10 లక్షల కస్టమర్లతో నిలిచాయి. అయితే ఈ గణాంకాలలో ప్రసార భారతికి చెందిన ఉచిత సేవ ‘డీడీ ఫ్రీ డిష్’ వినియోగదారుల వివరాలు చేర్చలేదు. కేబుల్ టీవీ (ఎంఎస్‌ఓ) పరిధిలో 3.72 కోట్ల మంది ఉండగా, ఇంటర్నెట్ ఆధారిత టీవీ (ఐపీటీవీ) విభాగంలో భారతీ ఎయిర్‌టెల్ 40.9 లక్షల మంది కస్టమర్లతో ఆధిపత్యం ప్రదర్శిస్తోంది.

ప్రసార రంగ నివేదికల ప్రకారం, జూన్ 30 నాటికి దేశంలో 906 ప్రైవేట్ శాటిలైట్ టీవీ ఛానెళ్లు ప్రసారాలు కొనసాగిస్తుండగా, వాటిలో 342 పే ఛానెళ్లు, 564 ఉచిత ఛానెళ్లు ఉన్నాయి. కాగా, కేబుల్, ఐపీటీవీ సర్వీస్ ప్రొవైడర్లలో కొందరు మాత్రమే ట్రాయ్‌కు అధికారికంగా గణాంకాలు సమర్పించారు. నమోదిత 736 ఎంఎస్‌వోలలో 127 సంస్థలు, 76 ఐపీటీవీ ఆపరేటర్లలో కేవలం 12 ఆపరేటర్లు మాత్రమే తమ చందాదారుల వివరాలను వెల్లడించారు.

డీటీహెచ్‌ కనెక్షన్లు భారీగా తగ్గడానికి చౌకైన హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్, ఓటీటీ (ఓటీటీ)ప్లాట్‌ఫారమ్‌ల పెరుగుదలే ప్రధాన కారణాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు. నిర్ణీత సమయంతో సంబంధం లేకుండా నచ్చిన కంటెంట్‌ను వీక్షించే సదుపాయం ఉండటం, స్మార్ట్ టీవీల ద్వారా యాప్ ప్యాకేజీలు అందుబాటులోకి రావడం వినియోగదారులను ఆకర్షిస్తోంది. మరోవైపు, సాధారణ ఉచిత ప్రసారాలను మాత్రమే ఆశించే గ్రామీణ, పట్టణ వర్గాలు ఉచిత 'డీడీ ఫ్రీ డిష్' వైపు మళ్లుతుండటంతో పే-డీటీహెచ్ మార్కెట్ తీవ్ర ప్రభావానికి లోనవుతున్నది.

ఇదీ చదవండి: సీజేపీ నేతల అరెస్టు పిరికిపంద చర్య: రాహుల్ గాంధీ

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement